India vs Pakistan T20 WC Ticket Price: రూ.1.4 కోట్లు.. ఇండియా, పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ ధర ఇది..
India vs Pakistan T20 WC Ticket Price: ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా జరగబోయే మ్యాచ్ టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఒక టికెట్ ధర గరిష్ఠంగా రూ.1.4 కోట్లు అంటే నమ్మగలరా?
India vs Pakistan T20 WC Ticket Price: టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా దాయాదులు ఇండియా, పాకిస్థాన్ మధ్య జూన్ 9న న్యూయార్క్ లో జరగనున్న విషయం తెలుసు కదా. అత్యంత అరుదుగా అమెరికాలాంటి దేశంలో ఇండోపాక్ ఆడే మ్యాచ్ చూసే అవకాశం దక్కుతుంది. దీంతో ఈ మ్యాచ్ టికెట్ల ధరలు ఆకాశాన్నంటున్నాయి.
ఇండియా vs పాకిస్థాన్ క్రేజ్ ఇదీ
టీ20 వరల్డ్ కప్ 2024 ఈసారి కరీబియన్ దీవులతోపాటు అమెరికాలో జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా తన లీగ్ మ్యాచ్ లన్నీ న్యూయార్క్ లోనే ఆడనుంది. అందులో పాకిస్థాన్ తో ఆడే మ్యాచ్ కూడా ఒకటి. ఈ రెండు దేశాలకు చెందిన పౌరులు ఎక్కువగా ఉండే న్యూయార్క్ లాంటి నగరంలో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుండటంతో సహజంగానే టికెట్లకు ఓ రేంజ్ క్రేజ్ ఉంటుందని అనుకుంటారు.
కానీ ఈ మ్యాచ్ కు మాత్రం క్రేజ్ అన్ని హద్దులూ దాటిపోయింది. అధికారిక టికెట్ అమ్మకాల నుంచి ఈ టికెట్లను పొందినవాళ్లు వేరే వెబ్ సైట్లలో తిరిగి అమ్మకానికి పెడుతున్నారు. వాటి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. 34 వేల మంది కూర్చొని చూసేలా న్యూయార్క్ లో ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా ఓ తాత్కాలిక స్టేడియం నిర్మిస్తున్నారు.
ఇండియా, పాకిస్థాన్ లాంటి మ్యాచ్ కు 34 వేలు అంటే చాలా తక్కువ సామర్థ్యం ఉన్న స్టేడియం అన్ని చెప్పాలి. దీంతో ఆ టికెట్ల కోసం అక్కడి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. అధికారిక సైట్ నుంచి టికెట్లు దక్కించుకున్న వారు రీసేల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఒక్క టికెట్ రూ.1.4 కోట్లు
ఈ మ్యాచ్ కోసం అధికారికంగా టికెట్లను విక్రయిస్తున్న నిర్వాహకులు కనిష్టంగా 6 డాలర్లు (రూ.497), గరిష్ఠంగా రూ.400 డాలర్లు (రూ.33148) వసూలు చేస్తున్నారు. కానీ కొన్ని StubHub, SeatGeekలాంటి రీసేల్ వెబ్ సైట్లలో ఈ టికెట్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. 400 డాలర్ల టికెట్ 40 వేల డాలర్లు (సుమారు రూ.33 లక్షలు)గా ఉండటం గమనార్హం.
పన్నులతో కలిపితే ఇది సుమారు రూ.41 లక్షలకు చేరుతుంది. ఇక యూఎస్ఏ టుడేలో వచ్చిన రిపోర్టు ప్రకారం ఈ మధ్య జరిగిన సూపర్ బౌల్ టికెట్ గరిష్ఠంగా 9 వేల డాలర్లకు, ఎన్‌బీఏ ఫైనల్స్ లో కోర్టు పక్కనే ఉండే టికెట్లు 24 వేల డాలర్లకు అమ్ముడయ్యాయి. వాటితో పోలిస్తే ఇండియా, పాకిస్థాన్ టికెట్ల ధర చాలా చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.
SeatGeek వెబ్ సైట్ లో అయితే ఇండియా, పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ ధర 1.75 లక్షల డాలర్లు (సుమారు రూ.1.4 కోట్లు)గా ఉంది. దీనికి ట్యాక్స్ లు, ఫీజులు కలిపితే రూ.1.86 కోట్లకు చేరుతుంది. ఈ టికెట్ల ధరలు చూసి క్రికెట్ అభిమానులు షాక్ తింటున్నారు. జూన్ 1 నుంచి జూన్ 29 వరకు అమెరికా, కరీబియన్ దీవులలో ఈ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. జూన్ 5న ఐర్లాండ్ తో ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది.