Psl League: పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు ఆదరణ కరువు - ఖాళీ స్టాండ్‌లతో దర్శనమిస్తోన్న స్టేడియాలు
Psl League: పాకిస్థాన్ సూపర్ లీగ్ జరుగుతోన్న స్టేడియాలు క్రికెట్ ఫ్యాన్స్ లేక వెలవెలబోతున్నాయి. ఇండియా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కంటే పీఎస్ఎల్ లీగ్‌లో తక్కువ సంఖ్యలో క్రికెట్ ఫ్యాన్స్ కనిపిస్తోన్నారు. రెంటింటిని కంపేర్ చేస్తూ నెటిజన్లు చేస్తోన్న ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
Psl League: పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై క్రికెట్ అభిమానులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. పాకిస్థాన్‌లోని ప్రధాన స్టేడియం కరాచీతో పాటు మిగిలిన స్టేడియాలలో జరిగిన పీఎస్ఎల్ మ్యాచ్‌లకు చాలా తక్కువ సంఖ్యలో క్రికెట్ ఫ్యాన్స్ హాజరవుతోన్నారు. పీఎస్ఎల్ లీగ్ నిర్వహిస్తోన్న స్టేడియాలు చాలా వరకు ఖాళీ స్టాండ్‌లతో దర్శనమిస్తోన్నాయి. ప్రేక్షకుల సందడి లేకుండా సైలెంట్‌గా మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ ఖాళీ స్టాండ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కంటే తక్కువే...
ఇండియాలో జరుగుతోన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ల కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు తక్కువ సంఖ్యలో ప్రేక్షకులు అటెండ్ అవుతోన్నారు. డబ్ల్యూపీఎల్, పీఎస్ఎల్‌లకు హాజరవుతోన్న క్రికెట్ ఫ్యాన్స్‌ను కంపేర్ చేస్తూ నెటిజన్లు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఈ ఫొటోల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టేడియాలు ఫుల్‌గా కనిపిస్తున్నాయి. పీఎస్ఎల్ లీగ్ మాత్రం జనాలు లేక వెలవెలబోతున్నాయి. పీఎస్ఎల్ క్లబ్ లెవల్ లీగ్‌కు కూడా సాటి రాదంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. పీఎస్ఎల్ లీగ్ ఆపేసే రోజులు దగ్గర పడ్డట్టే కనిపిస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. స్టాండ్స్‌లో కంటే గ్రౌండ్‌లోనే ఎక్కువ మంది కనిపిస్తున్నారని మరో నెటిజన్ ఫన్నీగా కామెంట్స్ చేశాడు.
బోర్డు సమర్థింపు...
పీఎస్ఎల్ లీగ్ చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ రాకపోవడంతో పాకిస్థాన్ బోర్డుకు మింగుడుపడటం లేదు. విమర్శలు పెరగడంతో మాజీ క్రికెటర్లు బోర్డుకు అండగా నిలుస్తోన్నారు. కరాచీలో జరిగిన మ్యాచ్‌కు వందల సంఖ్యలోనే ఫ్యాన్స్ వచ్చారు. కరాచీలో ట్రాఫిక్ జామ్ సమస్య వల్ల చాలా మంది ఈ మ్యాచ్‌కు అటెండ్ కాలేకపోయారని, తాను ట్రాఫిక్‌లో గంటన్నరపైగా చిక్కుకొని చివరకు ఈ మ్యాచ్‌కు వచ్చానని తెలిపాడు. అయితే అతడు చెప్పిన కారణాలను క్రికెట్ ఫ్యాన్స్ కొట్టిపడేస్తున్నారు.
స్టార్ క్రికెటర్లు దూరం....
ఈ సారి పీఎస్ఎల్ లీగ్‌కు చాలా మంది విదేశీ క్రికెటర్లు దూరమయ్యారు. పొల్లార్డ్, రషీద్‌ఖాన్, హసరంగ, లుంగీ ఎంగిడితో పాటు పలువురు ఫారిన్ క్రికెటర్స్ పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024 సీజన్ ఆడటం లేదు. ఇతర దేశాల్లో జరుగుతోన్న టీ20 లీగ్‌ల కోసం పీఎస్ఎల్ లీగ్‌కు దూరమయ్యారు.
పెద్దగా పేరులేని అనామక క్రికెటర్లతోనే ఈ ఏడాది పీఎస్ఎల్ లీగ్ జరుగుతోండటంతో క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్‌లను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. ఫారిన్ క్రికెటర్ల దూరమే పీఎస్ఎల్ లీగ్ ఆదరణ తగ్గడానికి ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతోన్నారు.
నెల రోజుల పాటు...
ఈ ఏడాది పీఎస్ఎల్ లీగ్ ఫిబ్రవరి 17న మొదలైంది. మార్చి 18న ఫైనల్ జరుగనుంది. నెల రోజుల పాటు ఈ లీగ్‌ను నిర్వహించబోతున్నారు. ఈ లీగ్‌లో పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ పెషావర్ జాల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. పీఎస్ఎల్ లీగ్‌లో పరుగుల వదర పారిస్తోన్నాడు. ఈ లీగ్‌లో మూడు వేల పరుగులు పూర్తిచేసుకున్న తొలి క్రికెటర్‌గా ఇటీవల రికార్డు నెలకొల్పాడు.
ఐపీఎల్‌కు పోటీగా...
ఐపీఎల్‌కు పోటీగా పీఎస్ఎల్ లీగ్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 2016లో ప్రారంభించింది. ఇప్పటివరకు ఎనిమిది సీజన్స్ ముగిశాయి. ప్రస్తుతం తొమ్మిదో సీజన్ జరుగుతుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజ్‌లు ఆడుతోన్నాయి.