IPL 2024: బెంగళూరు మళ్లీ ఢమాల్.. చెలరేగిన లక్నో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్.. అలవోకగా 150 కి.మీపైగా వేగంతో బంతులు-lsg 21 year old pacer mayank yadav bowled fastest delivery in ipl 2024 rcb lost against lucknow super gaints ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024: బెంగళూరు మళ్లీ ఢమాల్.. చెలరేగిన లక్నో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్.. అలవోకగా 150 కి.మీపైగా వేగంతో బంతులు

IPL 2024: బెంగళూరు మళ్లీ ఢమాల్.. చెలరేగిన లక్నో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్.. అలవోకగా 150 కి.మీపైగా వేగంతో బంతులు

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 02, 2024 11:11 PM IST

IPL 2024 RCB vs LSG: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు హోం గ్రౌండ్‍లో వరుసగా రెండో మ్యాచ్‍ ఓడిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav) మరోసారి చెలరేగాడు. అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‍లో మరోసారి ఫాస్టెస్ట్ బాల్ కూడా వేశాడు

IPL 2024: బెంగళూరు మళ్లీ ఢమాల్.. నిప్పులు చెరిగిన లక్నో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్.. అలవోకగా 150 కి.మీపైగా వేగంతో బంతులు
IPL 2024: బెంగళూరు మళ్లీ ఢమాల్.. నిప్పులు చెరిగిన లక్నో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్.. అలవోకగా 150 కి.మీపైగా వేగంతో బంతులు (PTI)

IPL 2024 RCB vs LSG: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తీవ్రంగా నిరాశపరిచింది. తన హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో వరుసగా రెండో మ్యాచ్‍లో ఓడింది. నాలుగు మ్యాచ్‍ల్లో మూడో ఓటమితో ఆర్సీబీ చతికిలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేడు (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్‍లో ఆర్సీబీ 28 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో ఓడిపోయింది.

yearly horoscope entry point

దుమ్మురేపిన డికాక్, పూరన్

టాస్ ఓడి ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసింది లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (20) త్వరగానే ఔటైనా ఓపెనర్ క్లింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 81 పరుగులు చేశాడు. మొత్తంగా 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 రన్స్ చేసింది లక్నో. చివర్లో నికోలస్ పూరన్ 15 బంతుల్లోనే 40 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 5 సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. బెంగళూరు బౌలర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెండు, రీస్ టోప్లీ, యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు.

మెరిసిన మయాంక్.. ఆర్సీబీ కుదేలు

లక్నో 21 ఏళ్ల పేసర్ మయాంక్ యాదవ్ 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తన సూపర్ వేగంతో బెంగళూరు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. 150 కిలోమీటర్ల(కి.మీ)కు పైగా వేగంతో బంతులు సంధించాడు. లక్ష్యఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (22), ఫాఫ్ డుప్లెసిస్ (19) మంచి ఆరంభాన్ని అందుకున్నా కొనసాగించలేకపోయారు. ఐదో ఓవర్లో కోహ్లీ.. ఆ తర్వాతి ఓవర్లో ఫాఫ్ డుప్లెసిస్ ఔటయ్యారు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0), కామెరూన్ గ్రీన్ (9)ను లక్నో పేసర్ మయాంక్ యాదవ్ వెనువెంటనే ఔట్ చేశాడు. దీంతో 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆర్సీబీ. కాసేపు నిలిచిన రజత్ పటిదార్ (29)ను కూడా యాదవ్ ఔట్ చేశాడు. చివర్లో బెంగళూరు బ్యాటర్ మహిపాల్ లోమ్రోర్ (13 బంతుల్లో 33 పరుగులు) అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. మిగిలిన బ్యాటర్లు పెవిలియన్‍కు క్యూ కట్టారు. లక్నో పేసర్ నవీనుల్ హక్ రెండు, యశ్ ఠాకూర్, స్టొయినిస్, మణిమరన్ సిద్ధార్థ్ చెరో వికెట్ తీసుకున్నారు.

మయాంక్ యాదవ్ విజృంభణ

లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ మరోసారి అదరగొట్టాడు. అలవోకగా గంటకు 150 కిలోమీటర్లకు (kmph) పైగా వేగంతో బంతులు సంధించాడు డిల్లీకి చెందిన ఈ 21 ఏళ్ల పేసర్. సూపర్ ఫాస్ట్ బౌలింగ్‍తో మయాంక్ మరోసారి మెప్పించాడు. గత మ్యాచ్‍ తన ఐపీఎల్ అరంగేట్రంలో మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‍గా నిలిచిన మయాంక్.. బెంగళూరుతో నేటి మ్యాచ్‍లో మరింత విజృంభించాడు. 150 kmphకు పైగా వేగంతో బంతులు వేసి బెంగళూరు బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. 151 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతితో ఆర్సీబీ స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‍ను ఔట్ చేశాడు మయాంక్. అద్భుతమైన ఇన్‍స్వింగర్ వేసి కామెరూన్ గ్రీన్ (9)ను బౌల్డ్ చేశాడు. మొత్తంగా అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ చేశాడు. ఫ్యూచర్ టీమిండియా పేస్ స్టార్‌గా నిలుస్తాడనే ఆశలను రేపాడు.

ఈ సీజన్‍లో వేగవంతమైన బాల్

ఐపీఎల్ 2024 సీజన్‍లో వేగవంతమైన బాల్ వేశాడు మయాంక్ యాదవ్. ఈ మ్యాచ్‍లో 156.7 కిలోమీటర్ల వేగంతో ఓ బంతి వేశాడు. 21 ఏళ్ల వయసులోనే భీకర పేస్‍తో బౌలింగ్ చేస్తున్నాడు మయాంక్.

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‍ల్లో రెండు గెలిచిన లక్నో 4 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. నాలుగు మ్యాచ్‍ల్లో మూడు ఓడిన బెంగళూరు 9వ స్థానానికి పడిపోయింది.

ఐపీఎల్ 2024 సీజన్‍లో రేపు (ఏప్రిల్ 3) విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‍కతా నైట్‍రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

Whats_app_banner