RCB vs PBKS: విరాట్ కోహ్లీ వీరవిహారం.. కార్తీక్, లోమ్రోర్ ఫినిషింగ్ పంచ్.. హోం గ్రౌండ్‍లో బెంగళూరు బోణీ
RCB vs PBKS Highlights - IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి గెలుపు నమోదు చేసింది. విరాట్ కోహ్లీ మెరుపు అర్ధ శతకంతో దుమ్మురేపితే.. చివర్లో దినేశ్ కార్తిక్ అదరగొట్టాడు. దీంతో పంజాబ్‍పై ఆర్సీబీ విజయం సాధించింది.
Royal Challengers Bengaluru vs Punjab Kings: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుతో హోం గ్రౌండ్‍లో నేడు (మార్చి 25) జరిగిన మ్యాచ్‍లో ఆర్సీబీ ఉత్కంఠ విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నేడు జరిగిన మ్యాచ్‍లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్‍పై గెలిచింది.
హిట్టింగ్ మెరుపులు
లక్ష్యఛేదనలో బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (49 బంతుల్లో 77 పరుగులు; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుతమైన అర్ధ శతకం చేశాడు. తన మార్క్ షాట్లతో బెంగళూరు ప్రేక్షకుల హోరు మధ్య విరాట్ వీరవిహారం చేశాడు. చివర్లో బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తీక్ (10 బంతుల్లో 28 పరుగులు; నాటౌట్) సూపర్ హిట్టింగ్ చేశాడు. 3 ఓవర్లకు 36 పరుగులు చేయాల్సిన దశలో అదరగొట్టి జట్టును గెలిపించాడు. ఒత్తిడిలో సూపర్ హిట్టింగ్ చేశాడు. మహిపాల్ లోమ్రోర్ (8 బంతుల్లో 17 పరుగులు; నాటౌట్) కూడా దుమ్మురేపాడు. 4 బంతులు మిగిల్చి ఆర్సీబీ గెలిచింది.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 రన్స్ చేసింది. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ (45) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ చెరో రెండు వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 రన్స్ చేసిన ఆర్సీబీ విజయం సాధించింది. విరాట్, కార్తీక్, లోమ్రోర్ అదరగొట్టారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 4 ఓవర్లలో కేవలం 13 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసి రాణించాడు. కగిసో రబాడా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అయితే, మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చేయడంతో పంజాబ్‍కు ఎదురుదెబ్బ తగిలింది.
ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఓడిన.. బెంగళూరు ఎట్టకేలకు తన రెండో మ్యాచ్‍లోనే బోణీ చేసింది. పాయింట్ల ఖాతాను తెరిచింది.
కోహ్లీ వీరబాదుడు
177 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు జట్టుకు మొదట్లోనే షాక్ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (3), కామెరూన్ గ్రీన్ (3)ను పంజాబ్ బౌలర్ కగిసో రబాడా పెవిలియన్‍కు పంపాడు. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. తన మార్క్ డ్రైవ్‍లతో పాటు దూకుడైన షాట్లతో దుమ్మురేపాడు. ఏ దశలోనూ రన్‍రేట్ తగ్గకుండా ఆడాడు. దీంతో 31 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. కాసేపు నిలిచిన పాటిదార్ (18), గ్లెన్ మ్యాక్స్ వెల్ (3) ఔటవటంతో బెంగళూరు కష్టాల్లో పడింది. కోహ్లీ మరో ఎండ్‍లో కాసేపు జోరు కొనసాగించాడు. అయితే, 16వ ఓవర్లో విరాట్ కోహ్లీ ఔటవటంతో గెలుపు ఆశలు సన్నగిల్లాయి.
చివర్లో కార్తీక్, లోమ్రోర్ అదుర్స్
గెలవాలంటే ఆర్సీబీ చివరి నాలుగు ఓవర్లలో 47 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దశలో అనూజ్ రావత్ (11) కూడా పెవిలియన్ చేరాడు. అయితే, ఆ తర్వాత మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్ చెలరేగారు. 18వ ఓవర్లో లోమ్రోర్ సిక్స్, ఫోర్ బాదగా.. ఆ ఓవర్లో 13 రన్స్ వచ్చాయి. హర్షల్ వేసిన 19వ ఓవర్లో కార్తీక్ సిక్స్, ఫోర్ కొట్టాడు. ఆ ఓవర్లో 13 పరుగులు దక్కాయి. చివరి ఓవర్లో బెంగళూరు 10 రన్స్ చేయాల్సి ఉండగా.. పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్ చేశాడు. తొలి బంతికే కార్తీక్ స్కూప్ ఆడి సిక్స్ సాధించాడు. ఆ తర్వాత ఓ వైడ్ రాగా.. రెండో బంతికి ఫోర్ కొట్టి జట్టును గెలుపు తీరాన్ని దాటించాడు కార్తీక్.
అంతకు ముందు పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (45) రాణించగా.. ప్రభ్ సిమ్రన్ సింగ్ (25), జితేశ్ శర్మ (27), సామ్ కరన్ (23) తలా కొన్ని రన్స్ చేశారు. చివర్లో శశాంక్ సింగ్ (8 బంతుల్లో 21 పరుగులు) దూకుడుగా ఆడడంతో పంజాబ్ 176 రన్స్ చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించేసింది.