Virat Kohli IPL 2024: ఇండియాకు తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. మీరెలా ఉన్నారని అడిగిన కింగ్: వీడియో
Virat Kohli - IPL 2024: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు స్వదేశంలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virat Kohli: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. భారత్‍కు తిరిగి వచ్చేశాడు. ముంబై ఎయిర్ పోర్టులో నేడు అడుగుపెట్టాడు. తనకు రెండో సంతానం జన్మించనున్న నేపథ్యంలో ఇంగ్లండ్‍తో స్వదేశంలో టెస్టు సిరీస్‍కు కోహ్లీ దూరమయ్యాడు. కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఫిబ్రవరి 15వ తేదీన కుమారుడు జన్మించారు. అతడికి అకాయ్ అని పేరు పెట్టారు విరాట్. రెండో సంతానం పొందిన తర్వాత ఇండియాలో ఇప్పుడు అడుగుపెట్టాడు కోహ్లీ.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ మరో ఐదు రోజుల్లో అంటే మార్చి 22వ తేదీన మొదలుకానుంది. దీంతో తన టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ట్రైనింగ్ క్యాంప్‍లో త్వరలో జాయిన్ అవనున్నాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు మధ్యే జరగనుంది.
ఎలా ఉన్నారు?
ముంబై విమానాశ్రయంలో కోహ్లీ అడుగుపెట్టారు. బ్లాక్ టీ షర్ట్, క్యాప్ ధరించారు. బయటికి వస్తుండగా.. ఎలా ఉన్నారని అక్కడి వారు విరాట్ కోహ్లీని అడిగారు. దీంతో తాను బాగానే ఉన్నానని, మీరు ఎలా ఉన్నారని కోహ్లీ అన్నారు. ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తున్నామని అక్కడి వారు అన్నారు. ఆ తర్వాత కారు ఎక్కి అక్కడి నుంచి కోహ్లీ వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. లండన్ నుంచి కోహ్లీ వచ్చినట్టు తెలుస్తోంది.
ఐపీఎల్‍కు ముందు విరాట్ కోహ్లీ భారత్‍కు తిరిగి వచ్చేయడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‍లో అతడు ఆడతాడా లేదా అన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. మరో రెండు రోజుల్లోగానే ఆర్సీబీ ట్రైనింగ్ క్యాంప్‍కు కోహ్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మార్చి 19వ తేదీన ఆర్సీబీ ఫ్రాంచైజీ అన్‍బాక్స్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‍లో కోహ్లీ పాల్గొంటాడనే అంచనాలు ఉన్నాయి.
ఐపీఎల్‍లో 16 సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టైటిల్ అందని ద్రాక్షగానే నిలిచింది. విరాట్ కోహ్లీ సహా మరికొందరు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలు చేసినా.. ఆ జట్టుకు మాత్రం ఇప్పటి వరకు టైటిల్ దక్కలేదు. దీంతో ఈ 17వ సీజన్‍లో అయినా టైటిల్ పట్టాలన్న కసితో ఉంది బెంగళూరు.
కోహ్లీ ఐపీఎల్ రికార్డులు
ఐపీఎల్‍లో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల వీరుడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. 16 ఏళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న కోహ్లీ 237 ఐపీఎల్ మ్యాచ్‍ల్లో 7,263 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక ఐపీఎల్ సెంచరీల రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది.
ఐపీఎల్ 2024 సీజన్‍కు సంబంధించి తొలి దశ షెడ్యూల్‍ను బీసీసీఐ వెల్లడించింది. తొలి 21 మ్యాచ్‍లను ఖరారు చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో రెండు దశలుగా ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు చేయాలని డిసైజ్ అయింది. రెండో దశ షెడ్యూల్‍ను త్వరలోనే వెల్లడించనుంది. ఐపీఎల్ 2024 రెండో దశ విదేశాల్లో జరుగుతుందనే రూమర్లు వచ్చాయి. అయితే, పూర్తి సీజన్‍ను ఇండియాలోనే నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చేశాయి.