LSG vs PBKS: పంజాబ్‍ను దెబ్బకొట్టిన 21 ఏళ్ల పేసర్.. ఈ సీజన్‍లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన మయాంక్ యాదవ్.. బోణీ కొట్టిన లక్నో
LSG vs PBKS IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో మ్యాచ్‍లో గెలిచింది. లక్నో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ అద్భుత బౌలింగ్‍తో పంజాబ్ బ్యాటర్లను గడగడలాడించాడు. ఈ సీజన్‍లో ఫాస్టెస్ట్ బాల్ వేశాడు.
Lucknow Supergiants vs Punjab Kings: ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పాయింట్ల ఖాతా తెరిచింది. ఈ సీజన్‍లో తన రెండో మ్యాచ్‍లో బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్ జట్టుపై నేడు (మార్చి 30) జరిగిన మ్యాచ్‍లో లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. హోం గ్రౌండ్ ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‍లో ఆల్‍రౌండ్ షో చేసిన లక్నో గెలిచింది.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (38 బంతుల్లో 54 పరుగులు) అర్ధ శతకంతో దుమ్మురేపితే.. తాత్కాలిక కెప్టెన్ నికోలస్ పూరన్ (21 బంతుల్లో 42 పరుగులు), కృణాల్ పాండ్యా (22 బంతుల్లో 43 పరుగులు నాటౌట్) మెరుపు బ్యాటింగ్ చేశారు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు, అర్షదీప్ రెండు, రబాడా, రాహుల్ చాహర్ చెరో వికెట్లు తీశారు.
లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు మాత్రమే చేయగలిగింది పంజాబ్ కింగ్స్. కెప్టెన్ శిఖర్ ధావన్ (50 బంతుల్లో 70 పరుగులు) అర్ధ శకతం చేయగా.. మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో (29 బంతుల్లో 42 పరుగులు) రాణించాడు. అయితే, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. లక్నో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ (3/27) అద్బుతమైన బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‍లోనే నిప్పులు చెరిగే బౌలింగ్ చేశాడు. వెనువెంటనే మూడు వికెట్లు లక్నో గెలుపులో కీలకపాత్ర పోషించాడు. లక్నో బౌలర్ మొహ్‍సిన్ ఖాన్ రెండు వికెట్ల పడగొట్టాడు.
నిప్పులు చెరిగిన మయాంక్ యాదవ్
తన తొలి ఐపీఎల్ మ్యాచ్‍లో లక్నో సూపర్ జెయింట్స్ 21 ఏళ్ల పేసర్ మయాంక్ యాదవ్ అదరగొట్టాడు. సూపర్ ఫాస్ట్ బౌలింగ్‍తో చెలరేగాడు. పంజాబ్ కింగ్స్ ఓ దశలో 102 పరుగులు చేసి వికెట్లేమీ కోల్పోలేదు. దీంతో అలవోకగా గెలుస్తుందేమో అనిపించింది. ఆ తరుణంలో బౌలింగ్‍లో దుమ్మురేపి మ్యాచ్ స్వరూపం మార్చేశాడు మయాంక్. దీటుగా ఆడుతున్న జానీ బెయిర్ స్టో (42)ను ఆ తర్వాత ప్రభ్ సిమ్రన్ సింగ్ (19), జితేశ్ శర్మ (6)లను మయాంక్ యాదవ్ ఔట్ చేశాడు. 10 ఓవర్ల వరకు పంజాబ్ గెలుస్తుందని అనుకోగా.. ఒక్కసారిగా మ్యాచ్‍ను లక్నో వైపు మలుపుతిప్పాడు మయాంక్ యాదవ్. శిఖర్ ధావన్, సామ్ కరన్ (0)ను లక్నో బౌలర్ మొహ్‍సిన్ ఖాన్ ఔట్ చేశాడు.
ఈ సీజన్‍లో ఫాస్టెస్ట్ బాల్
ఐపీఎల్ 2024 సీజన్‍లో అత్యంత వేగవంతమైన బాల్ వేశాడు మయాంక్ యాదవ్. గంటలకు 155.8 కిలోమీటర్ల వేగంతో ఓ బాల్ వేశాడు. దీంతో ఈ సీజన్‍లో ఫాస్టెస్ట్ బాల్ నమోదు చేశాడు ఈ 21 ఏళ్ల ఉత్తరప్రదేశ్ పేసర్. ఏకంగా 18 బంతులను 145 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో సంధించాడు.
లక్నో రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (15) ఈ మ్యాచ్‍లో బ్యాటింగ్ మాత్రమే చేసేందుకు నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‍లో లక్నోకు నికోలస్ పూరన్ కెప్టెన్సీ చేశాడు. ఇటీవల గాయం నుంచి కోలుకొని రావటంతో బ్రేక్ కోసం రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్‍లో బ్యాటింగ్ తర్వాత రాహుల్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు పేసర్ నవీనుల్ హక్.