LSG vs PBKS KL Rahul: కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నా టాస్‍కు వచ్చిన నికోలస్ పూరన్.. కారణమిదే
LSG vs PBKS IPL 2024: పంజాబ్ కింగ్స్ జట్టుతో మ్యాచ్‍లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు నికోలస్ పూరన్ కెప్టెన్సీ చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నా.. అతడే సారథ్యం వహిస్తున్నాడు. ఎందుకంటే..
LSG vs PBKS: ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడేందుకు బరిలోకి దిగాయి. ఈ రెండు జట్ల మధ్య నేడు (మార్చి 30) మ్యాచ్ జరుగుతోంది. లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా ఈ పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో ముందుగా టాస్ గెలిచిన లక్నో జట్టు బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్‍లో కేఎల్ రాహుల్ అందుబాటులో ఉన్నా.. లక్నో టీమ్‍కు నికోలస్ పూరన్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. టాస్‍కు కూడా అతడే వచ్చాడు.
కారణమిదే..
పంజాబ్‍తో ఈ మ్యాచ్‍లో లక్నో తుదిజట్టులో రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్‍లో అతడు బ్యాటింగ్ మాత్రమే చేయనున్నాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ సమయంలో అతడి స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ రానున్నాడు. కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకొని వచ్చాడని, అందుకే అతడికి బ్రేక్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాస్ సమయంలో పూరన్ చెప్పాడు. ఈ మ్యాచ్‍కు ఆ విండీస్ స్టార్ కెప్టెన్సీ చేస్తున్నాడు.
కేఎల్ రాహుల్‍ను ఈ మ్యాచ్‍లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలని లక్నో భావించింది. అయితే, తొలుత బ్యాటింగ్ రావడంతో అతడినే తుదిజట్టులో తీసుకుంది. బ్యాటింగ్ తర్వాత.. పేసర్ నవీనుల్ హక్‍ను లక్నో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
ఈ ఏడాది ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో గాయం కారణంగా చివరి నాలుగు టెస్టులు ఆడలేకపోయాడు కేఎల్ రాహుల్. ఆ తర్వాత కోలుకొని ఐపీఎల్‍కు సిద్ధమయ్యాడు. ఈ సీజన్‍లో తొలి మ్యాచ్‍లో కెప్టెన్సీతో పాటు వికెట్ కీపింగ్ కూడా చేశాడు. అయితే, గాయం మళ్లీ తిరగబెట్టకుండా ముందు జాగ్రత్తగా ఈ మ్యాచ్‍కు కాస్త ఉపశమనం తీసుకునేందుకు బ్యాటింగ్ మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్ జరగనుండటంతో వర్క్ లోడ్ మేనేజ్‍మెంట్‍ను రాహుల్ దృష్టిలో పెట్టుకునే ఛాన్స్ ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దేవ్‍దత్ పడిక్కల్, ఆయుష్ బదోనీ, నికోలస్ పూరన్ (కెప్టెన్), మార్కస్ స్టొయినిస్, కృణాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మోహిసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమరన్ సిద్ధార్థ్
లక్నో సబ్‍స్టిట్యూట్ ఇంపాక్ట్ ఆప్షన్లు: నవీనుల్ హక్, ఆస్టన్ టర్నర్, అమిత్ మిశ్రా, దీపక్ హుడా, కే గౌతమ్
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్‍స్టోన్, సామ్ కరన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్
పంజాబ్ సబ్‍స్టిట్యూట్ ఇంపాక్ట్ ఆప్షన్లు: ప్రభ్‍సిమ్రన్ సింగ్, రీలీ రూసో, తనయ్ తంగరాజన్, విద్యత్ కవేరప్ప, హర్‌పీత్ భాటియా
ఐపీఎల్ 2024 సీజన్‍లో తన తొలి మ్యాచ్‍లో రాజస్థాన్ చేతిలో లక్నో ఓడింది. దీంతో హోం గ్రౌండ్‍లో నేడు జరుగుతున్న ఈ మ్యాచ్‍లో పంజాబ్‍పై గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు, ఈ సీజన్‍లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‍లు ఆడిన పంజాబ్ ఒక దాంట్లో ఓడింది. తన గత మ్యాచ్‍లో బెంగళూరు చేతిలో ఓడిన శిఖర్ ధావన్ టీమ్ మళ్లీ పుంజుకోవాలని పట్టుదలగా ఉంది.