PBKS vs DC: పంజాబ్‍దే తొలి పంచ్.. ఢిల్లీ ఓటమి
PBKS vs DC IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‍పై గెలిచి బోణీ కొట్టింది. ఆల్ రౌండర్ సామ్ కరన్ అదరొట్టాడు.
PBKS vs DC: ఐపీఎల్ 2024 టోర్నీలో పంజాబ్ కింగ్స్ జట్టు అదిరే ఆరంభాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో నేడు (మార్చి 23) జరిగిన మ్యాచ్‍లో శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో బోణీ చేసింది. చండీగఢ్ ముల్లాన్‍పూర్ స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్‍లో పంజాబ్ కింగ్స్ జట్టు 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 15 నెలల తర్వాత ఈ మ్యాచ్‍తో మళ్లీ ఆటకు బరిలోకి దిగాడు. అయితే, ఈ పోరులో ఢిల్లీకి నిరాశ ఎదురైంది.
ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. షాయ్ హోప్ (33) మోస్తరుగా రాణించగా.. చివర్లో అభిషేక్ పోరెల్ (10 బంతుల్లో 32 పరుగులు) మెరుపులు మెరిపించటంతో ఢిల్లీకి ఆ స్కోరు దక్కింది. పునరాగమన మ్యాచ్‍లో రిషబ్ పంత్ 13 బంతుల్లో 18 రన్స్ చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. రబాడ, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టు ఈ లక్ష్యాన్ని చివరి ఓవర్ వరకు ఆడి ఛేదించింది. 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసి గెలిచింది కింగ్స్. పంజాబ్ బ్యాటర్ సామ్ కరన్ 47 బంతుల్లో 63 పరుగులతో అర్ధ శకతం చేసి అదరగొట్టాడు. లియామ్ లివింగ్‍స్టోన్ (38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‍ను గెలుపు తీరం దాటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మకు ఓ వికెట్ దక్కింది.
కరన్ అదుర్స్
లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ (22) శుభారంభం చేశాడు. అయితే, నాలుగో ఓవర్లో అతడిని ఢిల్లీ బౌలర్ ఇషాంత్ శర్మ బౌల్డ్ చేశాడు. అనంతరం జానీ బెయిర్ స్టో (9) దురదృష్టకరంగా రనౌట్ అయ్యాడు. ప్రభ్‍సిమ్రన్ సింగ్ (26), జితేశ్ శర్మ (9) కూడా కాసేపటికి ఔటయ్యారు. దీంతో 100 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది పంజాబ్. అయితే, మరో ఎండ్‍లో ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కరన్ అదరగొట్టాడు. వికెట్లు పడుతున్నా దూకుడుగానే ఆడాడు.
39 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు కరన్. మరో ఇంగ్లిష్ ప్లేయర్ లియామ్ లివింగ్‍స్టోన్ కూడా వేగంగా ఆడాడు. దీంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. ఆ 19వ ఓవర్లో సామ్ కరన్, శశాంక్ సింగ్ (0)ను ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్ ఔట్ చేసినా అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. చివరి ఓవర్ రెండో బంతికి సిక్స్ కొట్టి పంజాబ్‍ను గెలిపించాడు లివింగ్‍స్టోన్.
కీపింగ్ చేసిన రిషబ్ పంత్
గాయం నుంచి కోలుకొని రావడంతో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్.. వికెట్ కీపింగ్ చేసే విషయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, అతడు పూర్తి ఫిట్‍గా కనిపించి.. ఈ మ్యాచ్‍లో కీపింగ్ చేశాడు. జితేశ్ శర్మను మెరుపు స్టంపింగ్ చేశాడు.