Virat Kohli DRS: నాటౌట్.. అయినా పెవిలియన్‌కి విరాట్ కోహ్లీ, డీఆర్‌ఎస్ తీసుకోకపోవడంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం
20 September 2024, 19:46 IST
Rohit Sharma: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ పెద్ద తప్పిదానికి పాల్పడ్డాడు. నాటౌట్ అయినా.. డీఆర్‌ఎస్ తీసుకోకుండా పెవిలియన్‌కి వెళ్లిపోయాడు. దాంతో డ్రెస్సింగ్ రూములో రోహిత్ శర్మ కోప్పడుతూ కనిపించాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
IND vs BAN 1st Test: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెన్నై టెస్టులో నాటౌట్ అయినా.. పెవిలియన్‌కి వెళ్లిపోయాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 37 బంతులాడిన విరాట్ కోహ్లీ 2 ఫోర్ల సాయంతో 17 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లో మంచి టచ్‌లో కనిపించిన విరాట్ కోహ్లీ అనూహ్యరీతిలో పెవిలియన్ బాట పట్టాడు.
మెహిదీ హసన్ మిరాజ్ విసిరిన ఫుల్ లెంగ్త్ డెలివరీని హిట్ చేయబోయిన విరాట్ కోహ్లీ బంతిని మిడిల్ చేయలేకపోయాడు. దాంతో బంతి బ్యాట్ అంచున తాకి అనంతరం ప్యాడ్‌కు తగిలింది. దాంతో ఎల్బీడబ్ల్యూ కోసం బంగ్లాదేశ్ ఫీల్డర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ వేలెత్తేశఆడు.
పెవిలియన్‌కి వెళ్లే ముందు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న శుభమన్ గిల్‌తో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. బంతి వికెట్లపైకి వెళ్తోందా? లేదా బయటికి వెళ్తోందా అని మాత్రమే అడిగాడు. దాంతో గిల్.. వికెట్ల పైకి అని చెప్పడంతో డీఆర్‌ఎస్ కోరే ఆలోచనని విరిమించుకుని పెవిలియన్ బాట పట్టాడు. కానీ.. రీప్లేలో బంతి బ్యాట్ అంచుని తాకినట్లు స్పష్టంగా కనిపించడం డ్రెస్సింగ్ రూములో కెప్టెన్ రోహిత్ శర్మను ఆశ్చర్యపోతూ కనిపించాడు.
విరాట్ కోహ్లీ ఔట్ అవ్వడంతో.. బ్యాటింగ్ కోసం రిషబ్ పంత్ మైదానంలోకి వెళ్లాడు. ఆ సమయంలో స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌పై రీప్లే వేశారు. దాంతో అభిమానులతో పాటు కామెంటేటర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కనిపించారు. బంతి బ్యాట్‌కి తాకినా.. విరాట్ కోహ్లీ ఎందుకు డీఆర్‌ఎస్ తీసుకోలేదంటూ డ్రెస్సింగ్ రూములో రోహిత్ శర్మ కోప్పడుతూ కనిపించాడు.
గురువారం తొలి ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ ఆఫ్ స్టంప్‌కి అవల విసిరిన బంతిని వెంటాడిన విరాట్ కోహ్లీ.. వికెట్ కీపర్ లిట్టన్ దాస్‌కి దొరికిపోయాడు. బ్యాట్ అంచున తాకిన బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 బంతుల్లో 6 పరుగులే చేసి విరాట్ కోహ్లి ఔటయ్యాడు.
రెండు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఓవరాల్‌గా 308 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. డ్రైవర్ సీట్లో ఉంది. రెండో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి గిల్ 33, వికెట్ కీపర్ రిషబ్ పంత్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడో సెషన్ ఆరంభంలోనే బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు 149 పరుగులకే కట్టడి చేశారు. దీంతో భారత్‌కి 227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 376 పరుగులు చేసిన విషయం తెలిసిందే.