DRS | డీఆర్‌ఎస్‌లో వాడే టెక్నాలజీ ఏంటి? అవి ఎలా పని చేస్తాయి?-what drs in cricket and what are the technologies using for it ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Drs | డీఆర్‌ఎస్‌లో వాడే టెక్నాలజీ ఏంటి? అవి ఎలా పని చేస్తాయి?

DRS | డీఆర్‌ఎస్‌లో వాడే టెక్నాలజీ ఏంటి? అవి ఎలా పని చేస్తాయి?

Hari Prasad S HT Telugu
Jan 24, 2022 09:28 PM IST

DRS: అంపైర్‌ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశాన్ని టీమ్స్‌కు కల్పించింది ఐసీసీ. అందులో భాగంగా వచ్చిందే డెసిషన్‌ రీవ్యూ సిస్టమ్‌ (డీఆర్‌ఎస్‌). ఈ డీఆర్‌ఎస్‌ కోసం పలు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ, క్యాచ్‌ ఔట్‌ల విషయంలో ఈ టెక్నాలజీలు బాగా పనికొస్తున్నాయి.

<p>క్రికెట్‌ టీమ్స్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్న డీఆర్‌ఎస్‌</p>
క్రికెట్‌ టీమ్స్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్న డీఆర్‌ఎస్‌ (AFP)

DRS.. క్రికెట్‌ అయినా మరో స్పోర్ట్ ఏదైనా సరే ఈ మధ్య కాలంలో టెక్నాలజీ వాడకం ఎక్కువైపోయింది. ఆన్‌ఫీల్డ్‌లో ఉండే రిఫరీలు, అంపైర్లకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రికెట్‌లోనూ అప్పుడప్పుడూ అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతాయి. మ్యాచ్‌ ఫలితాలనే తారుమారు చేస్తాయి. అందుకే అంపైర్‌ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశాన్ని టీమ్స్‌కు కల్పించింది ఐసీసీ. అందులో భాగంగా వచ్చిందే డెసిషన్‌ రీవ్యూ సిస్టమ్‌ (డీఆర్‌ఎస్‌). 

ఈ డీఆర్‌ఎస్‌ కోసం పలు రకాల టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ, క్యాచ్‌ ఔట్‌ల విషయంలో ఈ టెక్నాలజీ బాగా పనికొస్తుంది. ప్రస్తుతం డీఆర్‌ఎస్‌లో భాగంగా స్నీకోమీటర్‌, హాట్‌స్పాట్‌, అల్ట్రాఎడ్జ్‌, హాక్‌ఐ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి ఈ టెక్నాలజీ గురించి తెలిసినా.. అవి ఎలా పనిచేస్తాయి? వాటి వెనుక ఎలాంటి వ్యవస్థ ఉంటుందన్నది మాత్రం తెలియదు. ఈ స్టోరీ ఆ టెక్నాలజీ పనితీరు గురించి తెలుసుకుందాం.

స్నీకోమీటర్‌

డీఆర్‌ఎస్‌లో భాగంగా వాడుతున్న ఈ స్నీకోమీటర్‌ (స్నీకో) టెక్నాలజీని బ్రిటన్‌కు చెందిన సైంటిస్ట్‌ అలన్‌ ప్లాస్కెట్‌ 1990లో కనిపెట్టారు. ఇది సౌండ్‌, విజువల్‌ ఆధారాల ద్వారా ఓ బ్యాట్స్‌మన్‌ బాల్‌ను టచ్‌ చేశాడా లేదా అన్నది నిర్ధారిస్తారు. వికెట్ల వెనుక క్యాచ్‌ ఔట్‌లు, బ్యాట్-ప్యాడ్‌, ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలు తీసుకోవడంలో ఇది పనికొస్తుంది. ఈ టెక్నాలజీలో భాగంగా స్టంప్స్‌లో ఉండే మైక్రోఫోన్‌ లైవ్‌ సౌండ్‌ను రికార్డు చేస్తుంది. ఆ సౌండ్‌ను ఫిల్టర్ చేసి దానికి అటాచ్‌ చేసిన ఆసిలోస్కోప్‌కు పంపిస్తుంది. ఇది సౌండ్‌ వేవ్‌లను గుర్తిస్తుంది. 

అదే సమయంలో కెమెరాలు రికార్డు చేసిన విజువల్స్‌ స్లో మోషన్‌లో ప్లే చేస్తుంటారు. ఒకవేళ బాల్‌.. బ్యాట్‌ను తగిలితే స్నీకోమీటర్‌ గ్రాఫ్‌ పైకి వెళ్లినట్లుగా ఉంటుంది. ఒకవేళ బాల్‌.. ప్యాడ్‌ లేదా గ్లోవ్‌ను తగిలితే ఫ్లాట్‌లైన్‌ కనిపిస్తుంది. మైక్రోఫోన్‌ రికార్డు చేసిన సౌండ్‌తోపాటు స్లోమోషన్‌లో విజువల్‌ చూడటం వల్ల బంతి.. బ్యాట్‌కు దగ్గరగా వెళ్లిందా లేదా చూడటం వల్ల అంపైర్‌ సులువుగా నిర్ణయం తీసుకునే వీలుంటుంది. ఒక్కోసారి బ్యాట్‌.. ప్యాడ్‌ను లేదా గ్రౌండ్‌ను తగిలినా సౌండ్‌ వస్తుంది. విజువల్‌ చూడటం వీటిపై స్పష్టత వస్తుంది. డీఆర్‌ఎస్‌లో వాడే ఇతర టెక్నాలజీలతో పోలిస్తే ఈ టెక్నాలజీ చాలా చవక. స్టంప్‌ మైక్‌, కెమెరా ఉంటే చాలు. అయితే ప్రస్తుతం ఈ టెక్నాలజీని తక్కువగా వాడుతున్నారు.

హాట్‌స్పాట్‌

డీఆర్‌ఎస్‌లో వాడే ఈ హాట్‌స్పాట్‌ టెక్నాలజీ చాలా ఖరీదైనది. అందుకే అంతగా డబ్బు లేని క్రికెట్‌ బోర్డులు ఈ టెక్నాలజీని వాడటం లేదు. పైగా ఇండియాలాంటి ధనిక బోర్డు కూడా ఈ టెక్నాలజీపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇండియా ఆడే మ్యాచ్‌లలో దీనిని వాడటం లేదు. అయితే స్నీకోమీటర్‌తో పోలిస్తే కచ్చితత్వం విషయంలో ఈ హాట్‌స్పాట్‌ టెక్నాలజీ చాలా మెరుగ్గా పనిచేస్తుంది. ఈ టెక్నాలజీని ఫ్రెండ్‌ సైంటిస్ట్‌ నికోలస్‌ బయాన్‌ కనిపెట్టారు. దీనిని తొలిసారి ఆస్ట్రేలియాలోని ఛానెల్‌ 9 ఉపయోగించింది. 

హాట్‌స్పాట్ టెక్నాలజీలో భాగంగా గ్రౌండ్‌కు రెండు వైపులా రెండు కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇది విజువల్స్‌ను రికార్డు చేసి, వాటిని ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజ్‌ల రూపంలో అందిస్తాయి. బాల్‌.. బ్యాట్‌ను తగిలినప్పుడు ఓ రాపిడి ఏర్పడుతుంది. అది అక్కడ ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజ్‌లో ఓ ప్రకాశవంతమైన మచ్చలాగా కనిపిస్తుంది. దీనివల్ల బాల్‌ కచ్చితంగా ఎక్కడ తగిలిందో కూడాగుర్తించడానికి వీలవుతుంది. అందుకే స్నీకోమీటర్‌తో పోలిస్తే ఇది చాలా మెరుగైన టెక్నాలజీగా చెప్పొచ్చు.

అల్ట్రాఎడ్జ్‌

ఈ అల్ట్రాఎడ్జ్‌ కూడా స్నీకోమీటర్‌లాగా పనిచేసేదే. స్టంప్‌మైక్‌, విజువల్స్‌ను ఆధారంగా చేసుకొని నిర్ణయం తీసుకోవడంలో అంపైర్లకు సాయం చేస్తుంది. అయితే హాక్‌ ఐ అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌ కావడంతో ఇది మరింత కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అత్యాధునిక అల్ట్రా-మోషన్‌ కెమెరాలు, లైవ్‌ సౌండ్‌ను ప్రాసెస్‌ చేసే విధానం వేరుగా ఉంటుంది. దీని ద్వారా వివిధ శబ్దాల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించే వీలు కలుగుతుంది. ఈ టెక్నాలజీపై అన్ని బోర్డులు సంతృప్తి వ్యక్తం చేశాయి.

హాక్‌-ఐ టెక్నాలజీ

డీఆర్‌ఎస్‌లో అతి ముఖ్యమైన టెక్నాలజీ ఈ హాక్‌ఐ. ఒక్క క్రికెట్‌లోనే కాదు టెన్నిస్‌, ఫుట్‌బాల్‌ వంటి స్పోర్ట్స్‌లోనూ ఈ హాక్‌-ఐ టెక్నాలజీని వాడుతున్నారు. క్రికెట్‌లో ముఖ్యంగా బాల్‌ ట్రాకింగ్‌ కోసం ఈ హాక్‌-ఐని వాడుతున్నారు. అంటే బౌలర్ విసిరిన బంతి వెళ్లే మార్గాన్ని గుర్తించడానికి ఇది పనికొస్తుంది. ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల్లో ఈ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ టెక్నాలజీని పాల్‌ హాకిన్స్‌ కనిపెట్టారు. ఇందులో భాగంగా మొత్తం ఆరు కెమెరాలను వాడతారు.

 గ్రౌండ్‌కు రెండు వైపులా మూడేసి కెమెరాలు దీనికోసమే ప్రత్యేకంగా పనిచేస్తాయి. ప్రతి బాల్‌ను రికార్డు చేసి ఆ డేటాను వాటికి అమర్చిన కంప్యూటర్లకు పంపిస్తాయి. అవి బంతి పిచ్‌ అయిన తర్వాత వెళ్లే మార్గాన్ని అంచనా వేస్తాయి. ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు తీసుకున్న ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ టీమ్స్‌ డీఆర్‌ఎస్‌లో భాగంగా అప్పీల్‌ చేస్తాయి. అప్పుడు థర్డ్‌ అంపైర్‌ ఈ హాక్‌-ఐటెక్నాలజీ ఉపయోగించి బంతి వెళ్లే మార్గాన్ని స్పష్టంగా చూసి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం