Virat Kohli: గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ధోనీ కంటే విరాట్ కోహ్లీనే బెస్ట్: భారత మాజీ బ్యాటర్ కామెంట్స్
20 March 2024, 21:06 IST
- Virat Kohli - Navjot Singh Sidhu: విరాట్ కోహ్లీపై భారత మాజీ ప్లేయర్ నవ్‍జ్యోత్ సింగ్ సిద్ధు ప్రశంసల వర్షం కురిపించారు. మూడు ఫార్మాట్లను కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడని ప్రశంసించారు. మరిన్ని కామెంట్లు చేశారు.
విరాట్ కోహ్లీ
Virat Kohli: టీమిండియా మాజీ బ్యాటర్ నవ్‍జ్యోత్ సింగ్ సిద్ధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారత దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ కంటే విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాటర్ అని అన్నారు. టీమిండియా చరిత్రలో అత్యంత అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీనే అని సిద్ధు అభిప్రాయపడ్డారు. ఈ కామెంట్లు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. అయితే, భారత స్టార్ విరాట్ కోహ్లీనే ఎందుకు బెస్ట్ అనేది కూడా ఆయన తన వెర్షన్‍ను వివరించారు.
భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆయన కాలంలో టీమిండియా తరఫున అదరగొట్టారు. ఏకంగా 34 టెస్టు సెంచరీలు చేశారు. టెస్టుల్లో 10వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. ఆయన తర్వాతి తరంలో సచిన్ టెండూల్కర్.. అనేక ఘనతలు సాధించారు. క్రికెట్ దేవుడిగా ఖ్యాతి గడించారు. క్రికెట్‍లో అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగులు, అత్యధిక మ్యాచ్‍లు.. ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు ఇప్పటికే సచిన్ పేరిటే ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ.. కెప్టెన్‍గా భారత్‍కు టీ20, వన్డే ప్రపంచకప్‍లు, చాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను అందించారు. ధనాధన్ బ్యాటింగ్‍తో చాలా మ్యాచ్‍ల్లో భారత్‍ను గెలిపించారు. అయితే, గవాస్కర్, సచిన్, ధోనీ కన్నా తన దృష్టిలో కోహ్లీనే బెస్ట్ అని గవాస్కర్ చెప్పారు.
‘కోహ్లీ ఎందుకు బెస్ట్ అంటే..’
విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) సమానంగా అద్భుతంగా ఆడుతున్నాడని, అందుకే సచిన్, గవాస్కర్ కంటే అతడే బెస్ట్ అని సిద్ధు అభిప్రాయపడ్డారు. మూడు ఫార్మాట్లను కోహ్లీ అద్భుతంగా అడాప్ట్ చేసుకొని సత్తాచాటుతున్నాడని అన్నారు.
అత్యుత్తమ భారత బ్యాటర్‌గా కోహ్లీనే తాను భావిస్తానని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధు చెప్పారు. “నేను అతడిని అత్యుత్తమ బెస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా చెబుతాను. 1970ల్లో సునీల్ గవాస్కర్.. వెస్టిండీస్‍పై అద్భుతంగా ఆడిన విషయాలను వింటూ నేను పెరిగా. గ్రేట్ వెస్టిండీస్ బౌలర్లను కనీసం హెల్మెట్ కూడా ధరించకుండా గవాస్కర్ ఆయన ఎదుర్కొన్నారు. స్కూల్‍లకు బంక్ కొట్టి మరీ మేం ఈ మ్యాచ్‍లను వినేవాళ్లం. అది గవాస్కర్ శకం. 15-20 ఏళ్ల పాటు ఆయన ఆధిపత్యం చూపించారు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్‌ది మరో శకం. ఆ తర్వాత ధోనీ, విరాట్ వచ్చారు. అయితే, ఈ నలుగురిలో చూస్తే.. నేను అతడినే (విరాట్ కోహ్లీ)నే బెస్ట్ అంటా. ఎందుకంటే మూడు ఫార్మాట్లను కోహ్లీ అద్భుతంగా ఆకలింపు చేసుకున్నారు” అని సిద్ధు చెప్పారు.
ఫిట్‍నెస్‍లోనూ..
ఇండియన్ క్రికెట్‍లో ఫిట్‍నెస్ విప్లవాన్ని తీసుకొచ్చిన ఫస్ట్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ అని నవ్‍జ్యోత్ సింగ్ సిద్ధు చెప్పారు. అయితే, విరాట్ కోహ్లీ అతడి కంటే ఫిట్‍గా ఉన్నారని అన్నారు. సచిన్ కూచా తన కెరీర్ చివర్లో ఫిట్‍నెస్ సమస్యను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అయితే, ధోనీ ప్రస్తుతం ఫిట్‍గా ఉండగా.. విరాట్ కోహ్లీ సూపర్ ఫిట్‍గా ఉన్నాడని సిద్ధు చెప్పారు.
విరాట్ కోహ్లీ కూడా అనేక రికార్డులను బద్దలుకొడుతూ రన్ మెషీన్‍గా పేరు తెచ్చుకున్నాడు. మూడు ఫార్మాటల్లో 50 యావరేజ్‍తో ఉన్నాడు. సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‍లో అత్యధిక సెంచరీల జాబితాలో కోహ్లీనే ఉన్నాడు. వన్డే క్రికెట్‍లో ఇప్పటికే సచిన్ అత్యధిక సెంచరీల (50) రికార్డును కోహ్లీ సమం చేశాడు. టెస్టుల్లోనూ కోహ్లీ 29 సెంచరీలు చేశాడు. చాలా రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్ కొన్ని రికార్డులను బద్దలుకొట్టగలిగే ఏకైక బ్యాటర్‌గా కోహ్లీనే అందరూ పరిగణిస్తుంటారు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22వ తేదీన మొదలుకానుంది. మార్చి 22న తొలి మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు తలపడనున్నాయి.