Top 5 IPL 2024 Matches: ఐపీఎల్ తొలి షెడ్యూల్లో ఈ 5 మ్యాచ్‌లు అస్సలు మిస్ కావద్దు.. ఈ డేట్స్ సేవ్ చేసుకోండి
25 February 2024, 9:30 IST
- Top 5 IPL 2024 Matches: ఐపీఎల్ 2024 షెడ్యూల్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన అభిమానులకు గురువారం (ఫిబ్రవరి 22) గుడ్ న్యూస్ వచ్చింది. అయితే తొలి షెడ్యూల్లో భాగంగా జరగబోయే మొత్తం 21 మ్యాచ్ లలో ఈ 5 మ్యాచ్ లను మాత్రం అస్సలు మిస్ కావద్దు.
ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్లో ఎంతో ఆసక్తి రేపుతున్న టాప్ 5 మ్యాచ్ లు ఇవే
Top 5 IPL 2024 Matches: ఐపీఎల్ పండగ మరోసారి వచ్చేస్తోంది. ముందుగా ఊహించినట్లే మార్చి 22 నుంచే ఈ మెగా లీగ్ ప్రారంభం కానున్నట్లు తాజా షెడ్యూల్ అనౌన్స్‌మెంట్ తో తేలిపోయింది. అయితే ఈసారి సాధారణ ఎన్నికలు ఉన్న కారణంగా ప్రస్తుతానికి తొలి దశ షెడ్యూల్ మాత్రమే రిలీజ్ చేశారు.
మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకూ 21 ఐపీఎల్ మ్యాచ్ ల షెడ్యూల్ రిలీజ్ చేయగా.. ఇందులో ఐదు మాత్రం బాగా ఆసక్తి రేపుతున్నాయి. ఈ మ్యాచ్ ల డేట్లు మీరు కూడా సేవ్ చేసుకొని తప్పకుండా చూడండి.
ఐపీఎల్ 2024లో టాప్ 5 మ్యాచ్‌లు ఇవే
నిజానికి మార్చి 22న ఐపీఎల్ 2024 చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ధోనీ, కోహ్లిలాంటి టాప్ ప్లేయర్స్ ఉన్న ఈ మ్యాచ్ ఎంతో ఆసక్తి రేపుతోంది. దీంతో ఈ మ్యాచ్ తోపాటు ఐదు మ్యాచ్ లు మాత్రం ప్రత్యేకంగా నిలవనున్నాయి. అవేంటో చూడండి.
చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటన్స్ - మార్చి 26 (చెన్నై)
ఐపీఎల్ 2023 ఫైనల్లో తలపడిన ఈ రెండు జట్లు ఈసారి మార్చి 26న తొలిసారి ముఖాముఖి తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. 2022లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ఏడాదే ట్రోఫీ గెలిచిన గుజరాత్ టైటన్స్.. వరుసగా రెండో ఏడాదీ ట్రోఫీపై కన్నేసినా.. చెన్నై వాళ్లకు చెక్ పెట్టింది.
మరి ఈ మ్యాచ్ లో గుజరాత్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేక సొంతగడ్డపై తిరుగులేని చెన్నై విజయ పరంపర కొనసాగిస్తుందా అన్నది చూడాలి. ఈ మ్యాచ్ మార్చి 26, రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
ఆర్సీబీ vs కేకేఆర్ - మార్చి 29 (బెంగళూరు)
ఐపీఎల్లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య ఉన్న వైరం తెలుసు కదా. ఒకప్పుడు కేకేఆర్ కు ఆడిన గంభీర్.. ఆర్సీబీకి ఆడుతున్న కోహ్లితో గ్రౌండ్లో గొడవ పడ్డాడు. ఆ తర్వాత గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గా ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా మళ్లీ ఈ ఇద్దరికీ గొడవ జరిగింది. ఇప్పుడు గంభీర్ మరోసారి కోల్‌కతా నైట్ రైడర్స్ కు వెళ్లడంతో కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ ఆసక్తిగా మారింది. ఈ ఇద్దరూ మరోసారి ఎదురుపడనున్నాయి. ఈ మ్యాచ్ మార్చి 29న రాత్రి 7.30 గంటలకు బెంగళూరులో జరగనుంది.
సీఎస్కే vs ఆర్సీబీ - మార్చి 22 (చెన్నై)
ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభమయ్యేది ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ తోనే. మార్చి 22న ఈ రెండు టీమ్స్ తలపడనున్నాడు. ధోనీ, కోహ్లి లాంటి ప్లేయర్స్ ముఖాముఖి తలపడనున్న ఈ మ్యాచ్ కూడా ఐపీఎల్ అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై తమ సొంతగడ్డపై ఇప్పటికీ టైటిల్ కోసం ఎదురు చూస్తున్న ఆర్సీబీతో మ్యాచ్ కు సిద్ధమవుతోంది.
ఎంఐ vs జీటీ - మార్చి 24 (అహ్మదాబాద్)
రెండు సీజన్ల పాటు గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు మరోసారి తన పాత టీమ్ ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా తిరిగి వచ్చాడు. ముంబైని ఐదుసార్లు ఛాంపియన్ చేసిన రోహిత్ ను పక్కన పెట్టి హార్దిక్ కు కెప్టెన్సీ అప్పగించారు. మరి ఈసారి గుజరాత్ టైటన్స్ పై హార్దిక్ తన ముంబైని ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ మార్చి 24న అహ్మదాబాద్ లో జరగనుంది.
కేకేఆర్ vs ఎస్ఆర్‌హెచ్ - మార్చి 23 (కోల్‌కతా)
ఈ ఏడాది ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఇద్దరు ప్లేయర్స్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఆడే సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ వేలంలో తొలిసారి 20 కోట్ల మార్క్ అందుకున్న స్టార్క్, కమిన్స్ ముఖాముఖి తలపడబోయే ఈ మ్యాచ్ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ మ్యాచ్ మార్చి 23న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.