Virat Kohli: విరాట్ కోహ్లి ఎక్కడున్నాడో తెలిసిపోయింది.. కెమెరాకు చిక్కిన టీమిండియా మాజీ కెప్టెన్
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఇంగ్లండ్ తో సిరీస్ నుంచి తప్పుకున్న అతడు.. తాజాగా తనకు రెండో సంతానం కలిగిందని చెప్పిన తర్వాత తొలిసారి కెమెరాకు చిక్కాడు.
Virat Kohli: విరాట్ కోహ్లి ఎక్కడ అన్న సస్పెన్స్ కు తెరపడింది. తమకు ఫిబ్రవరి 15వ తేదీని రెండో సంతానం కలిగిందని, బాబు పేరు అకాయ్ అని మంగళవారం (ఫిబ్రవరి 20) ఇన్స్టా ద్వారా అతని భార్య అనుష్క శర్మ అనౌన్స్ చేసిన విషయం తెలుసు కదా. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన కాసేపటికే కోహ్లి కెమెరాకు చిక్కాడు. ప్రస్తుతం అతడు లండన్ లో ఉండటం విశేషం.
లండన్లో విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి లండన్ లో ఉన్న విషయాన్ని అతని ఫ్యాన్ క్లబ్ కు చెందిన ఓ ఎక్స్ అకౌంట్ వెల్లడించింది. అతని ఫొటోను పోస్ట్ చేస్తూ.. లండన్ లో ఉన్న విరాట్ కోహ్లి లేటెస్ట్ ఫొటో అనే క్యాప్షన్ ఉంచారు. ఈ ఫొటోలో ఓ లాంగ్ వింటర్ కోట్, క్యాప్ లో కనిపించాడు. తమకు కొడుకు పుట్టాడని, అతని పేరు అకాయ్ అని చెప్పిన కాసేపటికే కోహ్లి లండన్ లో ఉన్నట్లుగా ఈ ఫొటో బయటకు వచ్చింది.
లండన్ వీధుల్లో కోహ్లి నడుచుకుంటూ వెళ్తున్న ఫొటో ఇది. నిజానికి ఈ మధ్యే అనుష్క శర్మ లండన్ లో తన రెండో బిడ్డకు జన్మనివ్వనుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కోహ్లి తాజా ఫొటోతో అదే నిజమని తేలింది. తమకు రెండో సంతానం కలిగిన విషయాన్ని కోహ్లి, అనుష్క ఓ ప్రకటన ద్వారా షేర్ చేసుకున్నా.. తాము ఎక్కడ ఉన్నది మాత్రం చెప్పలేదు. తాజా ఫొటోతో వీళ్లు లండన్ లో ఉన్న విషయం స్పష్టమైంది.
కోహ్లి మొదట తాను ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండనని చెప్పి హైదరాబాద్ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడు అసలు ఇండియాలోనే లేడని, సిరీస్ కు అందుబాటులో ఉండటం కష్టమే అన్న వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే కోహ్లి సిరీస్ మొత్తం ఆడటం లేదని బోర్డు ప్రకటించింది. ఇక ఇప్పుడు అతడు ఇండియాలో లేడన్న విషయం కూడా నిజమని తేలింది.
కోహ్లి, అనుష్క కొడుకు అకాయ్
కోహ్లి, అనుష్కలకు ఫిబ్రవరి 15న కొడుకు పుట్టాడు. అతనికి అకాయ్ అనే పేరు పెట్టినట్లు కూడా ఈ దంపతులు వెల్లడించారు. దీంతో అసలు ఆ పేరుకు అర్థమేంటో తెలుసుకోవడానికి అభిమానులు ఇంటర్నెట్ లో వెతకడం మొదలు పెట్టారు. గతంలో తమకు కూతురు పుట్టినప్పుడు కూడా ఈ జంట వామికా అనే ఓ డిఫరెంట్ పేరు పెట్టారు. ఇప్పుడు బాబుకు అకాయ్ అనే చాలా అరుదైన పేరు పెట్టడంతో దాని అర్థమేంటన్నది వెతుకుతున్నారు.
అకాయ్ అనేది సంస్కృత పదం. దీనికి అర్థం చిరంజీవుడు అని. గతంలో కూతురుకు వామికా అనే పేరు పెట్టారు. ఆ తర్వాత దానికి అర్థమేంటో కోహ్లి, అనుష్కనే వెల్లడించారు. దుర్గామాతకు ఉన్న పేర్లలో వామికా కూడా ఒకటని వాళ్లు చెప్పారు. అంతేకాదు అందులో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ఇంగ్లిష్ అక్షరాలు కలిసి వచ్చేలా కూడా వాళ్లు ఆ పేరు పెట్టారు.