Bumrah Out: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు నుంచి బుమ్రా, రాహుల్ ఔట్.. ముకేశ్ మళ్లీ వచ్చాడు-bumrah and kl rahul out of fourth test against england cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Bumrah Out: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు నుంచి బుమ్రా, రాహుల్ ఔట్.. ముకేశ్ మళ్లీ వచ్చాడు

Bumrah Out: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు నుంచి బుమ్రా, రాహుల్ ఔట్.. ముకేశ్ మళ్లీ వచ్చాడు

Hari Prasad S HT Telugu
Feb 21, 2024 07:53 AM IST

Bumrah Out: ఇంగ్లండ్ తో జరగనున్న నాలుగో టెస్టు నుంచి బుమ్రాను జట్టు నుంచి రిలీజ్ చేయగా.. కేఎల్ రాహుల్ కూడా ఔటయ్యాడు. దీంతో టీమిండియా మరింత బలహీనపడింది.

ఇంగ్లండ్ తో నాలుగో టెస్టు నుంచి బుమ్రా, రాహుల్ ఔట్
ఇంగ్లండ్ తో నాలుగో టెస్టు నుంచి బుమ్రా, రాహుల్ ఔట్ (PTI)

Bumrah Out: ఇంగ్లండ్ తో మూడో టెస్టులో రికార్డు విజయం సాధించిన టీమిండియా నాలుగో టెస్టుకు మాత్రం మరింత బలహీనపడింది. ఊహించినట్లే స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. అంతేకాదు గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ నాలుగో టెస్టుకు కూడా దూరమయ్యాడు. చివరి టెస్టుకు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే అందుబాటులో ఉంటాడని కూడా బోర్డు చెప్పింది.

yearly horoscope entry point

బుమ్రా, రాహుల్ లేకుండానే..

పేస్ బౌలర్ బుమ్రాకు మూడో టెస్టులోనే విశ్రాంతి ఇస్తారని భావించారు. కానీ అతన్ని ఆ మ్యాచ్ లోనూ కొనసాగించారు. అంతేకాదు ఏకంగా వైస్ కెప్టెన్ ను చేశారు. ఈ టెస్టులో అతడు పెద్దగా ప్రభావం చూపలేదు. రెండు వికెట్లు మాత్రమే తీశాడు. వరుసగా మూడు టెస్టులతో ఈ పేస్ బౌలర్ పై భారం పెరిగిపోవడంతో నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇచ్చారు. అతని స్థానంలో ముకేశ్ కుమార్ తిరిగి వచ్చాడు.

రంజీ ట్రోఫీలో యూపీకి ఆడాలంటూ మూడో టెస్టు నుంచి ముకేశ్ ను పంపించిన మేనేజ్‌మెంట్ అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. బుమ్రా ఈ సిరీస్ లో 17 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఉన్నాడు. ఇప్పుడతడు లేకపోవడంతో పేస్ బౌలింగ్ భారం సిరాజ్ పై పడనుంది. మరోవైపు హైదరాబాద్ టెస్టు సందర్భంగా గాయపడిన కేఎల్ రాహుల్.. ఇప్పుడు నాలుగో టెస్టు కూడా ఆడటం లేదు.

కేఎల్ రాహుల్ ఎక్కడ?

ఐదో టెస్టుకు ఫిట్‌నెస్ సాధిస్తే మళ్లీ జట్టులోకి వస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సీఏ)లోనే గాయం నుంచి కోలుకుంటున్నాడు. మూడో టెస్టుకు కూడా రాహుల్, కోహ్లి లేకపోయినా.. అంతగా అనుభవం లేని బ్యాటింగ్ లైనప్ తో టీమిండియా టెస్ట్ క్రికెట్ లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది.

తొలి ఇన్నింగ్స్ లో రోహిత్, జడేజా, సర్ఫరాజ్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్ లో యశస్వి, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ రాణించారు. సర్ఫరాజ్ తోపాటు వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కూడా తొలి టెస్టులోనే ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరూ ఇప్పుడు నాలుగో టెస్టు తుది జట్టులో ఉండటం ఖాయం. రజత్ పటీదారే నిరాశ పరుస్తున్నాడు. అయితే రాహుల్ తిరిగి రాకపోవడంతో నాలుగో టెస్టుకు కూడా రజత్ తుది జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి.

నాలుగో టెస్టుకు ఇండియన్ టీమ్

రోహిత్ శర్మ, యశస్వి, గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కేఎస్ భరత్, దేవదత్ పడిక్కల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్

Whats_app_banner