Bumrah on England: బుమ్రా మాటలతో ఇంగ్లండ్ దిమ్మదిరిగిపోయింది.. వైరల్ అవుతున్న వీడియో
Bumrah on England: బజ్‌బాల్ అంటూ ఎగిరెగిరి పడుతున్న ఇంగ్లండ్ కు బుమ్రా అన్న మాటలు ఎక్కడో తగిలాయి. ప్రస్తుతం టీమిండియా పేస్ బౌలర్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Bumrah on England: ఇంగ్లండ్ బజ్‌బాల్ పై మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా టీమిండియా చేతుల్లో మూడో టెస్టులో ఏకంగా 434 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ టీమ్ ను కోలుకోలేని దెబ్బ తీసింది. తాజాగా మ్యాచ్ సందర్భంగా బుమ్రా తన టీమ్మేట్ తో చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సందర్భంలో బుమ్రా ఈ కామెంట్స్ చేశాడు.
బుమ్రా కామెంట్స్ వైరల్
బుమ్రా తన ఓవర్ ముగించుకొని అంపైర్ చేతుల్లో నుంచి తన క్యాప్ తీసుకుంటూ టీమ్మేట్ తో చేసిన కామెంట్స్ అవి. 557 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసే క్రమంలో 28 పరుగుల దగ్గర 3 వికెట్లు పడి.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో బజ్‌బాల్ మరచిపోయి డిఫెన్స్ ఆడుతూ కనిపించారు ఇంగ్లండ్ బ్యాటర్లు. అది చూసి బుమ్రా ఓ దిమ్మదిరిగే మాటన్నాడు.
"ఇప్పుడసలు కొట్టడమే లేదు చూశావా" అంటూ బుమ్రా తన టీమ్మేట్ తో చేసిన కామెంట్ వీడియో ఇది. తనదైన స్టైల్లో నవ్వుతూ హిందీలో బుమ్రా చేసిన ఈ కామెంట్ ఇంగ్లండ్ జట్టుకు చెంప దెబ్బలాంటిదే అని చెప్పాలి. పరిస్థితులను పట్టించుకోకుండా టెస్ట్ క్రికెట్ లోనూ టీ20ల్లాగా బాదేస్తే గెలవడం కష్టం అని ఈ మ్యాచ్ ద్వారా వాళ్లకు తెలిసొచ్చింది. అంత పెద్ద టార్గెట్ కళ్ల ముందు కనిపించే సరికి ఎడాపెడా బౌండరీలు బాదే ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ కూడా తొలి రెండు ఓవర్లు ఒక్క పరుగు చేయలేదు.
ఇండియాలో బజ్‌బాల్‌కు చెక్
రెండేళ్లుగా బెన్ స్టోక్స్ కెప్టెన్సీ, మెకల్లమ్ కోచింగ్ లో టెస్ట్ క్రికెట్ నూ పరిమిత ఓవర్ల క్రికెట్ లాగే ఆడుతూ ఇంగ్లండ్ బ్యాటర్లు బాదేస్తున్నారు. దీనికి బజ్‌బాల్ అని అక్కడి మీడియా పేరు పెట్టింది. కానీ ఆ బజ్‌బాల్ ఇండియాలో మాత్రం పని చేయదని చాలా రోజులుగా ఇండియన్ క్రికెటర్లు అశ్విన్ లాంటి వాళ్లతో సహా అక్కడి మాజీలు కూడా హెచ్చరించారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇండియాలో పిచ్, స్పిన్ కు అనుకూలించే వాతావరణాన్ని పట్టించుకోకుండా ఇంగ్లండ్ బ్యాటర్లు అదే బజ్‌బాల్ స్టైల్లో ఆడబోయి వికెట్లు పారేసుకుంటున్నారు.
తొలి ఇన్నింగ్స్ లో జో రూట్ లాంటి పక్కా టెస్ట్ బ్యాటర్ ఓ రివర్స్ స్కూప్ ఆడబోయి తన వికెట్ పారేసుకున్న విధానమే దీనికి నిదర్శనం. ఇక రెండో ఇన్నింగ్స్ లో 557 పరుగుల లక్ష్యం ముందు ఉంటే.. ఆ టీమ్ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ మాజీలు మైఖేల్ వాన్, జెఫ్రీ బాయ్‌కాట్, నాసిర్ హుస్సేన్ లాంటి వాళ్లు కూడా తమ టీమ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంగ్లండ్ ఇలా ఆడటం వల్లే టీమిండియా టెస్ట్ క్రికెట్ లో పరుగుల పరంగా అతి పెద్ద విజయాన్ని నమోదు చేయగలిగింది. గతంలో 2021లో న్యూజిలాండ్ పై 372 పరుగులతో గెలవగా.. తాజాగా 434 పరుగులతో గెలిచి ఆ రికార్డును తిరగరాసింది. మరి మిగిలి ఉన్న రెండు టెస్టుల్లో అయినా ఇంగ్లండ్ ఈ బజ్‌బాల్ స్టైల్ ను పక్కన పెట్టి గెలవడానికి ప్రయత్నిస్తుందా లేక అదే దూకుడుతో ఆ మ్యాచ్ లలోనూ ఓడుతుందా చూడాలి.