Team India Super 8: సూపర్ 8లో ఆస్ట్రేలియాతో టీమిండియా ఢీ - మ్యాచ్ డేట్, టైమ్ ఫిక్స్!
13 June 2024, 9:23 IST
Team India Super 8: అమెరికాపై విజయంతో టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సూపర్ 8కు చేరుకుంది. సూపర్ 8లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. జూన్ 24న ఈ మ్యాచ్ జరగనుంది.
టీమిండియా సూపర్ 8
Team India Super 8: టీ20 వరల్డ్ కప్‌లో అమెరికాపై విజయంతో సూపర్ 8లోకి టీమిండియా అడుగుపెట్టింది. మూడు విజయాలతో గ్రూప్ ఏలో టాపర్‌గా నిలిచింది. సూపర్ 8లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. జూన్ 24న ఇండియా ఆస్ట్రేలియా మధ్య సూపర్ 8 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు వెస్టిండీస్ సెయింట్ లూసియాలోని డారెన్ సమీ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది. రాత్రి 8 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.
టీమిండియా టాపర్...
మూడు మ్యాచుల్లో మూడు విజయాలతో ఆరు పాయింట్లు సొంతం చేసుకున్న టీమ్ ఇండియా గ్రూప్ ఏలో టాపర్‌గా నిలిచింది. గ్రూప్ బీలోనూ మూడు విజయాలతో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్‌ను దక్కించుకున్నది. సూపర్ 8లో టీమిండియాకు ఏ1గా ఐసీసీ సీడింగ్ ఇచ్చింది. ఆస్ట్రేలియాకు బీ2గా సీడింగ్ దక్కింది. సూపర్ 8లో టీమిండియాతో తలపడే రెండో ప్రత్యర్థి ఎవరన్నది మరో ఒకటి రెండు రోజుల్లో తేలనుంది.లీగ్ స్టేజ్‌లో టీమిండియా తన చివరి మ్యాచ్ కెనడాతో తలపడనుంది. జూన్ 15న ఈ మ్యాచ్ జరుగనుంది.
టీమిండియాకు గట్టి పోటీ...
కాగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు అమెరికా గట్టి పోటీ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ట నస్టానికి 110 పరుగులు చేసింది. నితీష్ కుమార్ 27 రన్స్, స్టీవెన్ టేలర్ 24 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. అమెరికాను టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు అర్షదీప్ సింగ్. హర్దిక్ పాండ్యకు రెండు వికెట్లు దక్కాయి.
రెండు పరుగులకే రెండు వికెట్లు...
స్వల్ప లక్ష్యఛేదనలో రెండు పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది టీమిండియా. కోహ్లి తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ కాగా...రోహిత్ 3 పరుగులతో పెవిలియన్ చేరుకున్నాడు. పాకిస్థాన్‌కు షాకిచ్చిన సౌరభ్ నేత్రవాల్కర్ టీమిండియాను ఆరంభంలోనే దెబ్బతీశాడు.
పంత్ కూడా తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే పట్టుదలగా క్రీజులో పాతుకుపోయి టీమిండియాను గెలిపించారు. సూర్యకుమార్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 49 బాల్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో యాభై రన్స్ చేశాడు. శివమ్ దూబే 31 రన్స్‌తో రాణించాడు.
అమెరికా వర్సెస్ పాకిస్థాన్
కాగా గ్రూప్ ఏలో టీమిండియా తర్వాత అమెరికా రెండు విజయాలతో సూపర్ 8 ఛాన్స్ కోసం పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇస్తోంది. అమెరికా తన చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలిస్తే పాకిస్థాన్‌కు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టక తప్పదు.