Team India: టీ20 వరల్డ్ కప్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడి కనుమరుగైన టీమిండియా క్రికెటర్లు వీళ్లే!
Team India: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తరఫున కొందరు క్రికెటర్లు ఒకే ఒక మ్యాచ్ ఆడి ఆ తర్వాత జట్టులో కనిపించకుండాపోయారు.ఆ క్రికెటర్లు ఎవరంటే?
Team India: జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని, వరల్డ్ కప్ ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. కానీ ఆ అవకాశం అందరికి దక్కదు. అందుకు ప్రతిభతో పాటు కొన్నిసార్లు లక్ కూడా కలిసిరావాలి. కొందరు టీమిండియా క్రికెటర్లకు అవకాశాలు వచ్చినా అదృష్టం మాత్రం కలిసిరాలేదు. తమ ఆటతీరుతో టీ20 వరల్డ్ కప్‌కు ఎన్నికైనా వీరు ఒకే ఒక మ్యాచ్ మాత్రమే ఆడి ఆ తర్వాత జట్టులో కనిపించకుండాపోయారు. ఆ క్రికెటర్లు ఎవరంటే?
అశోక్ దిండా...
వైవిధ్యమైన పేస్ బౌలింగ్‌తో సెలెక్టర్లు దృష్టిని ఆకర్షించిన బెంగాళీ పేసర్ 2012 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ వరల్డ్ కప్‌లో ఒకే ఒక మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం అశోక్ దిండాకు దక్కింది. లీగ్ దశలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే కనిపించాడు.
ఈ మ్యాచ్‌లో విఫలం కావడంతో అతడికి మరో అవకాశం దక్కలేదు. ఆ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయాడు అశోక్ దిండా. టీమిండియా తరఫున 13 వన్డేలు, 12 టీ20 మ్యాచ్‌లు ఆడిన దిండా ప్రస్తుతం క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
వినయ్ కుమార్...
టీమిండియా పేసర్ వినయ్ కుమార్ 2010 టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తోనే టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు వినయ్‌కుమార్. అయినా ఆ వరల్డ్ కప్‌లో అతడికి మరో మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. సింగిల్ మ్యాచ్‌తోనే వరల్డ్ కప్ ముగించాడు వినయ్ కుమార్
మనీష్ పాండే...
మనీష్ పాండే టీమిండియాలో కనిపించి చాలా కాలమే అవుతోంది. ఈ హిట్టర్ 2016 టీ20 వరల్డ్ కప్‌లో ఓ మ్యాచ్ ఆడాడు. వెస్టిండీస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మనీష్ పాండేకు చోటు దక్కింది. ఆ మ్యాచ్‌లో మనీష్ పాండేకు బ్యాటింగ్ దిగే ఛాన్స్ రాలేదు. అంతే కాకుండా అదే మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలై వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.
దీపక్ హుడా
ఐపీఎల్‌లో సంచలన ఇన్నింగ్స్‌లతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు దీపక్ హుడా. క్లాస్ ఆటతీరుతో మాజీ క్రికెటర్ల తో పాటు క్రికెట్ ఫ్యాన్స్ మన్ననల్ని అందుకున్నాడు. జాతీయ జట్టులో చాలా కాలం పాటు కొనసాగుతాడని అందరూ అనుకున్నారు.
2022 టీ20 వరల్డ్ కప్ కోసం సెలెక్టర్లు దీపక్ హుడాను సెలెక్ట్ చేశారు. కానీ ఈ వరల్డ్ కప్‌లో కేవలం అతడికి ఒక్క మ్యాచ్ మాత్రమే అడే ఛాన్స్ దక్కింది. లీగ్ దశలో సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే దీపక్ హుడా కనిపించాడు. ఆ మ్యాచ్‌లో డకౌట్ కావడంతో దీపక్ హుడాను టీమ్ మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది.
రాహుల్ చాహర్....
2021 టీ20 వరల్డ్ కప్‌లో అనూహ్యంగా చోటును దక్కించుకున్నాడు స్పిన్నర్ రాహుల్ చాహర్. ఒకే ఒక మ్యాచ్ మినహా ఈ వరల్డ్ కప్ మొత్తం బెంచ్‌కు పరిమితమయ్యాడు రాహుల్. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే తుది జట్టులో రాహుల్ చాహర్‌కు చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో అతడు వికెట్లు తీయలేదు.
ఇషాన్‌కిషన్
రాహుల్ చాహర్ తో పాటు ఇషాన్ కిషన్ కూడా 2021 వరల్డ్ కప్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్‌తో లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో బరిలో దిగిన ఇషాన్ కిషన్ నాలుగు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్ టోర్నీ ఆసాంతం అతడిని పక్కనపెట్టింది.