Deepak Hooda: దీపక్ హుడా అరుదైన రికార్డు - టీమ్ ఇండియాకు లక్కీ ప్లేయర్ గా మారిన క్రికెటర్
అంతర్జాతీయ క్రికెట్ లో టీమ్ ఇండియా యువ ప్లేయర్ దీపక్ హుడా అరుదైన రికార్డ్ ను నెలకొల్పాడు. ఆ రికార్డ్ ఏదంటే....
దీపక్ హుడా అంతర్జాతీయ క్రికెట్ లోకి ఐదేళ్ల క్రితమే అడుగుపెట్టాడు. కానీ ఆ సమయంలో అదృష్టం కలిసిరాకపోవడంతో ఒక్క సిరీస్ తోనే జట్టు నుండి వైదొలిగాడు. ఆ తర్వాత నాలుగైదేళ్ల పాటు టీమ్ ఇండియాలో మళ్లీ అతడి పేరు వినిపించలేదు. 2022 ఐపీఎల్ లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యం వహించిన దీపక్ హుడా 15 మ్యాచుల్లో 451 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్ అద్భుతమైన ఆటతీరుతో తిరిగి జాతీయ జట్టులో స్థానాన్ని సంపాదించుకున్నాడు. వెస్టిండీస్ తో పాటు శ్రీలంక, ఐర్లాండ్ సిరీస్ లలో బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్నాడు. ఐర్లాండ్ పై టీ20ల్లో సెంచరీ చేశాడు. జింబాబ్వే సిరీస్ కు ఎంపికైన అతడు రెండో వన్డేలో 25 పరుగులు చేసి భారత్ ను గెలిపించాడు. ఈ మ్యాచ్ తో దీపక్ హుడా ఓ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. క్రికెటర్ గా అరంగేట్రం చేసిన తర్వాత దీపక్ హుడా ఆడిన పదహారు మ్యాచుల్లో టీమ్ ఇండియా విజయాన్ని సాధించింది.
దీపక్ హుడా ఇప్పటివరకు తొమ్మిది టీ20 మ్యాచ్ లు, ఏడు వన్డేల్లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అతడు ఆడిన అన్ని మ్యాచుల్లో ఇండియా గెలిచింది. ఇంటర్ నేషనల్ క్రికెట్ ఈ ఘనతను సాధించిన ఏకైక క్రికెటర్ గా దీపక్ హుడా నిలిచాడు.
గతంలో ఈ రికార్డ్ రొమేనియా ప్లేయర్ సాట్విక్ నడిగోటియా పేరు మీద ఉంది. నడిగోటియా అరంగేట్రం చేసిన సమయం నుండి పదిహేను మ్యాచుల్లో రొమేనియా విజయాన్ని సాధించింది. జింబాబ్వేతో జరిగిన రెండో వన్డే ద్వారా అతడి రికార్డ్ ను దీపక్ హుడా అధిగమించాడు. రెండో వన్డేలో 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాను సంజూ శాంసన్, దీపక్ హుడా విజయ తీరాలకు చేర్చారు.