IND vs PAK T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియాదే డామినేషన్ - రికార్డులు ఏం చెబుతున్నాయంటే?
IND vs PAK T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో నేడు(ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రికార్డులు, బలాబలాల పరంగా టీమిండియానే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
IND vs PAK T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో క్రికెట్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న మ్యాచ్‌లలో ఇండియా, పాకిస్థాన్ పోరు ఒకటి. ఆదివారం (నేడు) న్యూయార్క్ లోని నాసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ పోరులో టీమిండియా ఫేవరేట్‌గా బరిలో దిగుతోంది. ఫామ్, బలాబలాలు గత రికార్డుల పరంగా పాకిస్థాన్‌పై టీమిండియాదే డామినేషన్ కనబడుతోంది.
ఏడు సార్లు తలపడగా...
ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా, పాకిస్థాన్ ఏడు సార్లు తలపడ్డాయి. ఇందులో ఐదింటిలో టీమిండియా విజయం సాధించగా ఒకే ఒక మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. మొత్తంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఇప్పటివరకు 12 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. అందులో తొమ్మిదింటిలో టీమిండియా విజయ కేతనం ఎగురవేయగా..మూడింటిలో మాత్రమే పాకిస్థాన్ గెలిచింది.
తొలి వరల్డ్ కప్‌లో ఫైనల్...
తొలి టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాతో పాటు పాకిస్థాన్ ఫైనల్ చేరుకున్నాయి. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసి వరల్డ్ కప్ అందుకున్నది. 2022 టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా విజయాన్ని అందుకున్నది. ఈ మ్యాచ్‌లో కోహ్లి, హార్దిక్ పాండ్య టీమిండియాను గెలిపించారు.
విరాట్ విఫలమైనా...
ఈ వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి విఫలమైన రోహిత్ శర్మ, రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో రాణించారు. అర్షదీప్, బుమ్రా, సిరాజ్ వంటి బౌలర్లతో టీమిండియా పేస్ దళం పటిష్టంగా ఉంది. రోహిత్, విరాట్, సూర్యకుమార్, పంత్ వంటి హిట్టర్లు, హార్దిక్ పాండ్య, జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ వంటి ఆల్‌రౌండర్లతో టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది.
అమెరికా చేతిలో ఓటమి...
తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలవ్వడం ఆ దేశ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలిసారి వరల్డ్ కప్ ఆడుతోన్న అమెరికా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. అమెరికా చేతిలో ఓటమితో జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. బాబర్ ఆజాం మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ఫామ్‌లో లేకపోవడం, బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడం పాకిస్థాన్‌ను కలవరపెడుతోన్నాయి.
టీమిండియా జట్టు అంచనా…
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్, రిషబ్ పంత్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సిరాజ్, బుమ్రా, అర్షదీప్
పాకిస్థాన్ జట్టు అంచనా…
బాబర్ ఆజాం, రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాబాద్ ఖాన్, ఇమాద్ వాసిమ్, షాహిన్ అఫ్రీదీ, మహ్మద్ అమీర్, హరీస్ రౌఫ్, నసీమ్ షా