WI vs UGA: వెస్టిండీస్ బౌలర్ల విశ్వరూపం - 39 పరుగులకే ఉగాండ ఆలౌట్ - టీ20 వరల్డ్ కప్‌లో చెత్త రికార్డ్
WI vs UGA: వెస్టిండీస్ పేస్ బౌలర్ల ధాటికి పసికూన ఉగాండ విలవిలలాడింది. 39 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఉగాండపై వెస్టిండీస్ 134 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
WI vs UGA: టీ20 ఫార్మేట్ అనగానే వెస్టిండీస్ బ్యాటర్లు రెచ్చిపోవడం కామన్. కానీ ఈ సారి సీన్ రివర్స్ అయ్యింది. వెస్టిండీస్ బౌలర్లు విజృంభించారు. అకేల్ హుస్సేన్ దెబ్బకు ఉగాండ టీమ్ 39 పరుగులకే కుప్పకూలింది.
ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అకేల్ హుస్సేన్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. హుస్సేన్‌తో పాటు మిగిలిన వెస్టిండీస్ బౌలర్ల దెబ్బకు ఉంగాడ విలవిలలాడింది. ఈ మ్యాచ్‌లో ఉగాండపై వెస్టిండీస్ 134 పరుగుల తేడాతో రికార్డ్ విజయాన్ని అందుకున్నది.
వెస్టిండీస్ 173 రన్స్...
ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జాసన్ ఛార్లెస్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ (22 రన్స్), పావెల్ (23 రన్స్) ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.
చివరలో ఆంద్రీ రసెల్ మెరుపులతో వెస్టిండీస్ ఈ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. 17 బాల్స్‌లో ఆరు ఫోర్లతో రసెల్ 30 రన్స్ చేశాడు. ఉగాండ బౌలర్లలో కెప్టెన్ మసాబా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. భారత సంతతి బౌలర్లు దినేష్ నక్రానీ, ఆల్ఫేష్ రంజానీ పరుగులు నియంత్రించడమే కాకుండా తలో వికెట్ తీసుకున్నారు.
హుస్సేన్ పేస్ ధాటికి...
174 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఉంగాడకు అకేల్ హుస్సేన్ చుక్కలు చూపించాడు. అతడి పేస్ ధాటికి సున్నా పరుగులకే ఉగాండ తొలి వికెట్ కోల్పోయింది. హుస్పేన్‌తో రసెల్, రోమారియో షెఫార్డ్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో ఉగాండ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇలా వచ్చి అలా వెళ్లారు. ఒకనొక దశలో ఉగాండ 25 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
30 పరుగులు దాటడం అనుమానంగానే కనిపించింది. కానీ తొమ్మిదో నంబర్ బ్యాట్స్‌మెన్ మియాగి 13 పరుగులు చేయడంతో చెత్త రికార్డ్ నుంచి ఉగాండ తప్పించుకున్నది. మియాగి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉగాండ టీమ్‌లో అతడు ఒక్కటే డబుల్ డిజిట్ స్కోరు చేశాడు. ముగ్గురు డకౌట్ అయ్యారు.
వెస్టిండీస్ బౌలర్లలో హుస్సేన్ ఐదు, జోసెఫ్ రెండు వికెట్లు తీశారు. రసెల్, షెఫార్డ్, మోతీకి తలో వికెట్ దక్కింది.
అత్యల్ప స్కోరు...
ఈ మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్‌లో అత్యల్ప స్కోరును నమోదు చేసిన రెండో టీమ్‌గా ఉగాండ చెత్త రికార్డును మూట గట్టుకుంది. గతంలో 2014 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై నెదర్లాండ్స్ 39 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ సరసన ఉగాండ నిలిచింది.