Crime news: జైపూర్ నగల వ్యాపారి ఘరానా మోసం; అమెరికా మహిళను రూ. 6 కోట్లకు ముంచిన వైనం
జైపూర్ కు చెందిన ఒక నగల వ్యాపారి అమెరికాకు చెందిన ఒక మహిళను రూ. 6 కోట్లకు మోసం చేశాడు. నిజమైన బంగారు ఆభరణాలుగా నమ్మించి, నకిలీ ఆభరణాలను, వజ్రాలను అంటగట్టాడు. కేవలం రూ. 300 ల విలువైన డూప్లికేట్ నగలు ఇచ్చి, ఆమె నుంచి రూ. 6 కోట్లు తీసుకున్నాడు.
Crime news: జైపూర్ కు చెందిన గౌరవ్ సోనీ అనే నగల వ్యాపారి కేవలం రూ.300 విలువ చేసే నకిలీ ఆభరణాలు ఇచ్చి, ఒక అమెరికా మహిళ వద్ద నుంచి రూ.6 కోట్లు కొట్టేశాడు. రాజస్థాన్ లోని జైపూర్ లోని జోహ్రీ బజార్ లో ఉన్న గౌరవ్ సోనీ కి చెందిన దుకాణంలో చెరీష్ అనే అమెరికా మహిళ ఈ నకిలీ ఆభరణాలను కొనుగోలు చేశారు. అందుకు రూ. 6 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించింది.
గోల్డ్ పాలిష్ నగలు
వివరాల్లోకి వెళితే, అమెరికా మహిళ చెరిష్ కు 2022లో ఇన్స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడింది. రెండేళ్లుగా ఆమె అతని నుంచి పలు నగలు కొనుగోలు చేసింది. తాను నిజమైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నానని నమ్మిన ఆమె గౌరవ్ సోనీకి దఫదఫాలుగా రూ.6 కోట్లకు పైగా చెల్లించింది. అయితే, ఆ అమెరికన్ మహిళ నిజమైన బంగారు ఆభరణాలుగా భావించినవి వాస్తవానికి గోల్డ్ పాలిష్ తో కూడిన నకిలీ నగలు. వాటి విలువ రూ. 300 కూడా ఉండదు.
ఎగ్జిబిషన్ లో పెట్టి..
ఈ ఏడాది ఏప్రిల్ లో అమెరికాలో జరిగిన ఎగ్జిబిషన్ లో చెరిష్ ఈ నగలను ప్రదర్శించింది. అక్కడ ఇవి నకిలీ నగలని తేలింది. దాంతో, ఈ మోసం వెలుగులోకి వచ్చింది. తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె భారత్ కు వెళ్లి గౌరవ్ సోనీ ని ప్రశ్నించింది. అనంతరం, జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే, ఈ విషయంలో అమెరికా రాయబార కార్యాలయం సహాయం కూడా కోరింది.
పరారీలో నిందితుడు
ప్రస్తుతం గౌరవ్ సోనీ తన తండ్రి రాజేంద్ర సోనీతో కలిసి పరారీలో ఉన్నాడు. తండ్రీకొడుకుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఈ నకిలీ ఆభరణాలకు హాల్ మార్క్ ధ్రువీకరణ పత్రాలను అందించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు కుట్రపన్ని రూ.300 విలువైన బంగారు పాలిష్ తో కూడిన నకిలీ ఆభరణాలను రూ.6 కోట్లకు ఆ అమెరికా మహిళకు విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వారు ఆమెకు హాల్ మార్క్ ప్రామాణికత ధృవీకరణ పత్రాన్ని కూడా అందించారు. నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన నందకిశోర్ ను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న తండ్రీకొడుకుల కోసం గాలిస్తున్నామని నార్త్ అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ భజరంగ్ సింగ్ షెకావత్ తెలిపారు.