MI vs CSK IPL 2024: ప్చ్...రోహిత్ సెంచరీ చేసినా ముంబైకి తప్పని ఓటమి - వాంఖడేలో ధోనీ విధ్వంసం
14 April 2024, 23:40 IST
MI vs CSK IPL 2024: ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ముంబై 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రాణించలేకపోవడంలో ముంబై ఓడిపోయింది.
రోహిత్ శర్మ
MI vs CSK IPL 2024: ఆదివారం ముంబై ఇండియన్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు థ్రిల్లింగ్‌ను పంచింది.ఈ ఉత్కంఠపోరులో చెన్నై ఇరవై పరుగుల తేడాతో ముంబైపై విజయాన్ని సాధించింది. రోహిత్ శర్మ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్స్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో అతడి సెంచరీ వృథాగా మారింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 186 రన్స్ చేసింది. ఇరవై పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
చక్కటి ఆరంభం...
భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్‌కిషన్ చక్కటి ఆరంభాన్ని అందించారు. ఫోర్లు, సిక్సర్లతో దంచికొట్టారు. వీరిద్దరి జోరుతో ఏడు ఓవర్లలోనే ముంబై డెబ్బై పరుగులు చేసింది. జోరు మీదున్న ఈషాన్‌ను ఔట్ చేసి ముంబైకి మతీషా పతిరణ షాకిచ్చాడు. ఇషాన్ పదిహేను బాల్స్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 రన్స్ చేశాడు. అదే ఓవర్‌లో సూర్యకుమార్ కూడా పతిరణ బౌలింగ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు.
తిలక్ వర్మ సహకారంతో...
దాంతో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ సహకారంతో ముంబై ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ గాడిలో పెట్టాడు. చెన్నై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 29 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు రోహిత్. మరో ఎండ్‌లో తిలక్ వర్మ కూడా ధాటిగా ఆడాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడగొట్టి మరోసారి చెన్నైకి బ్రేకిచ్చాడు పతిరణ. తిలక్ వర్మను పెవిలియన్ పంపించాడు. 20 బాల్స్‌లో ఐదు ఫోర్లతో 31 రన్స్ చేసి తిలక్ వర్మ ఔటయ్యాడు.
పాండ్య విఫలం...
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్య కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. టిమ్ డేవిడ్ రెండుసిక్సర్లు కొట్టి దూకుడు మీద కనిపించిన అతడి జోరు ఎక్కువ సేపు కొనసాగలేదు. రోమారియా షెఫర్డ్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఓ వైపు వికెట్లు పడుతోన్న రోహిత్ శర్మ మాత్రం పట్టుదలగా క్రీజులో నిలదొక్కుకున్నాడు.
సెంచరీని పూర్తిచేసుకున్నాడు. 61 బాల్స్‌లో వంద పరుగులు చేశాడు. ఇతర బ్యాట్స్‌మెన్స్ నుంచి సహకారం కరువవ్వడంతో అతడి పోరాటం వృథా అయ్యింది. చివరి వరకు క్రీజులో ఉన్న రోహిత్ శర్మ 63 బాల్స్‌లో పదకొండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 105 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో పతిరణ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
రుతురాజ్, దూబే ధనాధన్ బ్యాటింగ్...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇరవై ఓవర్లలో 206 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ 40 బాల్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 69 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శివమ్ దూబే 38 బాల్స్‌లో పది ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 ర న్స్ తో నాటౌట్‌గా మిగిలాడు. వీరిద్దరు ధాటిగా ఆడటంతో చెన్నై స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ధోనీ ఫినిషింగ్...
చివరి ఓవర్‌లో ధోనీ హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టడంతో చెన్నై స్కోరు 200 దాటింది. నాలుగు బాల్స్‌లోనే ధోనీ మూడు సిక్సర్లతో 20 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్య వేసిన చివరి ఓవర్‌లో చెన్నైకి 26 పరుగులు వచ్చాయి. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్య రెండు వికెట్లు తీసుకున్నాడు.