MI vs CSK: ధోనీ హ్యాట్రిక్ సిక్సులు - దంచికొట్టిన దూబే, రుతురాజ్ - ముంబై ముందు చెన్నై భారీ టార్గెట్
MI vs CSK: ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే చెలరేగడంతో చెన్నై సూపర్ కింగ్స్ 206 పరుగులు చేసింది. చివరలో ధోనీ హ్యాట్రిక్ సిక్సులతో మెరిశాడు.
MI vs CSK: ఐపీఎల్‌లో ఆదివారం జరుగుతోన్న మ్యాచ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివమ్ దూబే చెలరేగడంతో ముంబై ఇండియన్స్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ 207 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. రుతురాజ్, శివమ్ దూబే హాఫ్ సెంచరీలతో రాణించారు. చివరలో ధోనీ 4 బాల్స్‌లోనే మూడు సిక్సర్లతో ఇరవై రన్స్ చేశాడు.
రహానే, రవీంద్ర విఫలం...
ఈ మ్యాచ్‌లో చెన్నై ఓపర్లు అజింక్య రహానే, రచిన్ రవీంద్ర తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరుకున్నారు. రహానే ఐదు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. రచిన్ రవీంద్ర కూడా 21 పరుగులు చేసి ఔటయ్యాడు. అరవై పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన చెన్నైని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివమ్ దూబే ఆదుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్, దూబే ఫోర్లు, సిక్సర్లతో ముంబై బౌలర్లను చితకొట్టారు. రోమారియో షెఫర్డ్ వేసిన 14వ ఓవర్‌లో శివమ్ దూబే రెండు సిక్సర్లు, ఓ ఫోర్, గైక్వాడ్ ఓ ఫోర్ కొట్టడంతో 22 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఆకాష్ మధ్వాల్ వేసిన ఓవర్‌లో 17 పరుగులు రాబట్టారు.
రుతురాజ్ రికార్డ్...
ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో (57 ఇన్నింగ్స్‌లు) రెండు వేల పరుగులు పూర్తిచేసుకున్న క్రికెటర్లలో ఒకరిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. నలభై బాల్స్‌లోనే ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 69 పరుగులు చేసి రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు.
రుతురాజ్ ఔటైనా శివమ్ దూబే మాత్రం తన దూకుడును తగ్గించలేదు. 28 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న అతడు ఆ తర్వాత తన జోరును మరింత పెంచాడు. అతడిని ఔట్ చేసేందుకు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య చేసిన ప్రయత్నాలు అన్ని విఫలమయ్యాయి. బుమ్రా నాలుగు ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చాడు. కానీ వికెట్ మాత్రం తీయలేకపోయాడు. మిచెల్ 14 బాల్స్‌లో 17 రన్స్ చేసి పెవిలియన్ చేరుకున్నాడు. అతడిని చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్య ఔట్ చేశాడు.
ధోనీ హ్యాట్రిక్ సిక్స్‌లు...
మిచెల్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌నే సిక్స్‌గా మలిచి అభిమానులను అలరించాడు. హార్దిక్ వేసిన స్లో బాల్‌ను లాంగ్ ఆఫ్ మీదుగా సిక్స్‌గా మలిచాడు.
ఆ తర్వాత రెండు బాల్స్‌ను బౌండరీ లైన్ దాటించాడు. ధోనీ హ్యాట్రిక్ సిక్సులతో చెన్నై స్కోరు రెండు వందల పరుగులు దాటింది. ధోనీ హ్యాట్రిక్ సిక్స్‌లతో స్టేడియం దద్దరిల్లింది. చివరి బాల్‌కు ధోనీ రెండు పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్య వేసిన చివరి ఓవర్‌లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. చివరి వరకు క్రీజులో ఉన్న శివమ్ దూబే 38 బాల్స్‌లో పదిఫోర్లు, రెండు సిక్సర్లతో 66 రన్స్ చేయగా...ధోనీ నాలుగు బాల్స్‌లో మూడు సిక్సర్లతో ఇరవై రన్స్ చేశాడు.
ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్య రెండు వికెట్లు తీసుకోగా... శ్రేయస్ గోపాల్, కోయిట్జ్ తలో ఒక్క వికెట్ సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, ధోనీ కెప్టెన్లు స్థానంలో కాకుండా ఆటగాళ్లుగా తొలిసారి బరిలో దిగారు.