తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: భారత్ జట్టు ఓటమికి అసలు కారణం చెప్పిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఒకవేళ అలా చేసుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదట

Team India: భారత్ జట్టు ఓటమికి అసలు కారణం చెప్పిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఒకవేళ అలా చేసుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదట

Galeti Rajendra HT Telugu

26 October 2024, 19:52 IST

google News
  • Rohit Sharma on Pune defeat: భారత్ గడ్డపై వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత తొలిసారి సిరీస్‌ని చేజార్చుకుంది. ఈరోజు పుణె టెస్టులో ఓటమి తర్వాత రోహిత్ శర్మ హుందాగా స్పందిస్తూ టీమ్ తప్పుల్ని అంగీకరించాడు. 

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (AFP)

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

భారత్ జట్టుకి సొంతగడ్డపై ఊహించని చేదు అనుభవం ఎదురైంది. శనివారం పుణె వేదికగా ముగిసిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ టీమ్.. తొలిసారి భారత్ గడ్డపై టెస్టు సిరీస్‌ని గెలిచింది. ఇప్పటికే బెంగళూరు వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టులోనూ భారత్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ టీమ్.. మూడు టెస్టుల సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది. ఇక చివరి టెస్టు మ్యాచ్ నవంబరు 1 నుంచి ముంబయి వేదికగా జరగనుంది.

న్యూజిలాండ్‌తో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయినా భారత కెప్టెన్ రోహిత్ శర్మ హుందాగా స్పందించాడు. పుణె టెస్టు ఓటమి తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రోహిత్ శర్మ ఏ ప్లేయర్‌నీ నిందించలేదు. ఓటమికి జట్టుని సమష్టిగా బాధ్యత చేస్తూ.. ఆఖరి టెస్టులో పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

వికెట్లు తీస్తే సరిపోదు.. రన్స్ చేయాలి

‘‘పుణె టెస్టు ఓటమి మమ్మల్ని నిరాశపరిచింది. మేము ఇది ఊహించలేదు. న్యూజిలాండ్‌కు ఈ క్రెడిట్ ఇవ్వాలి. వారు మా కంటే మెరుగ్గా క్రికెట్ ఆడారు. వచ్చిన కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మేము విఫలమయ్యాం. వాళ్లు విసిరిన సవాళ్లను ఛేదించడంలోనూ విఫలమయ్యాం. బోర్డుపై మేము సంతృప్తికరమైన పరుగులు పెట్టామని నేను అనుకోవడం లేదు. విజయానికి 20 వికెట్లు కావాలి నిజమే.. కానీ బోర్డుపై తగినన్ని పరుగులు పెట్టడం కూడా చాలా ముఖ్యం’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

పరిస్థితి మరోలా ఉండేది

‘‘వాస్తవానికి న్యూజిలాండ్‌ టీమ్‌ను 259 పరుగులకే ఆలౌట్ చేయడం అద్భుతం. బ్యాటింగ్‌కి మరీ కష్టమైన పిచ్ ఇది కాదు. కానీ.. మేం సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాం. ఒకవేళ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ స్కోరుకి కాస్త దగ్గరగా పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది’’ అని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 259 పరుగులు చేయగా.. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌటైంది. దాంతో కివీస్‌కి 103 పరుగుల ఆధిక్యం లభించింది.

భారత్ జట్టు 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ని చేజార్చుకోవడం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘‘ఇది టీమ్ సమిష్టి వైఫల్యం. నేను కేవలం బ్యాటర్లు, బౌలర్లను మాత్రమే నిందించే వ్యక్తిని కాదు. తప్పిదాలను దిద్దుకుని వాంఖడేలో అడుగుపెడతాం’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

ఛేదనలో ఒక్కడే

పుణె టెస్టులో మూడో రోజైన శనివారం 359 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కి న్యూజిలాండ్ నిర్దేశించింది. ఛేదనలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. కానీ.. అతనికి మరో ఎండ్‌ నుంచి సపోర్ట్ కరువైంది.

రోహిత్ శర్మ 8, విరాట్ కోహ్లీ 17 పరుగులు చేశారు. శుభమన్ గిల్ 23, రవీంద్ర జడేజా 42 పరుగులు చేయగా.. రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. గత 69 ఏళ్లుగా భారత్ గడ్డపై న్యూజిలాండ్ టీమ్ పర్యటిస్తుండగా.. ఆ జట్టు టెస్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.

తదుపరి వ్యాసం