Virat Kohli Suggestion: విరాట్ కోహ్లీ సూచనని మైదానంలో పట్టించుకోని కెప్టెన్ రోహిత్ శర్మ, తప్పని భారీ మూల్యం
Rohit Sharm DRS: విరాట్ కోహ్లీ వద్దని చెప్తున్నా డీఆర్‌ఎస్ కోరిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూల్యం చెల్లించుకున్నాడు. దెబ్బకి ఆ తర్వాత 40 ఓవర్లు మళ్లీ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ కోరే ధైర్యం చేయలేకపోయాడు.
న్యూజిలాండ్‌తో పుణె వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సూచనని పట్టించుకోని భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిమిషాల్లోనే భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన భారత్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 16/1తో నిలిచింది. టీమిండియా ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులు వెనకబడి ఉండగా.. క్రీజులో యశస్వి జైశ్వాల్ (6 బ్యాటింగ్), శుభమన్ గిల్ (10 బ్యాటింగ్) ఉన్నారు.
స్పిన్నర్లకి వికెట్ల పండగ
పుణె పిచ్ తొలిరోజే స్పిన్నర్లకి అనుకూలించగా.. భారత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ (7/59), రవిచంద్రన్ అశ్విన్ (3/64) వికెట్ల పండగ చేసుకున్నారు. కివీస్ టాప్-3 బ్యాటర్లను అశ్విన్ ఔట్ చేయగా.. ఆ తర్వాత ఏడుగురినీ వరుస విరామాల్లో వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ బాట పట్టించాడు. అయినప్పటికీ భారత్ స్పిన్నర్లకి ఎదురొడ్డి దేవాన్ కాన్వె (76), రచిన్ రవీంద్ర (65) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
దేవాన్ కాన్వే దొరికినట్లే.. దొరికి
వాస్తవానికి దేవాన్ కాన్వె తక్కువ స్కోరుకే ఔట్ అయినట్లు కనిపించాడు. ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేసిన స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేయబోయిన కాన్వె ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయినట్లు కనిపించింది.జడేజా విసిరిన ప్లాట్ లెంగ్త్ బాల్.. బ్యాట్ పక్క నుంచి వెళ్లి ఫ్యాడ్‌ని తాకింది. దాంతో ఎల్బీడబ్ల్యూ భారత్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్‌ను తిరస్కరించాడు. దానికి కారణం బంతి బ్యాట్ ఎడ్జ్ తాకిందని అంపైర్ భావించడమే.
కోహ్లీ నో.. అందరూ ఎస్
కానీ.. అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ తీసుకోవాలని భావిస్తూ వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ అభిప్రాయాన్ని అడిగాడు. అప్పటికే విల్ యంగ్ వికెట్‌కి డీఆర్‌ఎస్ రూపంలో సహాయం చేసిన సర్ఫరాజ్ ఖాన్.. కాన్వె వికెట్ కోసం డీఆర్‌ఎస్ తీసుకోవాల్సిందిగా రోహిత్‌కి సూచించాడు. అతనితో పాటు ఒక్క విరాట్ కోహ్లీ మినహా మిగిలిన ప్లేయర్లు కూడా డీఆర్‌ఎస్ తీసుకోవాల్సిందిగా సూచించారు. కానీ.. కోహ్లీ మాత్రం డీఆర్‌ఎస్ తీసుకోవద్దంటూ రోహిత్ శర్మకి సూచిస్తూ కనిపించాడు.
భారత్‌కి చేజారిన డీఆర్‌ఎస్ ఆప్షన్
కానీ.. కోహ్లీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోని రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ కోరగా.. రీప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి అనంతరం ఫ్యాడ్‌ని తాకినట్లు తేలింది. దాంతో భారత్‌కి ఒక డీఆర్‌ఎస్ కోల్పోవడం ద్వారా మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఆ తర్వాత దాదాపు 40 ఓవర్లు రోహిత్ శర్మ మళ్లీ డీఆర్‌ఎస్ తీసుకునే సాహసం చేయలేదంటే ఆ తప్పు ఎంత ప్రభావితం చూపిందో అర్థం చేసుకోవచ్చు. ఫైనల్‌గా 64 ఓవర్‌లో మిచెల్ శాంట్నర్ కోసం రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ తీసుకుని సక్సెస్ అయ్యాడు.
రోహిత్ డకౌట్
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.9 బంతులాడిన రోహిత్ శర్మ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమై క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెరీర్‌లో రోహిత్ శర్మ డకౌటవడం ఇది 34వ సారికాగా.. టిమ్ సౌథీకి వికెట్ సమర్పించుకోవడం ఇది 14వసారి కావడం గమనార్హం.