Rishabh Pant Injury Update: రవీంద్ర జడేజా విసిరిన బంతితో గాయపడిన రిషబ్ పంత్, ఆపరేషన్ జరిగిన చోటే తాకిన బాల్
Rishabh Pant Injury: కారు యాక్సిడెంట్ తర్వాత రిషబ్ పంత్ తీవ్ర గాయాలతో దాదాపు 632 రోజులు క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన పంత్ మళ్లీ గాయపడ్డాడు. అది కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బంతిని అంచనా వేయలేక.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజైన గురువారం టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్‌లో స్పిన్నర్ రవీంద్ర జడేజా విసిరిన బంతి రిషబ్ పంత్ మోకాలికి బలంగా తాకింది. బంతి గమనాన్ని వికెట్ల వెనుక పంత్ అంచనా వేయలేకపోయాడు. దాంతో తక్కువ ఎత్తులో వేగంగా వచ్చిన బంతి మోకాలికి తాకింది.
పంత్ స్థానంలో కీపింగ్ ఎవరు?
కారు యాక్సిడెంట్ కారణంగా పంత్ మోకాలికి గత ఏడాది సర్జరీ జరిగిన చోటే ఆ బంతి తాకడంతో.. నొప్పితో మైదానంలోనే రిషబ్ పంత్ విలవిలలాడిపోయాడు. ఆ తర్వాత ఫిజియో సాయంతో కుంటుకుంటూ డ్రెస్సింగ్ రూముకి వెళ్లాడు. రిషబ్ పంత్ స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు.
తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు గురువారం 46 పరుగులకే ఆలౌటవగా.. రిషబ్ పంత్ టాస్ స్కోరర్‌గా నిలిచాడు. 49 బంతులు ఎదుర్కొన్న పంత్ 20 పరుగులు చేశాడు. ఇదే ఇన్నింగ్స్‌లో ఐదుగురు భారత బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. పంత్ గాయం తీవ్రత చూస్తుంటే అతను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడంపై కూడా సందేహాలు నెలకొంటున్నాయి.
పంత్ గాయంపై రోహిత్ ఏమన్నాడంటే
గురువారం ఆట తర్వాత రిషబ్ పంత్ గాయం గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘‘రిషబ్ పంత్‌కి సర్జరీ జరిగిన చోటే బంతి తాకింది. దాంతో బంతి తగిలిన చోట చిన్న వాపు వచ్చింది. వాపు తీవ్రత పెంచకూడదనే ఉద్దేశంతో విశ్రాంతి ఇచ్చాం. శుక్రవారం ఫిజియో, వైద్యుల సూచనల తర్వాత అతడ్ని మైదానంలోకి దింపడంపై నిర్ణయం తీసుకుంటాం’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
2022, డిసెంబరు చివర్లో రిషబ్ పంత్ కారుకి యాక్సిడెంట్ అయ్యింది. తీవ్రంగా గాయపడిన పంత్.. దాదాపు 632 రోజులు క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ఈ ఏడాది భారత్ జట్టులోకి రీఎంట్రీ మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.
మ్యాచ్‌లో టాప్ స్కోరర్
ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో సెంచరీ బాదిన రిషబ్ పంత్.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులోనూ సత్తాచాటేందుకు ప్రయత్నించాడు. పిచ్ ఫాస్ట్ బౌలర్లకి అతిగా సహకరిస్తున్నా చాలా సేపు యశస్వి జైశ్వాల్‌తో కలిసి కివీస్ బౌలర్లని పంత్ ఎదుర్కొన్నాడు. భారత జట్టులోని తొమ్మిది మంది బ్యాటర్లు కనీసం డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయిన పిచ్‌పై పంత్ 49 బంతులు ఎదుర్కొని 20 పరుగులు చేయడమే కాదు.. కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగాడు.