Dhruv Jurel: ధృవ్ జురెల్ మిలిటరీ సెల్యూట్ వెనుక అసలు స్టోరీ తెలుసా? తండ్రి కల నెరవేర్చిన యువ వికెట్ కీపర్-dhruv jurel military salute this is the reason behind the young wicket keeper batter doing this india vs england ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dhruv Jurel: ధృవ్ జురెల్ మిలిటరీ సెల్యూట్ వెనుక అసలు స్టోరీ తెలుసా? తండ్రి కల నెరవేర్చిన యువ వికెట్ కీపర్

Dhruv Jurel: ధృవ్ జురెల్ మిలిటరీ సెల్యూట్ వెనుక అసలు స్టోరీ తెలుసా? తండ్రి కల నెరవేర్చిన యువ వికెట్ కీపర్

Hari Prasad S HT Telugu
Feb 26, 2024 07:36 AM IST

Dhruv Jurel: టీమిండియా యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ ఇంగ్లండ్ తో నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ తర్వాత చేసిన మిలిటరీ సెల్యూట్ అందరినీ ఆకట్టుకుంది. తన తండ్రి కల నెరవేర్చడానికే తానిలా చేసినట్లు అతడు చెప్పాడు.

హాఫ్ సెంచరీ తర్వాత మిలిటరీ సెల్యూట్ చేస్తున్న ధృవ్ జురెల్
హాఫ్ సెంచరీ తర్వాత మిలిటరీ సెల్యూట్ చేస్తున్న ధృవ్ జురెల్ (AP)

Dhruv Jurel: టీమిండియాకు ధృవ్ జురెల్ రూపంలో మరో జెమ్ లాంటి వికెట్ కీపర్ దొరికాడు. ఆడిన తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చిన అతడు.. ఇక తన రెండో టెస్టులో సెంచరీకి చేరువగా వచ్చి ఔటయ్యాడు. కానీ అతడు చేసిన 90 పరుగులు మొత్తం మ్యాచ్ నే మలుపు తిప్పాయి. అయితే తన హాఫ్ సెంచరీ తర్వాత జురెల్ చేసిన మిలిటరీ సెల్యూట్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. దీని వెనుక స్టోరీ ఏంటో తెలుసా?

తండ్రి కల నెరవేర్చిన ధృవ్ జురెల్

ధృవ్ జురెల్ తండ్రి కార్గిల్ యుద్ధంలో పోరాడిన యోధుడు. అప్పుడు ఆయన శతృమూకల నుంచి దేశాన్ని కాపాడితే.. ఇప్పుడు జురెల్ కష్టాల్లో ఉన్న టీమ్ ను గట్టెక్కించాడు. హాఫ్ సెంచరీ తర్వాత తాను మిలిటరీ సెల్యూట్ చేయడం వెనుక కారణమేంటో మూడో రోజు ఆట ముగిసిన తర్వాత జురెల్ వెల్లడించాడు. అది తన తండ్రి కోసమే అని స్పష్టం చేశాడు.

"అది నా తండ్రి కోసం. ఆయన కార్గిల్ యుద్ధ వీరుడు. నిన్న ఆయనతో మాట్లాడినప్పుడు కనీసం ఒక్క సెల్యూటైనా చూపించు అని పరోక్షంగా అన్నారు. నేను పెరిగి పెద్దవాడిని అవుతున్న సమయంలో నేను చేసింది కూడా అదే. అది ఆయన కోసమే" అని ధృవ్ అన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేయగానే ధృవ్ జురెల్ ఇలా సెల్యూట్ చేసిన ఫొటోలు, వీడియో వైరల్ అయ్యాయి.

ధృవ్.. ది హీరో

ధృవ్ జురెల్ తండ్రి పేరు నేమ్ చంద్. ఆయన ఇండియన్ ఆర్మీలో హవల్దార్ గా పని చేశారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఆయన పాకిస్థాన్ శతృమూకలతో తలపడ్డారు. ఆ తర్వాత ఆర్మీ నుంచి రిటైరయ్యారు. ఇప్పుడు ధృవ్ జురెల్ ఓ క్రికెటర్ గా మారి టీమిండియాకు ఆడుతున్నాడు. ఇంగ్లండ్ పై నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 161 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో వచ్చిన అతడు.. ఎంతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.

తన రెండో టెస్టులోనే ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్ లాగా అతడు కనిపించాడు. కుల్దీప్ (28)తో కలిసి 8వ వికెట్ కు 76 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ కు భారీ ఆధిక్యం లభించలేదు. అయితే సెంచరీ ఖాయం అనుకున్న సమయంలో 90 పరుగుల దగ్గర బౌల్డయ్యాడు. మూడో రోజు తన గేమ్ ప్లాన్ గురించి అతడు చెప్పాడు.

"ఇది నా డెబ్యూ టెస్ట్ సిరీస్. సహజంగానే ఒత్తిడి ఉంటుంది. కానీ క్రీజులోకి వెళ్లిన తర్వాత టీమ్ నా నుంచి ఏం కోరుకుంటోందో అన్నది మాత్రమే ఆలోచించాను. ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే అన్ని రన్స్ చేయగలనని భావించాను" అని ధృవ్ జురెల్ తెలిపాడు. కుల్దీప్ ఔటైన తర్వాత కూడా మరో యువ ప్లేయర్ ఆకాశ్ దీప్ తో కలిసి 9వ వికెట్ కు కూడా విలువైన 40 రన్స్ జోడించాడు జురెల్.

దీంతో ఇంగ్లండ్ ఆధిక్యం 46 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత ఇంగ్లండ్ టీమ్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 145 పరుగులకే కుప్పకూలి ఇండియా ముందు 192 పరుగుల టార్గెట్ ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 రన్స్ చేసింది టీమిండియా. మరో 152 పరుగులు చేస్తే విజయం మనదే. రోహిత్ కాస్త ఊపు మీద కనిపించాడు. నాలుగో రోజే ఆట ముగియడం ఖాయం.