India Target: పుణె టెస్టులో న్యూజిలాండ్ 255కి ఆలౌట్.. భారత్ టార్గెట్ 359, ప్రమాదంలో 11 ఏళ్ల రికార్డ్-india vs new zealand 2nd test day 3 live score nz set ind a target of 359 to win ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Target: పుణె టెస్టులో న్యూజిలాండ్ 255కి ఆలౌట్.. భారత్ టార్గెట్ 359, ప్రమాదంలో 11 ఏళ్ల రికార్డ్

India Target: పుణె టెస్టులో న్యూజిలాండ్ 255కి ఆలౌట్.. భారత్ టార్గెట్ 359, ప్రమాదంలో 11 ఏళ్ల రికార్డ్

Galeti Rajendra HT Telugu
Oct 26, 2024 11:31 AM IST

IND vs NZ 2nd Test Live Score: పుణె టెస్టులో మూడో రోజైన శనివారం భారత్ బౌలర్లు చెలరేగారు. న్యూజిలాండ్ టీమ్‌ను ఈరోజు ఆట ఆరంభమైన గంట వ్యవధిలోనే ఆలౌట్ చేసేశారు. దాంతో భారత్ ముందు 359 పరుగుల టార్గెట్ నిలిచింది.

పుణె టెస్టులో భారత్ టార్గెట్ 359
పుణె టెస్టులో భారత్ టార్గెట్ 359 (PTI)

పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ టీమ్ శనివారం నిర్దేశించింది. మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం 198/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ టీమ్ భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దెబ్బకి వరుసగా వికెట్లు చేజార్చుకుని 255 పరుగులకే కుప్పకూలిపోయింది.

ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 103 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ ముందు 359 పరుగుల టార్గెట్‌ని పర్యాటక జట్టు నిలిపింది. మ్యాచ్‌లో ఇంకా రెండున్నర రోజుల ఆట మిగిలి ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌటైన భారత్ జట్టు ఛేదనలో ఎలా ఆడుతుందో చూడాలి.

జడేజా ఆఖర్లో మెరుపులు

మ్యాచ్‌లో శుక్రవారం బౌలింగ్‌లో నిరాశపరిచిన రవీంద్ర జడేజా ఈరోజు మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను కోలుకోనివ్వలేదు. అతనికి తోడుగా అశ్విన్ (2 వికెట్లు), వాషింగ్టన్ సుందర్ (4 వికెట్లు) క్రమశిక్షణతో బౌలింగ్‌ చేయడంతో న్యూజిలాండ్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఓవరాల్‌గా న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథమ్ 86 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరి ముగ్గురు బ్యాటర్లు శాంట్నర్ (4), సౌథీ (0), అజాజ్ పటేల్ (1) జడేజా దెబ్బకి సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు.

మ్యాచ్‌లో ఇప్పటి వరకు స్కోర్లు

గురువారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ జట్టు 156 పరుగులకే శుక్రవారం ఆలౌటైంది. దాంతో 103 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ టీమ్ ఈరోజు 255 పరుగులకి కుప్పకూలింది.

ప్రమాదంలో పడిన 11 ఏళ్ల రికార్డ్

భారత్ జట్టు ఇప్పటి వరకు సొంతగడ్డపై 2012-13 నుంచి ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా ఓడిపోలేదు. కానీ.. ఈ పుణె టెస్టులో ఓడిపోతే ఆ రికార్డ్ బ్రేక్ అవుతుంది. మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే గత వారం బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓడిన టీమిండియా 0-1తో వెనకబడి ఉంది. దాంతో పుణె టెస్టులోనూ ఓడిపోతే 0-2తో సిరీస్‌ కూడా భారత్‌కి చేజారనుంది. ఈ సిరీస్ తర్వాత భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనుండగా.. సొంతగడ్డపై సిరీస్ చేజార్చుకోవడం భారత్ జట్టుకి ఇబ్బందికర పరిస్థితే. ఆస్ట్రేలియాతో నవంబరు నుంచి ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ జట్టు ఆడనుంది.

Whats_app_banner