IND vs NZ 2nd Test Highlights: పుణె టెస్టులో రెండో రోజే డ్రైవర్ సీటులోకి న్యూజిలాండ్, పరువు కోసం భారత్ ప్రయాస
India vs New Zealand 2nd Test DAY 2 Highlights: భారత్ జట్టుకి సొంతగడ్డపైనే పరువు పొగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బెంగళూరు టెస్టులో పేలవంగా ఓడిన టీమిండియా.. పుణె టెస్టులోనూ రెండో రోజే బాగా వెనకబడిపోయిది.
భారత్, న్యూజిలాండ్ మధ్య పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజైన శుక్రవారం ఆట ముగిసింది. ఈరోజు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు 156 పరుగులకే కుప్పకూలిపోగా.. 103 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న న్యూజిలాండ్ టీమ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 198/5తో మెరుగైన స్థితిలో నిలిచింది. దాంతో ఇప్పటికే 301 పరుగుల ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ టీమ్ భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపే అవకాశం ఉంది.
కివీస్ కెప్టెన్ ఒంటరి పోరాటం
భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌటైన తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ టామ్ లాథమ్ 133 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేశాడు. ఒక ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన టామ్ లాథమ్ పరుగులు చేయగా.. అతనికి దేవాన్ కాన్వె (17), విల్ యంగ్ (23), రచిన్ రవీంద్ర (9), డార్లీ మిచెల్ (18) నామమాత్రపు సపోర్ట్ మాత్రమే ఇచ్చారు. అయినప్పటికీ ఓపికగా ఆడిన టామ్ లాథమ్ కివీస్‌కి తిరుగులేని ఆధిక్యాన్ని అందించి ఆ జట్టు టీమ్ స్కోరు 183 వద్ద ఔట్ అయ్యాడు.
భారత్ ముందు భారీ లక్ష్యం
ఈరోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో న్యూజిలాండ్ బ్యాటర్లు టామ్ బ్లండెల్ (30 బ్యాటింగ్: 70 బంతుల్లో 2x4), గ్లెన్ ఫిలిప్స్ (9 బ్యాటింగ్: 29 బంతుల్లో 1x4) ఉన్నారు. మ్యాచ్‌లో ఇంకా 3 రోజుల ఆట మిగిలి ఉండగా.. న్యూజిలాండ్ టీమ్ శనివారం ఒక సెషన్ పూర్తిగా బ్యాటింగ్ చేసినా కనీసం 350-370 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కి నిర్దేశించే అవకాశం ఉంటుంది. పిచ్ స్పిన్నర్లకి అతిగా సహకరిస్తున్న నేపథ్యంలో 300 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువు కాదు.
మళ్లీ సుందర్ మ్యాజిక్
శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన వాషింగ్టన్ సుందర్.. ఈరోజు రెండో ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్లు పడగొట్టాడు. అతనికి అశ్విన్ నుంచి కాస్త సపోర్ట్ లభించగా.. మరోసారి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విఫలమయ్యారు. దాంతో సుందర్‌ని ఈరోజు జాగ్రత్తగా ఎదుర్కొన్న న్యూజిలాండ్ టీమ్.. మిగిలిన బౌలర్లపై ఎదురుదాడి చేసి పరుగుల్ని రాబట్టేసింది.
భారత్ ఈ మ్యాచ్‌లో ఓడితే
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీమ్ ఇప్పుడు డ్రైవర్ సీటులోకి వెళ్లిపోయినట్లే. ఇటీవల ముగిసిన బెంగళూరు టెస్టులోనూ భారత్ జట్టుని 8 వికెట్ల తేడాతో ఓడించిన న్యూజిలాండ్ టీమ్ 36 ఏళ్ల తర్వాత గెలుపు రుచి చూసింది. ఇప్పుడు ఈ పుణె టెస్టులోనూ గెలిస్తే భారత్‌కి సొంతగడ్డపై 12 ఏళ్ల తర్వాత టెస్టుల్లో సిరీస్ ఓటమిని రుచి చూపించిన జట్టుగా న్యూజిలాండ్ నిలవనుంది.