India All Out: పుణె టెస్టులో చేతులెత్తేసిన భారత్, న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకి 156కే ఆలౌట్
Team India All Out: బెంగళూరు టెస్టు ఓటమి నుంచి భారత్ జట్టు బ్యాటర్లు గుణపాఠాలు నేర్చుకోలేదని పుణె టెస్టుతో అర్థమైపోయింది. బ్యాటింగ్ తెలియనట్లు ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెవిలియన్‌కి క్యూ కట్టారు.
బెంగళూరు టెస్టు తరహాలోనే పుణె టెస్టులోనూ భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం 16/1తో మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా వరుసగా వికెట్లు చేజార్చుకుని 156 పరుగులకే కుప్పకూలిపోయింది.
కివీస్‌కి 103 పరుగుల ఆధిక్యం
టీమ్‌లో కనీసం ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకోలేకపోయారు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ టీమ్ 259 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు 156కే కుప్పకూలిపోయింది. దాంతో కివీస్‌కి 103 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇటీవల బెంగళూరు వేదికగా ముగిసిన తొలి టెస్టులోనూ మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే భారత్ జట్టు ఆలౌటైన విషయం తెలిసిందే.
ఈరోజు మొదటి సెషన్ ఆరంభంలోనే శుభమన్ గిల్ (30: 72 బంతుల్లో 2x4, 1x6)కి లైఫ్ లభించినా.. వృథా చేసుకున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (30: 60 బంతుల్లో 4x4) నిలకడగా ఆడుతున్నట్లు కనిపించినా.. పేలవ షాట్‌తో వికెట్ చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరి ఔట్ తర్వాత భారత్ జట్టు వరుసగా వికెట్లు చేజార్చుకుంటూ వెళ్లింది.
ఫెయిలైన సెంచరీ హీరో
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (1: 9 బంతుల్లో) మిచెల్ శాంట్నర్ ఊరిస్తూ విసిరిన లో-పుల్ టాస్ బాల్‌కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే రిషబ్ పంత్ (18: 19 బంతుల్లో 2x4), తొలి టెస్టులో సెంచరీ హీరో సర్ఫరాజ్ ఖాన్ (11) వరుసగా ఔటైపోయి పెవిలియన్‌కి చేరిపోయారు. అలానే అశ్విన్ (4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా రవీంద్ర జడేజా (38: 46 బంతుల్లో 3x4, 2x6) కాసేపు నిలకడగా ఆడే ప్రయత్నం చేశాడు. అతనికి వాషింగ్టన్ సుందర్ (18 నాటౌట్: 21 బంతుల్లో 2x4, 1x6) నుంచి సపోర్ట్ లభించింది. కానీ.. కివీస్ బౌలర్లు మాత్రం క్రమశిక్షణతో బౌలింగ్ చేసి భారత్‌కి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. అక్షదీప్ (6), జస్‌ప్రీత్ బుమ్రా (0) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 7 వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ 2, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.
కివీస్ కంటే పేలవంగా
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో గురువారం 259 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో దేవాన్ కాన్వె (76), రచిన్ రవీంద్ర (65) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. కానీ భారత్ జట్టు మాత్రం 45.3 ఓవర్లలోనే 156 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటవడం గమనార్హం.