India squad vs NZ: భారత టెస్టు జట్టులోకి 3ఏళ్ల తర్వాత వాషింగ్టన్ సుందర్‌కు సడన్‌గా పిలుపు వెనుక మిస్టరీ, అశ్విన్‌పై డౌట్
Washington Sundar: బెంగళూరు టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిపోవడం ఆలస్యం.. జట్టులోకి వాషింగ్టన్ సుందర్‌ని చేరుస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అంత సడన్‌గా టీమ్‌లోకి ఈ పాతికేళ్ల ఆల్‌రౌండర్‌ను చేర్చడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
న్యూజిలాండ్ చేతిలో భారత్ జట్టు బెంగళూరు టెస్టులో ఓడిన గంటల వ్యవధిలోనే వాషింగ్టన్ సుందర్‌ని టెస్టు జట్టులోకి చేరుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో ఆశించిన మేర సత్తాచాటలేపోయిన టీమిండయా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో మూడు టెస్టుల సిరీస్‌లో 0-1తో భారత్ వెనుకబడగా.. రెండో టెస్టు మ్యాచ్ పుణె వేదికగా అక్టోబరు 24 (గురువారం) నుంచి ప్రారంభంకానుంది.
అశ్విన్‌పై అనుమానం
బెంగళూరు టెస్టులో అశ్విన్ మొత్తం 18 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఐదో రోజు ఆటలో అశ్విన్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి కేవలం ఫీల్డింగ్‌కి పరిమితమయ్యాడు. దాంతో అశ్విన్ ఫిట్ నెస్‌పై సందేహాలు మొదలయ్యాయి.
వాషింగ్టన్ సుందర్ ఎంపికపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఇలా సడన్‌గా సుందర్ భారత టెస్టు జట్టులోకి ఎందుకు వచ్చాడో తనకి అర్థం కావడం లేదంటూ యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చాడు. అశ్విన్ పూర్తి ఫిట్‌గా లేడా? గాయపడ్డాడా? ఈ ప్రశ్నలకి మాత్రం టీమిండియా మేనేజ్‌మెంట్ సమాధానం చెప్పడం లేదు.
భారత జట్టు ఏం ఆలోచిస్తోంది?
ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ ‘‘వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రావడం ఊహించని పరిణామం. అయితే ఇటీవల తమిళనాడు తరఫున సుందర్ సెంచరీ సాధించాడు. అలానే బౌలింగ్‌లోనూ మంచి లయతో ఉన్నాడు.
వాషింగ్టన్ సుందర్‌కి జట్టులో చోటివ్వడం ద్వారా మరో స్పిన్ ఆల్‌రౌండర్‌ని తుది జట్టులో ఆడించాలని భారత్ ఆశిస్తోందా? లేదా అశ్విన్ పూర్తి ఫిట్‌గా లేడా? ఆ కారణంగానే చివరి రోజు అశ్విన్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడా?’’ అని సందేహాల్ని వ్యక్తం చేశాడు. 25 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ చివరిసారిగా 2021 మార్చిలో భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు.
ముగ్గురిలో ఒకరు త్యాగం తప్పదా?
బెంగళూరు టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి రోహిత్ శర్మ తీసుకున్నాడు. కానీ.. ముగ్గురూ ఫెయిల్ అయ్యారు. దాంతో ఒకరిని తప్పించి వేరియేషన్ కోసం వాషింగ్టన్ సుందర్‌ని తీసుకోనున్నాడా? లేదా అశ్విన్ ఫిట్‌గా లేకపోవడంతో అతని స్థానంలో తుది జట్టులోకి తీసుకుంటాడా? అనే మిస్టరీ గురువారం ఉదయం 9 గంటలకి మ్యాచ్ టాస్ సమయంలో వీడనుంది.