IND vs NZ 1st Test Highlights: బెంగళూరు టెస్టులో టీమిండియా పరాజయం, భారత్ గడ్డపై 36 ఏళ్ల తర్వాత గెలిచిన న్యూజిలాండ్
IND vs NZ 1st Test Match Result: భారత్ జట్టుకి సొంతగడ్డపై టెస్టుల్లో చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరు వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టులో టీమిండియాపై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది.
న్యూజిలాండ్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టుకి పరాజయం తప్పలేదు. మ్యాచ్‌లో ఐదో రోజైన ఆదివారం 107 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ టీమ్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. 1988 తర్వాత భారత్ గడ్డపై తొలిసారి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది.
మ్యాచ్‌లో ఆఖరి రోజైన ఆదివారం టీమిండియా బౌలర్లు అద్భుతం చేస్తారని ఆశించిన అభిమానులకి నిరాశ తప్పలేదు. ఈరోజు తొలి టెస్టులో ఓడిన భారత్ మూడు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనకబడింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ పుణె వేదికగా అక్టోబరు 24 (గురువారం) నుంచి ప్రారంభంకానుంది.
బుమ్రా ఒక్కడే..
107 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ బౌలర్లకి ఈరోజు న్యూజిలాండ్ బ్యాటర్లు ఏమాత్రం పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఆరంభంలోనే ఆ జట్టు ఓపెనర్లు టామ్ లాథమ్ (0), దేవాన్ కాన్వె (17)లను జస్‌ప్రీత్ బుమ్రా పెవిలియన్ బాట పట్టించాడు. కానీ.. మిగిలిన బౌలర్ల నుంచి బుమ్రాకి సహకారం లభించలేదు.
విల్ యంగ్ (45 నాటౌట్: 76 బంతుల్లో 6x4, 1x6), రచిన్ రవీంద్ర (39 బ్యాటింగ్: 46 బంతుల్లో 6x4) గతి తప్పిన బంతుల్ని మాత్రమే బౌండరీకి తరలిస్తూ మిగిలిన బంతుల్ని జాగ్రత్తగా ఆడి న్యూజిలాండ్‌ను విజయతీరాలకి చేర్చారు. వికెట్లు పడకపోవడం, మరోవైపు టార్గెట్ కరిగిపోతుండటంతో భారత్ బౌలర్లలో అసహనం పెరిగిపోయింది. దాంతో నోబాల్స్ కూడా పడటం న్యూజిలాండ్‌కి కలిసొచ్చింది.
భారత్‌కి శాపంగా మారిన రోహిత్ తప్పిదం
బుధవారం ప్రారంభంకావాల్సిన ఈ టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా ఆరోజు స్టార్ట్ కాలేదు. గురువారం ఉదయం టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ అనాలోచితంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ మబ్బులు పట్టిన వాతావరణాన్ని అవకాశంగా మలుచుకున్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగి.. భారత్ జట్టుని తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూల్చారు. భారత్ జట్టులో ఐదుగురు బ్యాటర్లు డకౌటవగా.. ఏకంగా 9 మంది కనీసం డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయారు.
సర్ఫరాజ్ మెరిసినా.. చేతులెత్తేశారు
అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ టీమ్ 402 పరుగులు చేసింది. ఆ జట్టులో రచిన్ రవీంద్ర 134 పరుగులతో సత్తాచాటాడు. దాంతో భారత్ జట్టు 356 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ (150), రిషబ్ పంత్ (99) వీరోచితంగా బ్యాటింగ్ చేశారు.
కానీ.. మిడిల్, లోయర్ ఆర్డర్ చేతులెత్తేయడంతో ఒకానొక దశలో 408/3తో ఉన్న భారత్ జట్టు ఆఖరికి 462 పరుగులకే ఆలౌటైపోయింది. దాంతో న్యూజిలాండ్ ముందు కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే భారత్ నిలపగలిగింది. దాంతో ఆదివారం మూడు సెషన్ల టైమ్ ఉండటంతో తాపీగా లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించేసింది.
36 ఏళ్ల తర్వాత గెలుపు రుచి
1988లో ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో చివరిగా భారత్‌పై న్యూజిలాండ్ టీమ్ గెలిచింది. ఆ మ్యాచ్‌లో 136 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ ఈ 36 ఏళ్లలో దాదాపు 10కిపైగా భారత్ గడ్డపై టెస్టు సిరీస్‌లు ఆడింది. కానీ.. ఆదివారం వరకు కనీసం ఒక్క టెస్టులో కూడా గెలుపు రుచి చూడలేకపోయింది.