భారత కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో.. నాలుగో రోజైన శనివారం ఆఖరి సెషన్‌లో ఫీల్డ్ అంపైర్లతో మైదానంలోనే రోహిత్ శర్మ గొడవపడ్డాడు. రోహిత్ శర్మ, అంపైర్ల మధ్య వాగ్వాదం జరుగుతుండగానే మైదానం నుంచి న్యూజిలాండ్ ఓపెనర్లు సైలెంట్‌గా డ్రెస్సింగ్ రూముకి జారుకున్నారు.
ఈరోజు చివరి సెషన్‌లో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాంతో ఇప్పటికే 356 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న న్యూజిలాండ్ ముందు కేవలం 107 పరుగుల టార్గెట్ నిలిచింది. దాంతో లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ టీమ్ కనీసం ఓవర్ కూడా ఈరోజు ఆఖరి సెషన్‌లో ఆడలేదు.
తొలి ఓవర్‌ను జస్‌ప్రీత్ బుమ్రా వేయగా.. మొదటి నాలుగు బంతుల్ని ఎదుర్కొన్న న్యూజిలాండ్ ఓపెనర్/ కెప్టెన్ టామ్ లాథమ్ చాలా ఇబ్బంది పడుతూ కనిపించాడు. మూడో బంతికి ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయినట్లు కనిపించాడు. దాంతో భారత్ జట్టు కనీసం 2-3 ఓవర్లు వేసి ఒక వికెట్ అయినా పడగొట్టాలని ఆశించింది. కానీ.. వెలుతురు సరిగా లేకపోవడంతో అంపైర్లు మొదటి నాలుగు బంతుల్లోనే మ్యాచ్‌ను నిలిపివేశారు.
అంపైర్ల తీరుపై మండిపడిన కెప్టెన్ రోహిత్ శర్మ వాగ్వాదానికి దిగాడు. వెలుతురు సరిగానే ఉందంటూ ఆకాశం వైపు చూపిస్తూ.. అవసరమైతే స్పిన్నర్‌తో బౌలింగ్ చేయిస్తానంటూ అంపైర్లకి చెప్పాడు. కానీ అంపైర్లు కన్విన్స్ అవ్వలేదు. దాంతో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లందరూ అంపైర్ల చుట్టూ చేరి వాదనలు వినిపించారు. అదే సమయంలో న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్, దేవాన్ కాన్వె సైలెంట్‌గా డ్రెస్సింగ్ రూముకి వెళ్లిపోయారు.
న్యూజిలాండ్ ఓపెనర్లు అలా డ్రెస్సింగ్ రూముకి వెళ్లిపోవడం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కోపం మరింత పెంచింది. వెంటనే మళ్లీ వాళ్లని మైదానంలోకి పిలిపించాలని ఈ ఇద్దరూ డిమాండ్ చేస్తూ కనిపించారు. అయితే.. అదే సమయంలో వర్షం మొదలవడంతో భారత్ ఆటగాళ్లు కూడా మైదానం నుంచి పరుగెత్తుకుంటూడ్రెస్సింగ్ రూముకి వెళ్లిపోయారు.