Sarfaraz Khan Century: న్యూజిలాండ్‌పై శతకం బాదిన సర్ఫరాజ్ ఖాన్, బెంగళూరు టెస్టులో మళ్లీ గేమ్‌లోకి భారత్
IND vs NZ 1st Test Updates: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ బాదేశాడు. దాంతో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో భారత్ జట్టు పుంజుకుని మళ్లీ గేమ్‌లోకి వచ్చింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తిగా మారింది. మ్యాచ్‌లో నాలుగోరోజైన శనివారం 231/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (114 బ్యాటింగ్: 133 బంతుల్లో 14x4, 3x6) వీరోచిత శతకం బాదేశాడు. దాంతో టీమిండియా ప్రస్తుతం 302/3తో కొనసాగుతుండగా.. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు రిషబ్ పంత్ (24 బ్యాటింగ్: 35 బంతుల్లో 3x4, 1x6) క్రీజులో ఉన్నాడు.
లోటుని పూడ్చి.. టార్గెట్ సెట్?
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు 46 పరుగులకే ఆలౌటవగా.. న్యూజిలాండ్ టీమ్ 402 పరుగులు చేసింది. దాంతో 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ జట్టు ఇంకా 54 పరుగులు వెనకబడి ఉంది. వాస్తవానికి మ్యాచ్‌లో భారత్ జట్టుకి ఓటమి లాంఛనమేనని అంతా ఊహించారు. 356 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుని పూడ్చి న్యూజిలాండ్ ముందు లక్ష్యాన్ని నిలపడం అంత సులువు కాదని క్రికెట్ పండితులు కూడా తేల్చేశారు.
ఈరోజు మొత్తం ఆడగలిగితే
కానీ.. భారత్ జట్టు అద్భుతంగా పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విరాట్ కోహ్లీ (70), రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీలు బాదగా.. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ కూడా క్రీజులో ఉండగా.. ఇంకా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్ తదితరులు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. మొత్తంగా ఏడు వికెట్లు చేతిలో ఉన్న టీమిండియా శనివారం మూడు సెషన్లు పూర్తిగా బ్యాటింగ్ చేయగలిగితే.. న్యూజిలాండ్ ముందు మెరుగైన లక్ష్యం నిలిపే అవకాశం ఉంటుంది.
మ్యాచ్‌లో ఆఖరి రోజైన ఆదివారం స్పిన్నర్లకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి.. ఆటలో చివరి రోజు కుల్దీప్ యాదవ్, జడేజా, అశ్విన్ లాంటి స్పిన్నర్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించడం న్యూజిలాండ్ బ్యాటర్లకి అంత సులువు కాదు.
ఫలించిన సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణ
భారత్ జట్టులోకి ఈ ఏడాది మార్చిలో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్‌కి ఇది కెరీర్‌లో ఫస్ట్ ఇంటర్నేషనల్ టెస్టు సెంచరీ. ఇప్పటి వరకు 4 టెస్టులు ఆడిన ఈ 26 ఏళ్ల బ్యాటర్ 314 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
చాలా రోజుల నుంచి భారత్ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. ఎట్టకేలకు సెంచరీతో టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అది కూడా భారత్ జట్టు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీరోచిత శతకంతో ఆదుకున్నాడు. మెడనొప్పి కారణంగా శుభమన్ గిల్ ఈ మ్యాచ్‌కి దూరమవడంతో సర్ఫరాజ్ ఖాన్‌కి అవకాశం దక్కింది.