తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: రోహిత్ శర్మకు ఏమైంది.. నెట్ బౌలర్ చేతుల్లో క్లీన్ బౌల్డ్.. ఆ తర్వాతి బంతికే మళ్లీ..

Rohit Sharma: రోహిత్ శర్మకు ఏమైంది.. నెట్ బౌలర్ చేతుల్లో క్లీన్ బౌల్డ్.. ఆ తర్వాతి బంతికే మళ్లీ..

Hari Prasad S HT Telugu

14 February 2024, 10:19 IST

google News
    • Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ నెట్ బౌలర్ చేతుల్లో క్లీన్ బౌల్డయ్యాడు. తర్వాత బంతికే మళ్లీ ఔటయ్యాడు. అతన్ని నెట్స్ లో చూసిన వాళ్లు అసలు రోహిత్ కు ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు.
నెట్ బౌలర్ చేతుల్లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు
నెట్ బౌలర్ చేతుల్లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు (AFP)

నెట్ బౌలర్ చేతుల్లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు

Rohit Sharma: ఇంగ్లండ్ తో మూడో టెస్టు కోసం సిద్ధమవుతున్న టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మే పెద్ద దిక్కు. ముఖ్యంగా బ్యాటింగ్ లో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్లు ఆడటం లేదు. దీంతో ఆ భారమంతా అతడే మోయాలి. ఇలాంటి సమయంలో రోహిత్ నెట్ ప్రాక్టీస్ సమయంలో ఓ నెట్ బౌలర్ వేసిన ఇన్‌స్వింగర్ కు క్లీన్ బౌల్డ్ కావడం ఆందోళన కలిగిస్తోంది.

రోహిత్ శర్మకు ఏమైంది?

గతేడాది వరల్డ్ కప్ లో దూకుడుగా ఆడుతూ ఇండియన్ టీమ్ బ్యాటింగ్ లైనప్ లో ఆత్మస్థైర్యాన్ని నింపిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో మాత్రం బ్యాటింగ్ మరచిపోయినట్లే ఆడుతున్నాడు. తొలి రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్ లో అతడు కేవలం 24, 39, 14, 13 స్కోర్లే చేశాడు. మూడో టెస్టుకు రోహిత్ ను వదిలేస్తే మిగతా బ్యాటింగ్ లైనప్ మొత్తం అనుభవం కలిపితే కేవలం 29 టెస్టులు.

అందుకే శుభ్‌మన్ గిల్ ఆడినవే 22. మరో ఆరు యశస్వి జైస్వాల్ ఆడాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి రానున్నారు. రజత్ ఒకే ఒక్క టెస్టు ఆడగా.. సర్ఫరాజ్ తన అరంగేట్రం కోసం చూస్తున్నాడు. ఇప్పటికే కాస్త టీమ్ లో నిలదొక్కుకున్నట్లు కనిపించిన వికెట్ కీపర కేఎస్ భరత్ ను పక్కన పెట్టి ధృవ్ జురెల్ ను తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతో మరో కొత్త ప్లేయర్ మిడిలార్డర్ లో ఉన్నట్లే.

ఈ నేపథ్యంలో ఓపెనర్, కెప్టెన్ అయిన రోహిత్ పైనే టీమ్ భారం వేసింది. ఇలాంటి సమయంలో అతడు ఓ నెట్ బౌలర్ చేతుల్లో వరుసగా రెండు బంతుల్లో రెండుసార్లు ఔట్ కావడం కచ్చితంగా ఆందోళన కలిగించేదే. ఇప్పటికే ఈ సిరీస్ లో ఇంగ్లండ్ స్పిన్నర్లు ఊహించినదాని కంటే ఎక్కువే రాణిస్తున్న వేళ అనుభవం లేని టీమ్ లో తన బ్యాటింగ్ తో రోహిత్ ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యువ ప్లేయర్స్‌కు రోహిత్ కోచింగ్

గురువారం (ఫిబ్రవరి 15) నుంచి ఇంగ్లండ్ తో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీమ్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ సందర్భంగా కెప్టెన్, సీనియర్ మోస్ట్ ప్లేయర్ గా జట్టులోని యువ ప్లేయర్స్ కు నెట్స్ లో రోహిత్ శర్మే కోచింగ్ ఇవ్వడం గమనార్హం. ప్రతి ప్లేయర్ దగ్గరకు వెళ్లి, ప్రత్యేకంగా మాట్లాడుతూ వాళ్లకు బ్యాటింగ్ టిప్స్ ఇస్తూ కనిపించాడు.

కానీ తీరా తన బ్యాటింగ్ ప్రాక్టీస్ దగ్గరకు వచ్చే సరికి ఓ నెట్ బౌలర్ చేతుల్లో అతని మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. ఇన్ స్వింగర్ తో ఆ బౌలర్ రోహిత్ ను బోల్తా కొట్టించాడు. తర్వాతి బంతికి ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతి ఎడ్జ్ తీసుకుంది. దీంతో రెండు వరుస బంతుల్లో రోహిత్ ఔటైనట్లే. నెట్ ప్రాక్టీసే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు.

బహుషా టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో ఉన్న బలహీనతను చూసే ఇంగ్లండ్ మాజీ ప్లేయర్స్ మూడో టెస్టులో తమ టీమ్ గెలుపు ఖాయమన్న అంచనాకు వచ్చేశారు. రెండో టెస్టులో ఓడినా కూడా వాళ్లు అంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి ఇండియన్ టీమ్ మిడిలార్డరే కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్, యశస్వి, గిల్ కీలకంగా మారారు. టాప్ లో వాళ్లు రాణిస్తేనే మిడిలార్డర్ లోని యువ ప్లేయర్స్ కాస్త స్ఫూర్తి పొందుతారు.

తదుపరి వ్యాసం