Yashasvi Jaiswal: డబుల్ సెంచరీ తర్వాత సచిన్‍తో మాట్లాడిన యశస్వి.. ఏ సలహా ఇచ్చారంటే..-yashasvi jaiswal talks with sachin tendulkar after double century in india vs england 2nd test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Yashasvi Jaiswal: డబుల్ సెంచరీ తర్వాత సచిన్‍తో మాట్లాడిన యశస్వి.. ఏ సలహా ఇచ్చారంటే..

Yashasvi Jaiswal: డబుల్ సెంచరీ తర్వాత సచిన్‍తో మాట్లాడిన యశస్వి.. ఏ సలహా ఇచ్చారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 05, 2024 09:06 PM IST

Yashasvi Jaiswal - Sachin Tendulkar: భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఇంగ్లండ్‍తో రెండో టెస్టులో ఈ ద్విశకతం చేశాడు. అయితే, డబుల్ సెంచరీ తర్వాత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడానని యశస్వి చెప్పాడు.

Yashasvi Jaiswal: డబుల్ సెంచరీ తర్వాత సచిన్‍తో మాట్లాడిన యశస్వి
Yashasvi Jaiswal: డబుల్ సెంచరీ తర్వాత సచిన్‍తో మాట్లాడిన యశస్వి (PTI)

Yashasvi Jaiswal: ఇంగ్లండ్‍తో రెండో రెండో టెస్టులో భారత్ భారీ విజయం సాధించింది. విశాఖపట్టణంలో జరిగిన ఈ మ్యాచ్‍లో నేడు (జనవరి 5) టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లిష్ జట్టుపై గెలిచింది. అయితే, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (209 పరుగులు) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. భారత గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తన ఆరో టెస్టులోనే ద్విశతకంతో దుమ్మురేపాడు. డబుల్ సెంచరీ చేశాక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో తాను మాట్లాడానని యశస్వి జైస్వాల్ నేడు వెల్లడించాడు.

ద్విశకతం చేశాక సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడానని రెండో టెస్టు ముగిశాక యశస్వి చెప్పాడు. ఆయన ఏం చెప్పారో కూడా పేర్కొన్నాడు. నిలకడగా రాణించడం ముఖ్యమని తనకు సచిన్ సలహా ఇచ్చారని తెలిపాడు.

“నేను సచిన్ టెండూల్కర్‌తో కూడా మాట్లాడా. నన్ను ఆయన అభినందించారు. ఇప్పుడు చేస్తున్నట్టుగానే కష్టపడుతూనే ఉండాలని సూచించారు. ఇది నాకు చాలా కీలకమైన సమయమని, నిలకడగా ఆడడం ముఖ్యమని చెప్పారు. మీ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. నేను ఎప్పుడూ ఆయనను ఆరాధిస్తా” అని యశస్వి జైస్వాల్ వెల్లడించాడు.

యశస్వి డబుల్ సెంచరీ చేసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా కూడా సచిన్ అతడిని అభినందించారు. “అదరగొట్టావ్ యశస్వి. అద్భుతమైన ఎఫర్ట్” అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

అదరగొట్టిన జైస్వాల్

ఈ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 290 పరుగుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లతో 209 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‍తో తన తొలి డబుల్ సెంచరీ చేశాడు. టెస్టు ద్విశతకం చేసిన మూడో పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. యశస్వి డబుల్ సెంచరీ చేయడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు చేసింది. జైస్వాల్ ఒక్కడే 209 రన్స్ చేయగా.. మిగిలిన బ్యాటర్లందరూ కలిసి 187 పరుగులే చేశారు.

భారత స్టార్ జస్‍ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లతో సత్తాచాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 253 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 143 పరుగుల ఆధిక్యం దక్కింది. ఈ ఆధిక్యానికి యశస్వి డబుల్ సెంచరీ ప్రధాన కారణంగా నిలిచింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత యువ స్టార్ శుభ్‍మన్ గిల్ (104) సెంచరీ దుమ్మురేపాడు. దీంతో భారత్ 255 రన్స్ చేసింది. ఆ తర్వాత 399 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ మ్యాచ్ నాలుగో రోజైన నేడు 292 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ గెలిచింది.

ఐదు టెస్టుల సిరీస్‍లో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‍లో ఇంగ్లండ్ చేతిలో భారత్ అనూహ్యంగా ఓటమి పాలైంది. దీంతో విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ రెండో మ్యాచ్ కీలకంగా మారింది. ఈ రెండో టెస్టులో యశస్వి జైస్వాల్, జస్‍ప్రీత్ బుమ్రా (9 వికెట్లు), శుభ్‍మన్ గిల్ రాణించటంతో టీమిండియాకు విజయం దక్కింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు రాజ్‍కోట్ వేదికగా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి జరగనుంది.

సెలెక్షన్‍పై కసరత్తు

ఈ సిరీస్‍లో తదుపరి మూడు టెస్టులకు జట్టును భారత సెలెక్టర్లు ఎంపిక చేయాల్సి ఉంది. ఈ విషయంపై రెండో టెస్టు ముగిశాక కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‍తో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడారు. తదుపరి మూడు టెస్టులకు జట్టు సెలెక్టర్లు రేపు (ఫిబ్రవరి 6) ప్రకటిస్తారనే అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం