World Cup 2023: వరల్డ్ కప్ సరికొత్త రికార్డు.. అత్యధిక మంది చూసిన టోర్నీ ఇదే
World Cup 2023: వరల్డ్ కప్ 2023 సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మంది చూసిన టోర్నీగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీని స్టేడియాల్లో ఎంత మంది చూశారో తెలుసా?
World Cup 2023: వరల్డ్ కప్ 2023లో ఎంతో మంది ప్లేయర్స్ ఎన్నో రికార్డులు బ్రేక్ చేశారు. అయితే అసలు ఈ వరల్డ్ కప్ టోర్నీయే సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఇండియా ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీ అత్యధిక మంది చూసిన ఐసీసీ వరల్డ్ కప్ గా నిలవడం విశేషం. ఈ విషయాన్ని మంగళవారం (నవంబర్ 21) ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
వరల్డ్ కప్ 2023ను ఏకంగా 12.5 లక్షల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా స్టేడియాల్లో చూసినట్లు ఐసీసీ తెలిపింది. వన్డే మ్యాచ్ లకు ఆదరణ తగ్గిపోతుందని భావిస్తున్న తరుణంలో ఈ మెగా టోర్నీకి ఈ స్థాయిలో ప్రేక్షకులు తరలి రావడం విశేషమే. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ నే లక్ష మంది వరకూ చూశారు.
ఇండియాలో ఈ టోర్నీ జరగడం, అందులోనూ దేశవ్యాప్తంగా 9 వేదికల్లో మన టీమ్ మ్యాచ్ లు ఆడటం ఈ భారీ రికార్డుకు కారణమైంది. ఇండియా మ్యాచ్ లు ఆడిన ప్రతి చోటా స్టేడియాలు పూర్తిగా నిండాయి. అహ్మదాబాద్ లో రెండుసార్లు జరగగా.. రెండు మ్యాచ్ లనూ సుమారు లక్ష మంది వరకూ చూశారు. ఇక ముంబై, బెంగళూరు, కోల్‌కతా, లక్నో, పుణె, ధర్మశాల, చెన్నై, ఢిల్లీల్లోనూ ఇండియా మ్యాచ్ లు ఆడింది.
టీమిండియా వెళ్లిన ప్రతి చోటా వేల మంది ప్రేక్షకులు స్టేడియాలకు తరలి వచ్చారు. దీంతో ఈ వరల్డ్ కప్ ను మొత్తం 12,50,307 మంది ప్రేక్షకులు చూసినట్లు ఐసీసీ లెక్క తేల్చింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ 45 రోజుల పాటు సాగిన ఈ మెగా టోర్నీ ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఇంతకుముందు 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరిగిన టోర్నీని 10,16,420 మంది చూశారు.
2019లో ఈ సంఖ్య పడిపోయింది. ఇంగ్లండ్ లో జరిగిన ఈ టోర్నీని కేవలం 7.52 లక్షల మందే చూశారు. ఇప్పటికే బ్రాడ్‌కాస్ట్, డిజిటల్ రికార్డులను కూడా వరల్డ్ కప్ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. స్టార్ స్పోర్ట్స్ లో ఇండియా, న్యూజిలాండ్ లీగ్ మ్యాచ్ ను ఒకే సమయంలో 4.3 కోట్ల మంది చూడగా.. ఇక ఫైనల్ ను హాట్‌స్టార్ లో ఒకే సమయంలో 5.8 కోట్ల మంది చూసి కొత్త రికార్డులు క్రియేట్ చేశారు.