England in Rajkot: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. ఈసారి ఫీల్డ్ బయట రికార్డు
England in Rajkot: బెన్ స్టోక్స్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ఈసారి ఇండియాలో ఫీల్డ్ బయట చరిత్ర సృష్టించింది. మూడో టెస్టు జరగనున్న రాజ్‌కోట్ లో తమ చార్టెర్డ్ ఫ్లైట్ లో నేరుగా ల్యాండవడంతో గతంలో ఎన్నడూ జరగని ఓ సందర్భం సాధ్యమైంది.
England in Rajkot: టీమిండియాతో మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ టీమ్ రాజ్‌కోట్ చేరుకుంది. రెండో టెస్టులో ఓటమి తర్వాత పది రోజుల పాటు అబుధాబిలో వెకేషన్ ఎంజాయ్ చేసిన ఆ టీమ్.. అక్కడి నుంచి నేరుగా తమ చార్టెర్డ్ ఫ్లైట్ లో రాజ్‌కోట్ లోనే ల్యాండైంది. గతంలో ఏ అంతర్జాతీయ విమానం ఇక్కడ నేరుగా దిగలేదు. ఇంగ్లండ్ టీమ్ కోసం అప్పటికప్పుడు ప్రత్యేకంగా తాత్కాలిక ఇమ్మిగ్రేషన్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.
ఇంగ్లండ్ చరిత్ర.. రేహాన్‌కు అడ్డంకులు
ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ నిజానికి ముంబై లేదా అహ్మదాబాద్ లో దిగి అక్కడి నుంచి మరో విమానంలో రాజ్‌కోట్ చేరాల్సి ఉంది. కానీ ఆ టీమ్ మాత్రం నేరుగా రాజ్‌కోట్ లోని హిరాసర్ ఎయిర్‌పోర్టులో దిగుతామని స్పష్టం చేసింది. దీంతో అప్పటికప్పుడు అక్కడ ఇమ్మిగ్రేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఇంగ్లండ్ ప్లేయర్ రేహాన్ అహ్మద్ కు అడ్డంకులు ఎదురయ్యాయి.
అతడు తప్పుడు వీసాతో ప్రయాణిస్తుండటమే దీనికి కారణం. ఇండియాకు అతడు సింగిల్ ఎంట్రీ వీసాతో వచ్చాడు. అలాంటి వీసాతో దేశం నుంచి బయటకు వెళ్లి మళ్లీ ఇండియాలోకి అడుగు పెట్టడం కుదరదు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు రేహాన్ అహ్మద్ ను అడ్డుకున్నారు. మొత్తం 31 మంది సభ్యుల ఇంగ్లండ్ టీమ్ లో రేహాన్ కు మాత్రమే ఇలా వీసా చిక్కులు ఎదురయ్యాయి.
అయితే వెంటనే జోక్యం చేసుకున్న బీసీసీఐ, ఈసీబీ తాత్కాలిక వీసాతో సమస్యకు తెరదించాయి. దీంతో రేహాన్ మిగతా టీమ్ తో కలిసి ప్రాక్టీస్ చేయనున్నాడు. నిజానికి సిరీస్ ప్రారంభానికి ముందు కూడా మరో ఇంగ్లండ్ ప్లేయర్ షోయబ్ బషీర్ కు ఇలాగే వీసా సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మిగతా టీమ్ తో కలిసి ఇండియా రాలేకపోయిన అతడు.. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్ట్ ఆడలేదు.
అబుధాబిలో వెకేషన్
విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వాళ్లు క్రికెట్ కు కాస్త బ్రేక్ ఇచ్చి అబుధాబి వెళ్లారు. అక్కడ ప్రాక్టీస్ పక్కన పెట్టి పది రోజుల పాటు ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి సోమవారం (ఫిబ్రవరి 12) నేరుగా రాజ్‌కోట్ లో ల్యాండయ్యారు. ఓ అంతర్జాతీయ విమానంలో ఇక్కడ ల్యాండవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మంగళవారం (ఫిబ్రవరి 13) ఇండియా, ఇంగ్లండ్ టీమ్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నాయి. గురువారం (ఫిబ్రవరి 15) మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇండియన్ టీమ్ ప్రాక్టీస్ చేస్తాయి. ఈ మూడో టెస్టుకు విరాట్ కోహ్లితోపాటు కేఎల్ రాహుల్ సేవలను కూడా ఇండియా కోల్పోయింది.
దీంతో భారత బ్యాటింగ్ లైనప్ మరింత బలహీన పడింది. మిడిలార్డర్ లో అనుభవం లేని ప్లేయర్స్ ఉండటంతో బ్యాటింగ్ భారమంతా రోహిత్, యశస్వి, గిల్ లపైనే పడనుంది. గత మ్యాచ్ లో రజత్ పటీదార్ టెస్టు అరంగేట్రం చేయగా.. ఈసారి సర్ఫరాజ్ ఖాన్ కు కూడా అవకాశం దక్కనుంది.