KL Rahul: మూడో టెస్టుకు కేఎల్ రాహుల్ ఔట్! అతడి స్థానంలో యువ బ్యాటర్
IND vs ENG Test Series - KL Rahul: ఇంగ్లండ్‍తో మూడో టెస్టుకు భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమవడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. అతడి స్థానంలో జట్టులోకి యువ ఆటగాడు రానున్నాడు.
India vs England Test Series: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కీలక దశలో ఉంది. ఇరు జట్లు చెరొకటి గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. హైదరాబాద్‍లో జరిగిన తొలి మ్యాచ్‍లో ఇంగ్లండ్ అనూహ్యంగా గెలిస్తే.. విశాఖపట్నంలో సత్తాచాటి విజయం సాధించింది టీమిండియా. ఇరు జట్ల మధ్య మూడు టెస్టు రాజ్‍కోట్ వేదికగా ఫిబ్రవరి 15వ తేదీన మొదలుకానుంది. ఈ కీలకమైన మూడో టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. మూడో టెస్టుకు దూరమయ్యాడని తెలుస్తోంది.
ఇంగ్లండ్‍తో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ రాణించాడు. అయితే గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ సిరీస్‍లో తదుపరి మూడు టెస్టులకు జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. కేఎల్ రాహుల్‍ను కూడా జట్టులో చేర్చింది. అయితే, ఫిట్‍నెస్ క్లియరెన్స్ వస్తేనే అతడు మూడో టెస్టు ఆడతాడని వెల్లడించింది. అయితే, కుడి తొడ కండరాల నొప్పి నుంచి రాహుల్ ఇంకా కోలుకోలేదని, మరో వారం పరిశీలనలో ఉంచాలని భారత జట్టు మెడికల్ టీమ్ నిర్ణయించింది.
దీంతో, ఇంగ్లండ్‍తో మూడో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరమవడం ఖాయంగా మారింది. వ్యక్తిగత కారణాల వల్ల భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఫామ్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్‌ను మూడు టెస్టుల నుంచి సెలెక్టర్లు తప్పించారు. ఈ తరుణంలో కేఎల్ రాహుల్ కోలుకోకపోవడం టీమిండియాకు ఇబ్బందికరంగా మారింది.
రిప్లేస్‍మెంట్ ఎవరంటే..
ఇంగ్లండ్‍తో మూడో టెస్టుకు కేఎల్ రాహుల్ ఔట్ అవడంతో.. ఆ స్థానంలో కర్ణాటక యువ స్టార్ దేవ్‍దత్ పడిక్కల్ టీమిండియాలోకి రానున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‍లో పడిక్కల్ అదరగొడుతున్నాడు. పంజాబ్‍తో జరిగిన మ్యాచ్‍లో 193 పరుగులతో సెంచరీ చేశాడు. గోవాతో జరిగిన మ్యాచ్‍లోనూ సెంచరీతో దుమ్మురేపాడు. మరో శతకం కూడా బాదాడు. ఇండియా-ఏ తరఫున కూడా ఇటీవలే ఓ సెంచరీ చేశాడు. దీంతో ఫుల్ ఫామ్‍లో ఉన్న పడిక్కల్‍కే సెలెక్టర్లు మొగ్గుచూపారు. తొలిసారి అతడికి భారత టెస్టులోకి వస్తున్నాడు. అయితే, తుది జట్టులో చోటు దక్కడం కష్టమే.
ఐపీఎల్‍లో కేఎల్ రాహుల్ కెప్టెన్‍గా ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఈ ఏడాది సీజన్‍లో ఆడనున్నాడు దేవ్‍దత్ పడిక్కల్. రాజస్థాన్ రాయల్స్ అతడిని 2024 సీజన్ కోసం లక్నోకు ట్రేడ్ చేసింది.
ప్రాక్టీస్ మొదలెట్టిన జడేజా
గాయంతో ఇంగ్లండ్‍తో రెండో టెస్టుకు భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా దూరమయ్యాడు. అయితే, మూడో టెస్టుకు అతడిని కూడా బీసీసీఐ సెలెక్ట్ చేసింది. ఈ తరుణంలో జడేజా విషయంలో టీమిండియాకు గుడ్‍న్యూసే వచ్చింది. రాజ్‍కోట్‍లో జడేజా ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. నెట్స్‌లో చెమటోడ్చాడు. దీంతో మూడో మ్యాచ్‍లో అతడు ఆడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రాజ్‍కోట్‍లోని ఎస్‍సీఏఎస్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే టీమిండియా రాజ్‍కోట్‍కు చేరుకుంది.