IPL 2024: ఈ ఏడాది ఐపీఎల్ వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: బీసీసీఐ ఉపాధ్యక్షుడు-ipl 2024 venue not decided yet says bcci vice president rajiv shukla ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024: ఈ ఏడాది ఐపీఎల్ వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

IPL 2024: ఈ ఏడాది ఐపీఎల్ వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 20, 2024 08:26 PM IST

IPL 2024: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‍ గురించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక కామెంట్ చేశారు. ఈ ఏడాది సీజన్ నిర్వహణ వేదిక గురించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

ఐపీఎల్ ట్రోఫీ (Photo: IPL)
ఐపీఎల్ ట్రోఫీ (Photo: IPL)

IPL 2024: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ నిర్వహణపై కాస్త సందిగ్ధత ఉంది. ఈ ఏడాది దేశంలో లోక్‍సభ ఎన్నికలు జరగనుండటంతో ఐపీఎల్‍ను బీసీసీఐ స్వదేశంలోనే నిర్వహిస్తుందా.. వేరే దేశానికి వేదికను మారుస్తుందా అనే విషయం ఇంకా ఖరారు కాలేదు. అయితే, ఎన్నికలు ఉన్నా భారత్‍లోనే ఈ ఏడాది ఐపీఎల్‍ను నిర్వహించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని సమాచారం బయటికి వచ్చింది. అయితే, ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.

ఐపీఎల్ 2024 వేదిక గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాజీవ్ శుక్లా చెప్పినట్టు ఇన్‍సైడ్ స్టోర్ట్స్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని, ఇంకా చర్చలు జరుగతున్నాయని అన్నట్టు పేర్కొంది.

“ఐపీఎల్‍ వేదికను మార్చాలా వద్దా అనే విషయంపై భారత ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖలతో చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చల తర్వాతే ఓ నిర్ణయం వస్తుంది” అని చిట్‍చాట్‍లో రాజీవ్ శుక్లా చెప్పినట్టు ఇన్‍సైడ్ స్పోర్ట్స్ పేర్కొంది.

అయితే, మహిళల టీ20 లీగ్ ‘డబ్ల్యూపీఎల్’ ఇండియాలో నిర్వహించాలని డిసైడ్ అయినట్టు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఢిల్లీ, బెంగళూరు వేదికలుగా డబ్ల్యూపీఎల్ జరుగుతుందని అన్నారు.

ఐపీఎల్ 2024 సీజన్‍ను మార్చి 22వ తేదీన ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే, లోక్‍సభ ఎన్నికల షెడ్యూల్‍ను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ వెల్లడించాక ఈ విషయంపై స్పష్టత రానుంది.

లోక్‍సభ ఎన్నికల వల్ల 2009 ఐపీఎల్ సీజన్‍ను దక్షిణాఫ్రికాలో నిర్వహించింది బీసీసీఐ. అయితే, 2014, 2019లో ఎన్నికలు ఉన్నా.. భారత్‍లోనే ఐపీఎల్‍ను జరిపింది. మరి.. ఇప్పుడు 2024లో ఐపీఎల్‍ను స్వదేశంలోనే నిర్వహిస్తుందా.. లేదా వేరే దేశానికి తరలిస్తుందా అనేది వేచిచూడాలి.

ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ టీమిండియాకు కూడా కీలకంగా ఉండనుంది. ఐపీఎల్‍లో ఫామ్‍ను పరిగణనలోకి తీసుకొని ఆటగాళ్లను భారత జట్టుకు ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది.

మరో ఐదేళ్లు టాటానే

ఐపీఎల్‍కు మరో ఐదేళ్ల టాటా సంస్థనే టైటిల్ స్పానర్‌గా ఉండనుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. 2024 నుంచి 2028 వరకు ఈ డీల్‍ కొనసాగనుంది. టైటిల్ స్పాన్సర్షిప్‍కు గాను ఒక్కో ఏడాదికి బీసీసీఐకి టాటా సంస్థ రూ.500 చెల్లించనుంది. అంటే ఐదేళ్లకు మొత్తంగా రూ.2,500కోట్లను బీసీసీఐకి టాటా అందించనుంది.

గత 2022, 2023 ఐపీఎల్ సీజన్ల కోసం టాటా సంస్థ.. బీసీసీఐకి రూ.670 కోట్లను చెల్లించింది. ఇప్పుడు మరో ఐదు సంవత్సరాలకు రూ.500కోట్ల చొప్పున చెల్లించేందుకు డీల్ చేసుకుంది. 2024 ఐపీఎల్ సీజన్‍లో 74 మ్యాచ్‍లు జరగనున్నాయి. 2025 సీజన్‍లో 84, 2026, 2027 సీజన్లలో ఆ సంఖ్యను 94 మ్యాచ్‍లకు పెంచాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే టైటిల్ స్పాన్సర్‌షిప్‍ హక్కుల ధర కూడా పెరిగింది. ఏబీజీ గ్రూప్ కూడా పోటీ పడినా.. చివరికి మళ్లీ ఐపీఎల్ టైటిల్ స్పానర్‌షిప్‍ను టాటా సంస్థే చేజిక్కించుకుంది.

Whats_app_banner