IPL 2025 Auction: కేఎల్ రాహుల్‌కి షాకిచ్చేందుకు రెడీ అవుతున్నలక్నో ఫ్రాంఛైజీ, డేటా విశ్లేషణలో దొరికిపోయిన భారత క్రికెటర్
23 October 2024, 12:05 IST
KL Rahul Released By Lucknow Super Giants: కేెల్ రాహుల్‌ని గత కొంతకాలంగా దురదృష్టం వెంటాడుతోంది. పేలవ ఫామ్‌తో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ఈ బ్యాటర్‌ని లక్నో ఫ్రాంఛైజీ వేలానికి వదిలేయనుందట.
కేఎల్ రాహుల్
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు టీమిండియా సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌కి ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. పేలవ ఫామ్‌తో ఇప్పటికే భారత్ టెస్టు జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్న కేఎల్ రాహుల్‌ని ఐపీఎల్ 2025 సీజన్ కోసం రిటెన్ చేసుకోకూడదని లక్నో ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు వార్త వెలుగులోకి వచ్చింది.
లక్నోకి భారంగా మారిన రాహుల్
ఐపీఎల్ 2022 నుంచి లక్నోకి కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు. అయితే.. గత కొన్ని నెలల నుంచి రాహుల్ బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడు. దానికి తోడు ఐపీఎల్‌లోనూ అతని స్ట్రైక్‌రేట్ ఆశాజనకంగా లేదు. దాంతో ఐపీఎల్ లాంటి టోర్నీలో రాహుల్ జట్టుకి భారమవుతున్నాడని లక్నో ఫ్రాంఛైజీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అతడ్ని వేలంలోకి వదిలేయాలని భావిస్తోంది.
భారత్ జట్టులోకి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌తో పాటు రవి బిష్ణోయ్, నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ రిటెన్ చేసుకునే అవకాశం ఉంది. వీరితో పాటు ఆయుష్ బదోనీ, మోహ్సిన్ ఖాన్‌ని రిటెన్ చేసుకోవడం గురించి కూడా ఫ్రాంఛైజీ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేలంలో ఒకవేళ కేఎల్ రాహుల్ తక్కువ ధరకి లేదా అందుబాటు ధరకి దక్కే ఛాన్స్ ఉంటే రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డుని వాడాలని లక్నో ఫ్రాంఛైజీ యోచిస్తోందట.
డేటాలో దొరికిపోయిన రాహుల్
లక్నో సూపర్ జెయింట్స్ కొత్త మెంటార్ జహీర్ ఖాన్, కోచ్ జస్టిన్ లాంగర్‌తో ఇప్పటికే చర్చించిన లక్నో ఫ్రాంఛైజీ ఆటగాళ్ల డేటాను విశ్లేషించి.. రిటెన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాని ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేఎల్ ఎక్కువసేపు బ్యాటింగ్ చేసిన దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ లక్నో టీమ్ ఓడిపోయినట్లు గుర్తించారు. దాంతో రాహుల్ స్ట్రైక్ రేట్ టీమ్‌కి ఉపయోగపడటం లేదని నిర్ధారించుకుని.. వేలంలోకి వదిలేయాలని నిర్ణయించారట.
వాస్తవానికి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో ఐపీఎల్ వేగం మరింత పుంజుకుంది. టోర్నీలో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. దాంతో నెమ్మదిగా బ్యాటింగ్ చేసేవారిని ఫ్రాంఛైజీలు ఉపేక్షించడం లేదు. ఒకవేళ కేఎల్ రాహుల్ వేలానికి వస్తే అతని కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ గట్టిగా పోటీపడే అవకాశం ఉంది. గతంలో ఆర్సీబీకే రాహుల్ ఆడాడు.
ఐపీఎల్ 2024లో లక్నో ఫెయిల్
2013 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు 132 మ్యాచ్‌లాడి 4,683 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2024 సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 7 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. పాయింట్ల పట్టికలోనూ ఏడో స్థానంలో నిలిచింది.