IND vs NZ 2nd Test: టీమిండియాలో తెలుగు క్రికెటర్‌పై వేలాడుతున్న వేటు కత్తి, న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకి ఊహించని మార్పు
22 October 2024, 6:04 IST
Mohammed Siraj: పుణె వేదికగా అక్టోబరు 24 (గురువారం) నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి టెస్టులో ఓడిన నేపథ్యంలో రెండో టెస్టుకి టీమిండియా మేనేజ్‌మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకోబోతోంది.
మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో పేలవంగా ఓడిపోయిన భారత్ జట్టు రెండో టెస్టుకి తుది జట్టులో మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్‌లో విఫలమైనా.. టీమిండియా పుంజుకుంది. కానీ.. బౌలింగ్‌లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయింది. దానికి కారణం మహ్మద్ సిరాజ్ వైఫల్యమేనని టీమిండియా మేనేజ్‌మెంట్ నమ్ముతోంది. కొత్త బంతితో జస్‌ప్రీత్ బుమ్రా వికెట్లు తీస్తున్న వేళ.. మహ్మద్ సిరాజ్ తేలిపోయాడు.
సుందర్ వచ్చేశాడు
భారత్, న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 24 నుంచి రెండో టెస్టు మ్యాచ్ పుణె వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం జట్టులోకి ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ని అదనంగా తీసుకున్న టీమిండియా మేనేజ్‌మెంట్.. ఎవరెవరిపై వేటు వేయాలో ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మొదటగా వినిపిస్తున్న పేరు మహ్మద్ సిరాజ్. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు.. డీఎస్పీగా హైదరాబాద్‌లో సిరాజ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
విదేశాల్లో హిట్, భారత్‌లో ప్లాప్
వాస్తవానికి టెస్టుల్లో సిరాజ్‌కి మెరుగైన రికార్డ్ ఉంది. కానీ.. భారత్ గడ్డపై లేదు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఇప్పటి వరకు 17 టెస్టు మ్యాచ్‌లాడిన మహ్మద్ సిరాజ్ 61 వికెట్లు పడగొట్టాడు. కానీ.. భారత్ గడ్డపై ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో తీసిన వికెట్లు 19 మాత్రమే. మొన్న ముగిసిన బెంగళూరు టెస్టులో కివీస్ ఇద్దరు పేసర్లు కలిపి 10 వికెట్లు తీస్తే.. సిరాజ్ తీసిన వికెట్లు రెండు మాత్రమే.
బౌలింగ్‌లో మిస్టేక్స్
భారత్ పిచ్‌లపై టెస్టుల్లో సిరాజ్ వికెట్లు తీయలేకపోతున్నాడని ఈ గణాంకాలే చెప్తున్నాయి. బుమ్రా, షమీలకు ఎలాంటి పిచ్, పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సత్తా ఉంది. కానీ సిరాజ్‌కి అది లోపించింది. సిరాజ్ బౌలింగ్‌లో సాంకేతిక లోపాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
టెస్టుల్లో బ్యాటర్‌కి సిరాజ్ విసురుతున్న లెంగ్త్ బాల్స్ విదేశాల్లో వికెట్లు ఇస్తున్నా.. నెమ్మదిగా ఉండే భారత్ పిచ్‌లపై సులభంగా అర్థమైపోయి బ్యాటర్లు ఆడేస్తున్నారని మాజీలు చెప్పుకొస్తున్నారు. తక్కువ బౌన్స్ ఉండే భారత్ పిచ్‌లపై లెంగ్త్ బాల్స్ ఎడ్జ్ తీసుకోవడం కష్టం.. అందుకే సిరాజ్‌కి వికెట్లు పడటం లేదని వాళ్లు చెప్తున్నారు.
గిల్ ఫిట్.. రాహుల్‌కి టెన్షన్
మహ్మద్ సిరాజ్‌ను పుణె జట్టు నుంచి తప్పిస్తే అతని స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్‌కి ఛాన్స్ రావొచ్చు. ఇప్పటి వరకు మూడు టెస్టులు ఆడిన ఆకాశ్ 8 వికెట్లు సాధించాడు. దాంతో పుణె టెస్టులో సిరాజ్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. అలానే రిషబ్ పంత్ గాయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. మరోవైపు శుభమన్ గిల్ ఫిట్‌నెస్ సాధించడంతో.. పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న కేఎల్ రాహుల్‌పై కూడా వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
గురువారం ఉదయం 9 గంటలకి భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్‌కి టాస్ పడనుంది.