India Predicted Final XI: శాంసన్‍కు నో ప్లేస్! సుందర్‌కు డౌటే.. శ్రీలంకతో తొలి టీ20లో భారత తుది జట్టు ఇలా..
India Predicted Final XI: శ్రీలంకతో టీ20 సిరీస్‍కు భారత్ సిద్ధమైంది. సూర్యకుమార్ కొత్త కెప్టెన్‍గా నియమితుడు కాగా.. గౌతమ్ గంభీర్ హెడ్‍కోచ్‍గా ప్రస్థానాన్ని మొదలుపెట్టనున్నాడు. ఈ మ్యాచ్‍లో భారత తుది జట్టులో ఎలా ఉండొచ్చో ఇక్కడ చూడండి.
శ్రీలంక గడ్డపై భారత క్రికెట్ సమరం షురూ కానుంది. లంకతో మూడు టీ20ల సిరీస్, మూడు వన్డే సిరీస్‍లను టీమిండియా ఆడనుంది. టీ20 సిరీస్‍ను భారత్ రేపు (జూలై 27) మొదలుపెట్టనుంది. పల్లెకెలే వేదికగా రేపు టీమిండియా, శ్రీలంక మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‍కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. భారత టీ20 జట్టు రెగ్యులర్ కెప్టెన్‍గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యత తీసుకుంటున్నాడు. టీమిండియా హెడ్‍కోచ్‍గా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాడు. శ్రీలంకతో ఈ తొలి టీ20లో భారత తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా ఉంది.
కీపర్‌గా పంతే
శ్రీలంకతో టీ20లకు తుది జట్టును ఎంపిక చేయడం టీమిండియా మేనేజ్‍మెంట్‍కు కాస్త సవాలుగానే ఉంది. కొన్ని పొజిషన్లకు ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయి. దీంతో తుదిజట్టులో ఎవరిని తీసుకోవాలనే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. అయితే, వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‍నే తీసుకునే అవకాశాలే ఎక్కువ. అందుకే తొలి టీ20లో తుదిజట్టులో సంజూ శాంసన్‍కు చోటు దక్కదు.
పంత్‍ను బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలోనే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో దిగుతాడు. వైస్ కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురైన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా తుదిజట్టులో ఉంటాడు. శుభ్‍మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా ఉంటారు. గత నెల ప్రపంచకప్ గెలుపు తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు గుడ్‍బై చెప్పేయడంతో భారత టీ20 టీమ్‍లో యువకులతో కళకళలాడుతోంది. సీనియర్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా.. లంకతో పర్యటనకు విశ్రాంతి తీసుకున్నాడు.
సుందర్ వర్సెస్ అక్షర్
స్పిన్ ఆల్‍రౌండర్‌గా తుది జట్టులో ఎవరికి చోటివ్వాలనేది కూడా కీలక విషయంగా మారింది. అయితే, వాషింగ్టన్ సుందర్ కంటే అక్షర్ పటేల్ వైపే మేనేజ్‍మెంట్ మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. జింబాబ్వేతో సిరీస్‍లో సుందర్ రాణించినా.. లంకతో మ్యాచ్‍లో చోటు దక్కడం కష్టమే. రవి బిష్ణయ్ రెగ్యులర్ స్పిన్నర్‌గా ఉండనుండగా.. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ ఉండే అవకాశం ఉంది. సిరాజ్ కాకపోతే ఖలీల్ అహ్మద్‍ను తీసుకునే ఛాన్స్ ఉంటుంది. రింకూ సింగ్, శివం దూబే కూడా తొలి టీ20లో భారత తుదిజట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమే.
లంకతో తొలి టీ20కి భారత తుదిజట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్) సూర్యకుమార్ యాదవ్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్
భారత్, శ్రీలంక తొలి టీ20 టైమ్, స్ట్రీమింగ్
భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20 రేపు (జూలై 27) పల్లెకెలే అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ షురూ కానుంది. ఇందుకు అరగంట ముందు టాస్ పడుతుంది.
శ్రీలంకతో భారత్ ఆడనున్న ఈ సిరీస్.. సోనీ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో ప్రసారం అవుతుంది. డిజిటల్ విషయానికి వస్తే, సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.