Suryakumar Yadav: కెప్టెన్‍ను అయినా ఆ స్టైల్ మారదు: సూర్యకుమార్ యాదవ్.. హార్దిక్ పాండ్యాపై కూడా కామెంట్-my brand of cricket remains same says suryakumar yadav ahead of 1st t20 vs sri lanka also commented on hardik pandya ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Suryakumar Yadav: కెప్టెన్‍ను అయినా ఆ స్టైల్ మారదు: సూర్యకుమార్ యాదవ్.. హార్దిక్ పాండ్యాపై కూడా కామెంట్

Suryakumar Yadav: కెప్టెన్‍ను అయినా ఆ స్టైల్ మారదు: సూర్యకుమార్ యాదవ్.. హార్దిక్ పాండ్యాపై కూడా కామెంట్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 26, 2024 04:09 PM IST

Suryakumar Yadav: భారత టీ20 జట్టుకు కొత్త ఫుల్ టైమ్ కెప్టెన్‍గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. శ్రీలంకతో రేపు (జూలై 27) జరిగే తొలి టీ20తో కెప్టెన్సీని మొదలుపెట్టనున్నాడు. ఈ తరుణంలో నేడు మీడియాతో సూర్య మాట్లాడాడు.

Suryakumar Yadav: కెప్టెన్‍ను అయినా ఆ స్టైల్ మారదు: సూర్యకుమార్ యాదవ్.. హార్దిక్ పాండ్యాపై కూడా కామెంట్
Suryakumar Yadav: కెప్టెన్‍ను అయినా ఆ స్టైల్ మారదు: సూర్యకుమార్ యాదవ్.. హార్దిక్ పాండ్యాపై కూడా కామెంట్ (PTI)

ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సాధించిన తర్వాత భారత జట్టులో కీలక మార్పులు వచ్చాయి. అంతర్జాతీయ టీ20లకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా గుడ్‍బై చెప్పారు. వన్డేలు, టెస్టులే ఆడేందుకు నిర్ణయించుకున్నారు. టీ20ల నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడంతో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యానే తదుపరి భారత జట్టు టీ20 కెప్టెన్ అనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‍ను భారత టీ20 జట్టుకు కెప్టెన్‍ను చేశారు సెలెక్టర్లు.

శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‍లో టీమిండియాకు కెప్టెన్సీ చేయనున్నాడు సూర్యకుమార్ యాదవ్. రేపు (జూలై 27) శ్రీలంకతో జరగనున్న తొలి టీ20తోనే రెగ్యులర్ కెప్టెన్‍గా మారనున్నాడు. ఈ తరుణంలో ఈ మ్యాచ్ ముందు నేడు (జూలై 26) మీడియా సమావేశంలో సూర్య మాట్లాడాడు.

ఆ స్టైల్ మారదు

విధ్వంసకర హిట్టింగ్‍కు సూర్యకుమార్ యాదవ్ కేరాఫ్ అడ్రస్‍గా ఉంటాడు. విభిన్నమైన షాట్లతో ధనాధన్ ఆట ఆడతాడు. అయితే, కెప్టెన్సీ బాధ్యత వచ్చాక ఎలా ఆడతాడోననే సందేహాలు ఉన్నాయి. అయితే, తాను కెప్టెన్‍ను అయినా తన దూకుడైన స్టైల్‍లో ఏ మాత్రం మార్పు ఉండదని సూర్యకుమార్ యాదవ్ చెప్పేశాడు. “కెప్టెన్సీ నాకు అదనపు బాధ్యతను ఇచ్చింది. కానీ నా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అలాగే ఉంటుంది” అని మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పేశాడు సూర్య. తన మార్క్ ఆట కొనసాగిస్తానని అన్నారు.

హార్దిక్ పాండ్యాపై..

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20ల్లో హార్దిక్ పాండ్యా ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇక నుంచి జట్టులో హార్దిక్ రోల్ ఎలా ఉంటుందనే ప్రశ్న సూర్యకు ఎదురైంది. టీమిండియాలో హార్దిక్ చాలా ముఖ్యమైన ప్లేయర్ అని సూర్య స్పష్టం చేశాడు. “భారత జట్టులో హార్దిక్ పాండ్యా పాత్ర చాలా కీలకమైనది. అతడి రోల్ గతంలోలానే ఉంటుంది. టీమిండియాలో అతడు చాలా ముఖ్యమైన ప్లేయర్” అని సూర్య అన్నాడు.

భారత జట్టులో పెద్దగా మార్పులు జరగలేదని, కెప్టెన్ ఒకడే మారాడని సూర్యకుమార్ యాదవ్ చెప్పారు. కెప్టెన్‍గా కంటే రోహిత్ శర్మ నాయకుడిగా ఉంటారని, తాను కూడా అతడినే ఫాలో అవ్వాలని అనుకుంటున్నట్టు వెల్లడించాడు.

హార్దిక్ పాండ్యాను కాకుండా భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్‍ను కెప్టెన్ చేయడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవలే లంక పర్యటనకు భారత్ వెళ్లే ముందుకు స్పందించారు. హార్దిక్ పాండ్యా ఫిట్‍నెస్‍ విషయంలో ఆందోళలు ఉన్నాయని, జట్టుకు ఎక్కువ అందుబాటులో ఉండే ప్లేయర్ కెప్టెన్‍గా ఉంటే మంచిదని అనుకున్నామని అన్నారు. అందుకే సూర్యకు కెప్టెన్సీ ఇచ్చామని చెప్పారు. ఇతర ఆటగాళ్ల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నామనేలా చెప్పారు.

భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ రేపటి (జూలై 27) నుంచి జూలై 30వ తేదీ వరకు జరగనుంది. ఈ సిరీస్‍కు సూర్య కెప్టెన్సీ చేయనున్నాడు. శ్రీలంకతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు జరగనుంది. వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ పర్యటనతోనే టీమిండియా హెడ్‍కోచ్‍గా ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నాడు మాజీ స్టార్ బ్యాటర్ గౌతమ్ గంభీర్.

Whats_app_banner