Mohammed Shami: అందుకు చాలా టైమ్ ఉంది.. కానీ: గాయంపై అప్‍డేట్ ఇచ్చిన పేసర్ మహమ్మద్ షమీ
Mohammed Shami: స్టార్ పేసర్ మహమ్మద్ షమీ.. మళ్లీ భారత జట్టులోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ తరుణంలో తన గాయంపై షమీ అప్‍డేట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‍కు సిద్ధమవడంపై కూడా మాట్లాడాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ గాయం వల్ల సుమారు 11 నెలలుగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాతి నుంచి బరిలోకి దిగలేదు. దీంతో షమీ మళ్లీ భారత జట్టులోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. చీలమండకు గాయం వల్ల ఈ ఏడాది మొదట్లో షమీ సర్జరీ చేయించుకున్నాడు. క్రమంగా కోలుకుంటున్నాడు.
గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‍తో పాటు ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సహా మరిన్ని సిరీస్‍ను షమీ ఆడలేకపోయాడు. ఈ ఏడాది దులీప్ ట్రోఫీ ద్వారా మళ్లీ బరిలోకి దిగుతాడనే అంచనాలు వచ్చినా అలా జరగలేదు. ఇప్పుడిప్పుడే షమీ ఫిట్‍నెస్ సాధిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు.
ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఈ ఏడాది నవంబర్ 22వ తేదీన మొదలుకానుంది. ఈ సిరీస్‍కు షమీ సిద్ధమవుతాడని, జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో విషయంపై నేడు షమీ మాట్లాడాడు. తన గాయం గురించి అప్‍డేట్ ఇచ్చాడు.
దానికి చాలా టైమ్ ఉంది
ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మహమ్మద్ షమీకి.. ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడతారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందించాడు. ఆ సిరీస్‍కు ఇంకా చాలా టైమ్ ఉందని, కానీ ఎంత బలంగా వెళతాననే ఆలోచన తనకు ఇప్పటి నుంచే ఉందని అన్నాడు. “ఆస్ట్రేలియా సిరీస్‍కు నేను ఉంటానా లేదా అనే చర్చ చాలా రోజులుగా సాగుతుంది. అయితే దానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఎలా ఫిట్‍గా ఉండగలుగుతాననే, ఎంత బలంగా మారి అక్కడికి వెళ్లాలనే విషయాలు నా మెదడులో ఉన్నాయి” అని మహమ్మద్ షమీ చెప్పాడు.
మోకాలు బాగానే ఉంది
ప్రస్తుతం తన మోకాలు బాగానే ఉందని షమీ చెప్పాడు. “మోకాలు బాగానే ఉంది. ఫిట్‍నెస్ మెరుగ్గా ఉంది. పురోగతి ఇలాగే ఉంటుందని అనుకుంటున్నా. ఫూర్తిగా ఫిట్‍నెస్ సాధించాక మళ్లీ బరిలోకి దిగుతా” అని షమీ చెప్పాడు.
షమీ ప్రాక్టీస్
ఇటీవలే న్యూజిలాండ్‍తో భారత్ తొలి టెస్టులో ఓటమి పాలైంది. అదే రోజు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో షమీ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఫుల్ రనప్‍తో బంతులు వేశాడు. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్ మార్న్ మోర్కల్ కూడా షమీ ప్రాక్టీస్ చేసే సమయంలో అక్కడ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆస్ట్రేలియా సిరీస్‍కు షమీ వస్తాడా అని న్యూజిలాండ్‍తో తొలి టెస్టు తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రశ్న ఎదురైంది. దీనికి హిట్‍మ్యాన్ సమాధానం ఇచ్చాడు. షమీ మోకాలిలో ఇంకా ఇబ్బంది ఉందని, కోలుకోవడం కాస్త ఆలస్యమవుతోందని చెప్పాడు. ప్రస్తతం ఎన్‍సీఏలో కోలుకుంటున్నాడని అన్నాడు. పూర్తి ఫిట్‍నెస్ సాధించేందుకు వేచిచూస్తున్నామని తెలిపాడు. ఆస్ట్రేలియా సిరీస్‍కు షమీ ఉంటాడా అనేది ఇప్పుడే చెప్పలేమని రోహిత్ శర్మ తెలిపాడు.