Rohit Sharma: తొలి టెస్టులో తప్పుల్ని ఒప్పుకున్న రోహిత్ శర్మ, పర్యావసానాల్ని అనుభవిస్తున్నామంటూ ఆవేదన-indian skipper rohit sharma breaks silence on first test defeat against new zealand ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: తొలి టెస్టులో తప్పుల్ని ఒప్పుకున్న రోహిత్ శర్మ, పర్యావసానాల్ని అనుభవిస్తున్నామంటూ ఆవేదన

Rohit Sharma: తొలి టెస్టులో తప్పుల్ని ఒప్పుకున్న రోహిత్ శర్మ, పర్యావసానాల్ని అనుభవిస్తున్నామంటూ ఆవేదన

Galeti Rajendra HT Telugu
Oct 20, 2024 06:17 PM IST

India vs New Zealand 1st Test: భారత్ గడ్డపై 36 ఏళ్ల తర్వాత టీమిండియాని తొలిసారి న్యూజిలాండ్ జట్టు ఓడించగా.. 46 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైన రోహిత్ సేన భంగపాటుకి గురైంది.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఓటమికి గల కారణాల్ని, మ్యాచ్‌లో టీమిండియా చేసిన తప్పుల్ని కెప్టెన్ రోహిత్ శర్మ నిజాయతీగా ఒప్పుకున్నాడు. ఆదివారం ముగిసిన ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోగా.. రెండో టెస్టు మ్యాచ్ పుణె వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానుంది.

మ్యాచ్ తర్వాత ప్రెస్‌తో మాట్లాడిన రోహిత్ శర్మ కాస్త ఎమోషనల్‌గా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకి సమాధానమిచ్చాడు. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌటై పరువు పోగొట్టుకోగా.. న్యూజిలాండ్ టీమ్ దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై టెస్టుల్లో మళ్లీ గెలుపు రుచి చూసింది.

కేఎల్ రాహుల్‌పై వేటు?

తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటవడంపై అడిగిన ప్రశ్నకి రోహిత్ శర్మ స్పందిస్తూ కేవలం ఆ మూడు గంటలు భారత జట్టు సామర్థ్యాన్ని నిర్ణయించలేమని, ఆ ఇన్నింగ్స్ ఆధారంగా ఆటగాళ్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది అన్యాయమే అవుతుందని చెప్పుకొచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఘోరంగా విఫలమైన కేఎల్ రాహుల్‌పై వేటు వేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.

‘‘నిజం చెప్పాలంటే ఈ టెస్టు మ్యాచ్‌పై నేను ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే ఆ మూడు గంటలు జట్టు స్టామినా ఏంటో నిర్ణయించవు. ఆ ఇన్నింగ్స్ ఆధారంగా ఆటగాళ్ల సామర్థ్యాన్ని జడ్జ్ చేయడం అన్యాయం. జట్టులో సానుకూల వాతావరణం నెలకొనడం చాలా ముఖ్యం’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

పొరపాట్లు చేసి.. పాఠాలు నేర్చుకున్నాం

‘‘ఈ మ్యాచ్లో మేం చిన్న చిన్న పొరపాట్లు చేశాం, దాని పర్యవసానాలను ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. కానీ అదంతా ముగిసింది. అక్టోబర్ 24 నుంచి పుణెలో ప్రారంభంకానున్న రెండో టెస్టుకు ముందు జట్టు పటిష్టతపై దృష్టి సారిస్తాం. వాస్తవానికి రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాట్‌తో మళ్లీ ఈ మ్యాచ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించాం. కానీ.. మేము ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయాము. అయితే ఈ ఓటమి కూడా మాకు చాలా మంచి విషయాలు నేర్పించింది’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

మెడనొప్పి కారణంగా ఈ టెస్టు మ్యాచ్‌కి శుభమన్ గిల్ దూరమవగా.. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ వీరోచిత శతకం (150 పరుగులు) బాదాడు. దాంతో పుణె టెస్టుకి గిల్ ఫిట్‌నెస్ సాధించినా.. సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి ఏర్పడింది.

దూకుడు కొనసాగిస్తాం

‘‘ఒకానొక దశలో మ్యాచ్‌లో మేం ముందంజలో ఉన్నట్లు అనిపించింది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ బ్యాటింగ్‌తో మేము 350 పరుగులు వెనుక ఉన్నామనే భావనే మాలో లేదు. మ్యాచ్‌కు శుభ్‌మన్ దూరం కావడం దురదృష్టకరం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సర్ఫరాజ్ సెంచరీ చేయడం జట్టుకు శుభసూచకం’’ అని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.

తొలి టెస్టులో ఓడినంత మాత్రాన భారత్ జట్టు దూకుడు వైఖరి మార్చుకోదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ‘‘ఒక మ్యాచ్ లేదా ఒక సిరీస్ ఆధారంగా మా మైండ్ సెట్‌ను మార్చుకోం. మ్యాచ్ ఓడిపోతామనే భయంతో మా మైండ్ సెట్‌లో మార్పులుండవు. ఆటలో మేం ఒత్తిడికి లోనుకావడం లేదా వెనుకబడటం లేదనే సందేశాన్ని ప్రత్యర్థికి పంపుతాం. బెంగళూరు టెస్టులోనూ మేము అదే చేశాం’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ మబ్బులు పట్టిన వాతావరణం బెంగళూరులో కనిపిస్తున్నా బ్యాటింగ్ ఎంచుకోవడం టీమిండియాకి శాపంగా మారింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. పిచ్‌ను అంచనా వేయలేకపోవడం తన తప్పిదమేనని రోహిత్ శర్మ అంగీకరించిన విషయం తెలిసిందే. 

Whats_app_banner