Rishabh Pant Injury: రెండో టెస్టుకు రిషబ్ పంత్ డౌటేనా? రోహిత్ శర్మ ఏమన్నాడంటే? వికెట్ కీపర్‌గా మళ్లీ అతడే-rishabh pant may miss 2nd test against new zealand captain rohit sharma hints dhruv jurel may return ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rishabh Pant Injury: రెండో టెస్టుకు రిషబ్ పంత్ డౌటేనా? రోహిత్ శర్మ ఏమన్నాడంటే? వికెట్ కీపర్‌గా మళ్లీ అతడే

Rishabh Pant Injury: రెండో టెస్టుకు రిషబ్ పంత్ డౌటేనా? రోహిత్ శర్మ ఏమన్నాడంటే? వికెట్ కీపర్‌గా మళ్లీ అతడే

Hari Prasad S HT Telugu
Oct 21, 2024 11:44 AM IST

Rishabh Pant Injury: న్యూజిలాండ్ తో జరగబోయే రెండో టెస్టుకు రిషబ్ పంత్ దూరం కానున్నాడా? తొలి టెస్టులో మోకాలి గాయానికి గురైన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసినా పూర్తి ఫిట్‌గా లేడని స్పష్టమవుతోంది.

రెండో టెస్టుకు రిషబ్ పంత్ డౌటేనా? రోహిత్ శర్మ ఏమన్నాడంటే? వికెట్ కీపర్‌గా మళ్లీ అతడే
రెండో టెస్టుకు రిషబ్ పంత్ డౌటేనా? రోహిత్ శర్మ ఏమన్నాడంటే? వికెట్ కీపర్‌గా మళ్లీ అతడే (PTI)

Rishabh Pant Injury: న్యూజిలాండ్ తో ఇండియా తొలి టెస్టు ఓడిపోయిందేమోగానీ రెండో ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి రిషబ్ పంత్ పోరాడిన తీరు మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఈ ఇద్దరి కారణంగా కివీస్ మరోసారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే పంత్ గాయం ఇప్పుడు ఇండియన్ టీమ్ ను ఆందోళనకు గురి చేస్తోంది. రెండో టెస్టు అతడు ఆడతాడా లేదా అన్నది ఇంకా తెలియడం లేదు.

రెండో టెస్టుకు పంత్ దూరం?

తొలి టెస్టు రెండో రోజు వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో జడేజా విసిరిన బంతి పంత్ మోకాలికి బలంగా తగిలింది. దీంతో అతడు వెంటనే ఫీల్డ్ వదిలేసి వెళ్లాడు. రెండో ఇన్నింగ్స్ లో గాయంతోనే బ్యాటింగ్ కు దిగాడు.

నొప్పితోనే 99 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో అతడు కీపింగ్ చేయలేదు. దీంతో రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రోహిత్ శర్మ ఏమన్నాడంటే?

రిషబ్ పంత్ గాయంపై తొలి టెస్టు ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. "అతనికి చాలా చిన్న చిన్న గాయాలయ్యాయి. మోకాలికి ఓ పెద్ద సర్జరీ కూడా జరిగింది. మానసికంగా చాలా బాధ అనుభవించాడు. అందుకే అతని విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాం.

కీపింగ్ చేసే సమయంలో ప్రతి బంతికి వంగాల్సి ఉంటుంది. అందుకే అతనికి వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇవ్వలేదు. తర్వాతి మ్యాచ్ కు 100 శాతం ఫిట్ గా ఉండాలన్నదే మా ఉద్దేశం. అతడు బ్యాటింగ్ చేసే సమయంలోనూ అతడు సులువుగా రన్నింగ్ చేయలేదు. కేవలం బౌండరీలు బాదడానికే ప్రయత్నించాడు" అని రోహిత్ శర్మ అన్నాడు.

రెండో టెస్టుకు పంత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానికి రోహిత్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే అతనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ లకే సెలక్షన్ కమిటీ వదిలేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు వెల్లడించింది.

మళ్లీ ధృవ్ జురెల్‌కు ఛాన్స్?

ఒకవేళ పంత్ రెండో టెస్టుకు దూరమైతే.. అతని స్థానంలో తుది జట్టులోకి ధృవ్ జురెల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్ తో సిరీస్ లో తొలిసారి టెస్టు టీమ్ లోకి అడుగుపెట్టిన అతడు.. మెరుగ్గా రాణించాడు. పంత్ రాకతో మళ్లీ దూరమయ్యాడు.

తొలి టెస్టులో పంత్ స్థానంలో సబ్‌స్టిట్యూట్ గా వికెట్ కీపింగ్ చేశాడు. రాబోయే ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో రిషబ్ పంత్ విషయంలో రిస్క్ తీసుకోవద్దని టీమ్ భావిస్తే.. అతని స్థానంలో ధృవ్ జురెల్ మళ్లీ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియా, న్యూజిలాండ్ రెండో టెస్టు గురువారం (అక్టోబర్ 24) నుంచి పుణెలో జరగనుంది.

Whats_app_banner