Rohit Sharma DRS: రిషబ్ పంత్ తప్పిదానికి.. గ్రౌండ్‌లోనే సిరాజ్‌కి సారీ చెప్పిన కెప్టెన్ రోహిత్ శర్మ
20 September 2024, 13:16 IST
IND vs BAN 1st Test Updates: వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాటల్ని నమ్మిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. రోహిత్ తప్పిదం కారణంగా చెపాక్ టెస్టులో సిరాజ్‌కి వికెట్ దూరమైంది.
జాకీర్ హసన్ ఔటైనట్లు చూపిస్తున్న రీప్లే
India vs Bangladesh 1st Test : చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. తొలి సెషన్‌లోనే భారత్ 27 పరుగుల వ్యవధిలోనే చివరి నాలుగు వికెట్లు కోల్పోయి 376 పరుగులకి ఆలౌటైంది. అనంతరం అనంతరం తొలి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్ టీమ్ లంచ్ లోపే 26/3తో కష్టాల్లో పడింది. చెపాక్‌లో కేవలం 120 నిమిషాల వ్యవధిలో 7 వికెట్లు పడటంతో మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ కోరే విషయంలో ఈరోజు తప్పిదం చేశాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ జకీర్ హసన్ ఆరంభంలోనే వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దాంతో డీఆర్‌ఎస్ కోరాల్సిందిగా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కోరినా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాటల్ని అతిగా నమ్మిన రోహిత్ శర్మ నిరాకరిచాడు. కానీ రిప్లైలో హసన్ ఔట్ అని తేలింది.
పంత్‌ను నమ్మిన రోహిత్ శర్మ
ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో సిరాజ్ విసిరిన బంతిని లెగ్ సైడ్ ప్లిక్ చేసేందుకు హసన్ ప్రయత్నించాడు. కానీ బ్యాట్ దొరకని బంతి నేరుగా వెళ్లి ఫ్యాడ్‌ను తాకింది. దాంతో ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం భారత్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్‌ను తిరస్కరించాడు. వెంటనే డీఆర్‌ఎస్ కోరాని సిరాజ్ కోరాడు. కానీ పంత్‌తో మాట్లాడిన రోహిత్ శర్మ.. బంతి వికెట్ల పైన వెళ్తోందని భావించాడు. అదే విషయాన్ని పంత్ కూడా నిర్ధారించాడు. కానీ రీప్లేలో పంత్ అంచనా తప్పు అని తేలింది.
ఆ ఓవర్ ముగిసిన తర్వాత స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌పై రీప్లే చూపించారు. హసన్ ఔట్ అని రీప్లేలో కనిపించగానే వికెట్ చేజారినందుకు సిరాజ్ బాధపడుతూ కనిపించాడు. అది గమనించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. అతని వద్దకు వెళ్లి చేతులు పట్టుకుని క్షమాపణలు చెప్పాడు. పంత్ కూడా వికెట్ల వెనుక నుంచి సిరాజ్‌కి సారీ చెప్తూ కనిపించాడు.
అంచనా వేయలేకపోయిన పంత్
సాధారణంగా వికెట్ కీపర్ బంతి గమనాన్ని అంచనా వేయగలరు. కానీ సిరాజ్ బౌలింగ్‌లో పంత్ ఆఫ్ స్టంప్‌కి చాలా వెలుపలగా ఉండటంతో బంతిని అంచనా వేయలేకపోయాడు. అనుభవపూర్వకంగా కీపర్లు ఆ అంచనాపై పట్టు సాధిస్తారు. మహేంద్రసింగ్ ధోనీ చక్కగా అంచనా వేయగలడు. సిరాజ్ పరిస్థితిని కామెంట్రీ బాక్స్ నుంచి చూసిన రవిశాస్త్రి ‘‘సిరాజ్‌కి రీప్లే చూపించొద్దు. అతను సంతోషంగా ఉండడు’’ అంటూ చమత్కరించాడు.
కాసేపటికే జాకీర్ హసన్‌ని మరో ఫాస్ట్ బౌలర్ అక్షదీప్ ఔట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 22 బంతులు ఎదుర్కొన్న జాకీర్ 3 పరుగులే చేసి ఔటయ్యాడు. బంగ్లాదేశ్ టీమ్ 18 ఓవర్లు ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 64/5తో నిలిచింది. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకి ఆలౌటవగా.. బంగ్లాదేశ్ టీమ్ ఇంకా 312 పరుగులు వెనకబడి ఉంది.