IND vs BAN: బంగ్లాదేశ్ కీపర్ తలమీదుగా సిక్స్ కొట్టి.. టాటూ చూపించిన రింకు సింగ్
10 October 2024, 8:00 IST
Rinku Singh Six: రింకు సింగ్ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో.. ఆ తర్వాత బంతిని బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ తనీజ్ కావాలనే రింకు శరీరంపైకి ఫుల్ టాస్ రూపంలో విసిరాడు. అయితే.. రింకుకి లక్ కలిసి రావడంతో ఆ బంతి సిక్స్‌గా వెళ్లింది.
రింకు సింగ్
భారత్ టీ20 జట్టులో పవర్ హిట్టర్ రింకు సింగ్ పాగా వేసినట్లు కనిపిస్తోంది. ఐపీఎల్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన రింకు సింగ్.. బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లోనూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో కీపర్ తలమీదుగా రింకు సింగ్ కొట్టిన సిక్స్ అందర్నీ ఆశ్చర్యపరిచింది.
మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన బంగ్లాదేశ్ టీమ్ 135/9కే పరిమితమైంది. మ్యాచ్‌లో 29 బంతులు ఎదుర్కొన్న రింకు సింగ్ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఔట్ అనుకుంటే.. సిక్స్‌గా
యంగ్ క్రికెటర్ నితీశ్ రెడ్డితో కలిసి 4వ వికెట్‌కి 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రింకు సింగ్.. బంగ్లాదేశ్ బౌలర్లతో కాసేపు వరుసగా భారీ షాట్లు ఆడుతూ ఆడుకున్నాడు. ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ తనీజ్ హసన్ షకీబ్ బౌలింగ్‌లో రింకు సింగ్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు.
ఈ నేపథ్యంలో ఆ ఓవర్ ఆఖరి బంతిని గంటకి 138.6 కి.మీ వేగంతో ఫుల్ టాస్ రూపంలో రింకు సింగ్ శరీరంపైకి తనీజ్ విసిరాడు. ఊహించని ఆ బంతిని మిడ్ వికెట్ దిశగా హిట్ చేయాలని రింకు సింగ్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిట్టన్ దాస్ తల మీదుగా వెళ్లి బౌండరీ లైన్ అవల సిక్స్‌గా పడింది. క్యాచ్‌గా వెళ్లినట్లు తొలుత కనిపించిన బంతి ఎవరూ దాంతో నమ్మలేనట్లు సిక్స్‌గా వెళ్లింది. దాంతో బౌలర్‌తో పాటు బంగ్లాదేశ్ ప్లేయర్లు చూస్తుండిపోయారు.
టాటూ వెనుక.. 5 సిక్సర్లు
ఆ షాట్ విషయంలో రింకు సింగ్‌కి అదృష్టం కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. సాధారణంగా ఇలా టాప్ ఎడ్జ్ తాకే బంతులు వికెట్ కీపర్ లేదా థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేస్తాయి. కానీ.. బంతి వచ్చిన స్పీడ్, రింకు సింగ్ బ్యాట్ స్వింగ్ మ్యాచ్ అవడంతో అది సిక్స్‌గా వెళ్లింది. ఆ సిక్స్‌తో రింకు సింగ్ హాఫ్ సెంచరీ పూర్తవగా.. తన చేతిపై ఉన్న టాటూని చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు.
ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ బౌలింగ్‌లో రింకు సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు కొట్టాడు. తన కెరీర్‌ని మార్చిన ఆ ఐదు సిక్సర్లను ప్రతిబింబిస్తూ గాడ్స్ ప్లాన్ అంటూ రింకు సింగ్ టాటూ కూడా వేయించుకున్నాడు. ఢిల్లీ 20లో సిక్స్‌తో హాఫ్ సెంచరీ తర్వాత ఆ టాటూనే చూపిస్తూ రింకు సంబరాలు చేసుకున్నాడు.
రింకు సింగ్‌పై ప్రశంసలు
మ్యాచ్ తర్వాత రింకు సింగ్ గురించి ప్రత్యేకంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘ఒక కెప్టెన్‌గా టీమ్‌లో ఇలాంటి బ్యాటర్ ఉండాలని నేను కోరుకున్నాను. రింకు, నితీశ్ బ్యాటింగ్ చేసిన తీరుపట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఆశించిన విధంగానే బ్యాటింగ్ చేశారు’’ అని కొనియాడాడు.
టాపిక్