Nitish Reddy: ఫస్ట్ టీ20లో మిస్.. రెండో టీ20లో దొరికిపోయిన బంగ్లాదేశ్ బౌలర్లు-india youngster nitish kumar reddy repays captains trust with 34 ball 74 in delhi t20 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Nitish Reddy: ఫస్ట్ టీ20లో మిస్.. రెండో టీ20లో దొరికిపోయిన బంగ్లాదేశ్ బౌలర్లు

Nitish Reddy: ఫస్ట్ టీ20లో మిస్.. రెండో టీ20లో దొరికిపోయిన బంగ్లాదేశ్ బౌలర్లు

Galeti Rajendra HT Telugu
Oct 09, 2024 09:06 PM IST

India vs Bangladesh 2nd T20: భారత్ జట్టులోకి గత ఆదివారం గ్వాలియర్ టీ20తో ఎంట్రీ ఇచ్చిన విశాఖపట్నం కుర్రాడు నితీశ్ రెడ్డి బుధవారం బంగ్లాదేశ్ బౌలర్లకి రెండో టీ20లో వరుస సిక్సర్లతో చుక్కలు చూపించేశాడు.

నితీశ్ రెడ్డి
నితీశ్ రెడ్డి (AFP)

బంగ్లాదేశ్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. భారత్ జట్టులోకి గత ఆదివారం ఎంట్రీ ఇచ్చిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ఈరోజు మ్యాచ్‌లో కేవలం 34 బంతుల్లోనే 7 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆరంభంలోనే నితీశ్ రెడ్డి అటాక్

వాస్తవానికి ఈరోజు మ్యాచ్‌లో భారత్ జట్టుకి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు సంజు శాంసన్ (10), అభిషేక్ శర్మ (15) తక్కువ స్కోరుకే ఔటైపోగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8) కూడా తేలిపోయాడు. ఈ దశలో క్రీజులో నిలిచిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డి.. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేకపోయినా తెగింపుతో బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు.

ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన స్పిన్నర్ మహ్మదుల్లా నోబాల్ వేయగా.. ఫ్రీహిట్ రూపంలో లభించిన బంతిని సిక్స్‌గా మలిచిన నితీశ్ రెడ్డి ఇక అక్కడి నుంచి ఔట్ అయ్యే వరకూ టాప్‌గేర్‌లోనే హిట్టింగ్ చేశాడు. ఆ తర్వాత 10 ఓవర్ వేసిన రిషాద్ హుస్సేన్ బౌలింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదేసిన నితీశ్ రెడ్డి.. 13 ఓవర్ వేసిన మెహదీ హసన్ బౌలింగ్‌లోనూ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో కేవలం 27 బంతుల్లోనే అతను 50 పరుగుల మార్క్‌ని అందుకున్నాడు.

ఫస్ట్ మ్యాచ్‌లో మిస్..

ఇంటర్నేషన్ క్రికెట్‌లో నితీశ్ రెడ్డికి ఇదే ఫస్ట్ హాఫ్ సెంచరీకాగా.. రింకూ సింగ్ (53: 29 బంతుల్లో 5x4, 3x6)తో కలిసి నాలుగో వికెట్‌కి ఏకంగా 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దెబ్బకి మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

లాస్ట్ టీ20 హైదరాబాద్‌లో

గత ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో నితీశ్ రెడ్డికి ఎక్కువ బంతులు ఆడే అవకాశం దక్కలేదు. ఆ మ్యాచ్‌లో 15 బంతులాడిన నితీశ్ ఒక సిక్స్ సాయంతో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పవర్ హిట్టర్‌గా పేరున్న నితీశ్ రెడ్డి తొలి టీ20లో కూడా భారీ షాట్స్ ఆడుతూ కనిపించాడు. కానీ.. ఎక్కువ బంతులు అవకాశం దక్కలేదు. 

కానీ.. రెండో టీ20లో 3 ఓవర్‌లోనే బ్యాటింగ్‌కి వచ్చి బంగ్లాదేశ్ బౌలర్లని ఉతికారేశాడు. దాంతో బంగ్లాదేశ్ బౌలర్లు తప్పించుకోలేకపోయారు. నితీశ్‌ను కట్టడి చేయలేక ఒకానొక దశలో బంగ్లాదేశ్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. భారత్ జట్టులో రెండో మ్యాచ్‌తోనే తన మార్క్‌ని చూపించిన నితీశ్ రెడ్డి.. టీమ్‌లో పాగా వేసినట్లే కనిపిస్తోంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఆఖరి టీ20 మ్యాచ్ శనివారం హైదరాబాద్ వేదికగా జరగనుంది.

Whats_app_banner